ఉద్యోగులకు మర్చిపోలేని ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన ఐటి కంపెనీ, ఎందుకంటే వారంతా..
ఇటీవల, చెన్నైకి చెందిన ఓ ఐటి కంపెనీ తమ ఉద్యోగులకు 100 మారుతి సుజుకి కార్లను బహుమతిగా ఇచ్చి వార్తల్లో ప్రధానంగా నిలిచిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు చెన్నెకి చెందిన మరొక ఐటి కంపెనీ తమ ఉద్యోగులలో ఐదుగురికి ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చింది. చెన్నైకి చెందిన కిస్‌ఫ్లో (Kissflow) అనే ఐటీ కంపెనీ, తమ కంపెనీలో పనిచేసే ఐదుగురు సీనియర్ ఉద్యోగులకు బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ లగ్జరీ కార్లను సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా అందించింది. వీటిలో ఒక్కో కారు ధర కోటి రూపాయలకు పైమాటే.

కృషికి తగిన ఫలితం
ఇటీవలి కాలంలో ఐటి కంపెనీలు తమ కంపెనీలలో పనిచేసే ఉద్యోగుల శ్రమను గుర్తించి, వారికి తగిన బహుమతిని అందజేస్తున్నాయి. ఇదేబాటలో కిస్‌ఫ్లో కూడా తమ ఉద్యోగులు కంపెనీ పట్ల చూపిన విధేయత మరియు శ్రద్ధతో వారు చేసిన పనిని గుర్తించి, దానికి ప్రతిఫలంగా ఈ బహుమతిగా ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. కిస్‌ఫ్లో ఇన్‌కార్పోరేషన్ సీఈఓ సురేష్ సంబందం ప్రకారం, ఈ బాహుమతి అందుకున్న ఐదుగురు ఉద్యోగులు కంపెనీ ప్రారంభం నుండి అతనితో ఉన్నారని మరియు కంపెనీ కష్ట సమయాల్లో కూడా అతనితో కలిసి పనిచేశారని చెప్పారు.

కంపెనీకి చెందిన ఈ ఐదుగురు ఉద్యోగులు కూడా చాలా సాధారణ కుటుంబం నుండి వచ్చినవారు మరియు వారు ఈ కంపెనీలో చేరడానికి ముందు అనేక సవాళ్లను కూడా ఎదుర్కొన్నారు. కిస్‌ఫ్లో సంస్థ తన ప్రయాణంలో అనేక అడ్డంకులను ఎదుర్కొందని మరియు కోవిడ్-19 వంటి మహమ్మారి సమయంలో ఎదురైన ప్రతికూల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, కొంతమంది పెట్టుబడిదారులు తమ కంపెనీ విజయవంతంగా నడుస్తుందా లేదా అనే సందేహాన్ని కూడా లేవనెత్తారని సురేష్ తెలిపారు.

ఈ సందర్భంగా కిస్‌ఫ్లో ఇన్‌కార్పొరేషన్ వ్యవస్థాపకుడు సురేష్ సంబందం మాట్లాడుతూ.. తమ సంస్థను తిరిగి వృద్ధి బాటలోకి తీసుకువచ్చేందుకు తమ ఉద్యోగులు ఎంతగానో కృషి చేశారని, తమ కంపెనీ ఈ ఉద్యోగులకు కేవలం కారును మాత్రమే ఇవ్వడం లేదని, కారుతో పాటుగా అందమైన జ్ఞాపకాలను కూడా అందిస్తోందని, ఇది వారు కష్టపడి సంపాదించిన డబ్బుతో దక్కించుకున్న కారు అని చెప్పారు. కిస్‌ఫ్లో సంస్థను స్థాపించి కంపెనీ 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా, కంపెనీ తమ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ, తమ కంపెనీలో కష్టపడి పనిచేసిన ఉద్యోగులకు బహుమతులు ఇవ్వాలని నిర్ణయించుకుంది.

ఉద్యోగులెవరూ ఊహించలేదు
కిస్‌ఫ్లో సంస్థలో పనిచేసిన ఆ ఐదుగురు సీనియర్ ఉద్యోగులు ఈ బహుమతిని చూసి అనందంతో షాక్ అయ్యారు. ఈ విలాసవంతమైన బహుమతిని అందుకున్న కిస్‌ఫ్లో కంపెనీ ఉద్యోగులు మాట్లాడుతూ, ఈ వార్షికోత్సవం తమకు చాలా ప్రత్యేకమైనదని బాస్ ముందే చెప్పారని, దీంతో తాము బహుశా బాస్‌తో కలిసి డిన్నర్‌కు వెళ్ళడమో లేదా చాలా కంపెనీల్లో లాగా బంగారు నాణేలు లేదా వోచర్‌లు వంటి కొన్ని బహుమతులను పొందుతామని అనుకున్నాం కానీ, ఇలాంటి ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కార్లను బహుమతిగా అందజేస్తారని తాము అస్సలు ఊహించలేదని అన్నారు.

బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ప్రత్యేకత ఏమిటి?
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ, భారత మార్కెట్లో విక్రయిస్తున్న అత్యంత విలాసవంతమైన కార్లలో బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ కూడా ఒకటి. కంపెనీ గతేడాది జూన్ నెలలో ఇందులో ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త 2021 మోడల్‌ని కంపెనీ రిఫ్రెష్డ్ డిజైన్ మరియు ఇంటీరియర్స్ తో విడుదల చేసింది. ఇందులోని అన్ని వేరియంట్లలో ఇప్పుడు 10.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌గా లభిస్తుంది. ఈ కారులో కొత్త ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ మరియు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో 530ఐ మరియు 530ఐ ఎమ్ స్పోర్ట్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి రెండూ కూడా 2.0-లీటర్, ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 5200 ఆర్‌పిఎమ్ వద్ద 248 బిహెచ్‌పి శక్తిని మరియు 1450-4800 ఆర్‌పిఎమ్ వద్ద 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులో 2.0-లీటర్, ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ డీజిల్ (187.7 బిహెచ్‌పి పవర్, 400 ఎన్ఎమ్ టార్క్) మరియు 3.0-లీటర్, ఇన్‌లైన్ సిక్స్ సిలిండర్ డీజిల్ ఇంజన్ (261.4 బిహెచ్‌పి పవర్, 620 ఎన్ఎమ్ టార్క్) ఆప్షన్లు కూడా ఉన్నాయి.

ఈ 5-సీటర్ మరియు 5-డోర్ 5-సిరీస్ బిఎమ్‌డబ్ల్యూ కారులోని మూడు రకాల ఇంజన్లు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్‌గా జతచేయబడి ఉంటాయి, ఇది ఇంజన్ నుండి వెలువడే శక్తిని వెనుక చక్రాలకు పంపిణీ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ కారు కేవలం 5.1 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. కస్టమర్లు ఎంచుకునే వేరియంట్ మరియు ఇంధన రకాన్ని బట్టి బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ మైలేజ్ లీటరుకు 14.82 కిమీ నుండి 20.37 కిమీ మధ్యలో ఉంటుంది.


Click it and Unblock the Notifications