Chandrayaan-3 ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్.. తొలి మెసేజ్ పంపింది..!
ప్రపంచంలోనే తొలిసారిగా చంద్రుని దక్షిణ ధ్రువంపై సేఫ్ ల్యాండింగ్ చేసేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 కీలక ప్రక్రియను పూర్తిచేసుకుంది. చంద్రునికి మరింత దగ్గరగా ప్రయాణించేందుకు వీలుగా ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా విడిపోయింది. ఫలితంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుని వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
దీంతో విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ చంద్రుని చుట్టు సొంతంగా ప్రయాణం సాగించనుంది. ఆగస్టు 18, 20 తేదీల్లో డీ ఆర్బిట్-1, డీ-ఆర్బిట్-2 ప్రక్రియలను చేపడతామని ఇస్రో వెల్లడించింది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయిన తర్వాత "థ్యాంక్స్ ఫర్ ది రైడ్, మేట్" అనే మెసేజ్ పంపినట్లు ఇస్రో తన ట్విట్టర్ (X) ద్వారా వెల్లడించింది.

దీని తర్వాత ఇస్రో కీలక ప్రక్రియను చేపట్టనుంది. విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుని దక్షిణ ధ్రువంపై సేఫ్ ల్యాండింగ్ అయ్యేలా చర్యలు చేపట్టనుంది. దక్షిణ ధ్రువంపై సుమారు 70 డిగ్రీల వద్ద ల్యాండింగ్ అయ్యేలా సర్వం సిద్ధం చేసింది. ల్యాండింగ్ సమయంలో ల్యాండర్ వేగం క్రమంగా తగ్గేలా చూడనున్నారు.
అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 23న సాయంత్రం 5:47 నిమిషాలకు చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ కానుంది. అనంతరం విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి.. చంద్రుని ఉపరితలంపై ప్రయోగాలు నిర్వహించనుంది. సుమారు 14 రోజులపాటు అక్కడ కీలక పరిశోధనలు ప్రయోగాలు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోటలోని అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి జులై 14 మధ్యాహ్నం 2.35 నిమిషాలకు చంద్రయాన్-3ను ఇస్రో ప్రయోగించింది. 2008లో చంద్రుడిపై ప్రయోగాలను భారత్ ప్రారంభించింది. అప్పట్లో చంద్రయాన్-1ను ప్రయోగించింది. అందులో భాగంగా ప్రయోగించిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ చంద్రుడిని నీరు ఉనికి ఉందని తొలిసారిగా కనుగొంది. అనంతరం చంద్రుడి మీదకు ల్యాండర్ దించి చంద్రుని దక్షిణ ద్రువం పైనా పరిశోధనలు చేయాలనేది చంద్రయాన్ మిషన్ ముఖ్య ఉద్దేశం.
ఇందుకోసం 2019 జులై 22న చంద్రయాన్-2ను ఇస్రో ప్రయోగించింది. ఇందులో భాగంగా ల్యాండర్, రోవర్‌ను చంద్రుడిపై సురక్షితంగా ల్యాండింగ్ చేయాలన్నది ఇస్రో ఆలోచన. అయితే అనుకున్న విధంగానే ఆర్పిటర్ విడిపోయింది. చంద్రుడిని కేవలం 2 కిలోమీటర్ల ఎత్తులో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఫలితంగా అత్యంత వేగంగా ఈ రెండు చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టాయి.
చంద్రుని ఉపరితలంపైకి ఇప్పటికే అమెరికా, చైనా, రష్యా తమ ల్యాండర్లను పంపాయి. ఇప్పటివరకు ఎవరూ వెళ్లని చంద్రుని దక్షిణ ధ్రువంపైన ల్యాండర్‌ను దించి, అక్కడ కీలక పరిశోధనలు చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎన్నో సంవత్సరాల నుంచి సూర్యకాంతి చేరుకోని ఎన్నో ప్రాంతాలున్నాయని ఇస్రో భావిస్తోంది. అలాంటి చోట ప్రయోగాలు నిర్వహించి విశ్వం పుట్టుగ రహస్యాలు, భవిష్యత్‌లో చంద్రుడిపై మానవులు నివసించేందుకు గల అవకాశాలపై ప్రయోగాలు చేయనుంది.
చంద్రయాన్3 చంద్రుని వైపు ప్రయాణిస్తున్న సమయంలోనే.. చాలా సంవత్సరాల విరామం తర్వాత రష్యా ఈ నెల 11న లూనా 25 అంతరిక్ష నౌకను ప్రయోగించింది. అయితే రష్యా ప్రయోగించిన రాకెట్.. చంద్రయాన్ 3 కంటే ముందుగానే చంద్రునిపై సేఫ్ ల్యాండింగ్ కానుందని చెబుతున్నారు. రష్యా కూడా చంద్రుని దక్షిణ ధ్రువంపైనే ల్యాండింగ్‌కు సర్వం సిద్ధం చేసింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








