chandrayaan-3 చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతానికి పేరుపెట్టిన ప్రధాని మోడీ..
చంద్రయాన్-3 విజయంపై ఇప్పటికే ఇస్రో బృందాన్ని ప్రధాని మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. ఆగస్టు 23 సాయంత్రం 6:04 చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో దక్షిణ ఆఫ్రికా పర్యటనలో ఉన్న మోడీ.. వర్చువల్‌గా ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. విదేశీ పర్యటన ముగించుకొని నేరుగా బెంగళూరులోని ఇస్రో కార్యాలయానికి ఈ ఉదయం ప్రధాని చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోడీ అభినందించారు. ఇస్రో సీనియర్ శాస్త్రవేత్తలతో మోడీ మాట్లాడారు. చంద్రయాన్-3 డెరైక్టర్ పి. వీరముత్తువేల్‌ను... ప్రధాని మోడీ చంద్రయాన్-3 నమూనాతో సత్కరించారు. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ ఇస్రో క్యాంపస్‌లో ఉంచారు. ల్యాండర్‌లోని సోలార్ ప్యానల్‌లు ఎలా పనిచేస్తాయో శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. ల్యాండర్ నుంచి రోవర్ ఎలా బయటకు వచ్చింది కూడా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రధానికి వివరించారు.

అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడారు. దీంతోపాటు కీలక ప్రకటన చేశారు. చంద్రయాన్-2 మిషన్‌లో విక్రమ్ ల్యాండర్ పడిపోయిన ప్రదేశానికి 'తిరంగా పాయింట్' అని పేరుపెట్టారు. అలాగే చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయిన ప్రాంతాన్ని 'శివశక్తి' పేరు పెడుతున్నట్లు చెప్పారు. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయిన ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఆగస్టు 23న ఇస్రో చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ దేశమూ వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేసి.. యావత్ ప్రపంచం భారత్ వైపు చూసేలా చేసింది. ఆగస్టు 23 సాయంత్రం 6:04 నిమిషాలకు సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. అనంతరం సరిగ్గా నాలుగు గంటల తర్వాత ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చింది.

ప్రగ్యాన్ రోవర్ సెకనుకు సెంటీమీటర్ వేగంతో చంద్రుడి మీద ప్రయాణం చేస్తోంది. మొత్తం 14 రోజులపాటు చంద్రుడిపై వివిధ రకాల పర్యటనలు చేయనుంది. ఇప్పటికే ఈ రోవర్ పనితీరుపై ఇస్రో కీలక ప్రకటన చేసింది. రోవర్‌లో ఉన్న అన్ని పేలోడ్‌లు సక్రమంగా పనిచేస్తున్నాయని తెలిపింది.
ఇప్పటి వరకు చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ప్రపంచంలోనే తొలిసారిగా భారత్ మాత్రమే సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. కానీ చంద్రుడి ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. ఈ జాబితాలో నాలుగో స్థానానికి భారత్ చేరింది.

2008 నుంచి చంద్రునిపై ఇస్రో ప్రయోగాలు చేస్తోంది. అప్పట్లో చంద్రయాన్-1ను ప్రయోగించింది. అందులో భాగంగా ప్రయోగించిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ చంద్రుడిపై నీటి ఉనికి తొలిసారిగా గుర్తించింది. అనంతరం 2019 జులై 22న ఇస్రో చంద్రయాన్-2ను ప్రయోగించింది. ఇందులో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై సురక్షితంగా ల్యాండింగ్ చేయాలన్నది ఇస్రో ఆలోచన.
అయితే చివరి వరకు అంతా సవ్యంగా జరిగినా.. సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో చంద్రుడి ఉపరితలానికి కేవలం 2 కిలోమీటర్లు ఎత్తులో విక్రమ్ ల్యాండర్‌లో సమస్య తలెత్తింది. ల్యాండంగ్ అత్యంత వేగంగా చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టింది. అయితే చంద్రయాన్-2 నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో.. జూలై 14న చంద్రయాన్-3ను ప్రయోగించి.. ఆగస్టు 23 విజయంవంతంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండ్ చేసింది.
ఇప్పటికే చంద్రయాన్-3 విజయంతో జోష్‌మీద ఉన్న ఇస్రో మరో ప్రయోగానికి సర్వం సిద్ధం చేస్తోంది. సూర్యుడి వాతావరణ పరిస్థితులపై పరిశోధన కోసం సెప్టెంబర్ 2 తేదీన ఆదిత్య ఎల్-1ను ప్రయోగించనుంది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రేంజ్ పాయింట్ ఎల్-1 వద్ద దీనిని మోహరించనున్నారు.


Click it and Unblock the Notifications








