మీ వాహనాలపై ఈ స్టిక్కర్లు అతికిస్తున్నారా?.. ఇక మీ జేబుకి చిల్లులు పడ్డట్లే.!!
సాధారణంగా కొంత మంది ప్రెస్, పోలీస్ అంటూ రకరకాల స్టిక్కర్లను తమ వాహనాలపై అతికించి బయటకు రావడం చూస్తుంటాం. దీని ద్వారా ఇతరుల ఫోకస్ తమపై ఉండటమే కాకుండా.. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో వారికి ఆలస్యం కాకుండా, ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని భావిస్తారు. అయితే ఇలాంటి వాటిపై చెన్నై మెట్రో పాలిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే..
చెన్నై మెట్రోపాలిటన్ ఏరియాలో ప్రెస్, పోలీస్ అంటూ రకరకాల స్టిక్కర్ల(Unauthorised Stickers On Vehicles)తో తిరుగుతున్న వాహనదారులపై చర్యలు తీసుకుంటామని చెన్నై మెట్రోపాలిటన్ పోలీసులు అధికారికంగా స్పష్టం చేశారు. అంతేకాకుండా అలాంటి స్టిక్కర్లు ఉన్న వాహనాలపై జరిమానాలు కూడా విధించనున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు ఈ చర్యలు తీసుకోవడానికి కారణం.. కొందరు నకిలీ స్టిక్కర్లు అంటిస్తున్నారని వారి దృష్టికి చేరడమే..

కాగా ప్రెస్, పోలీసు ఇంకా పలు అధికారిక హోదాల పేరుతో కొందరు ఇలా నకిలీ స్టిక్కర్లు అతికించిన కేసులో ఇప్పటికే అధికారులు దీనిపై హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వాహనదారులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. దీని ప్రకారం ఇలా స్టిక్కర్లు అతికించే వాహనదారులకు జరిమానా విధిస్తామని అధికారికంగా వెల్లడించారు.
చెన్నై మెట్రోపాలిటన్ పోలీసులు చేసిన ప్రకటన ఇలా ఉంది. "చెన్నై మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ప్రైవేట్ వాహనాలు ప్రెస్, చీఫ్ సెక్రటేరియట్, DNEGP, ICC, పోలీస్, ఆర్మీ మొదలైన వివిధ విభాగాలు మరియు సంస్థల స్టిక్కర్లను ఉపయోగిస్తున్నాయి. అటువంటి స్టిక్కర్లను వాహనం రిజిస్ట్రేషన్ ప్లేట్ మరియు వాహనం యొక్క ఇతర భాగాలపై అతికిస్తున్నారు.

ఇలా స్టిక్కరింగ్ చేయడం చట్టం విరుద్ధంగా పరిగణించబడుతుంది. ఇలాంటి స్టిక్కర్లను ఉపయోగించి కొందరు సంఘ వ్యతిరేకులు పోలీసుల నుంచి తప్పించుకుంటున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. కొందరు తమ వాహనాలపై రాజకీయ పార్టీల లోగోలు, వైద్యులు, లాయర్లు మొదలైన వాటిని స్టిక్కర్లుగా అంటించి రోడ్లపై తిరుగుతున్నారు.
మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 198 ప్రకారం ఇది చట్టవిరుద్ధమైన చర్యగా పరిగణించబడుతుంది. అందువల్ల ఈ రోజు(మే 2) నుంచి చెన్నై మహానగరంలో ఇలాంటి అనధికార స్టిక్కర్లు వాడితే మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 177 ప్రకారం వాహన యజమానికి జరిమానా విధించనున్నారు.' అని ప్రకటనలో పేర్కొన్నారు.

జరిమానా వివరాలకు సంబంధించి.. మొదటిసారి ఇలాంటి స్టిక్కర్‌తో పోలీసులకు పట్టుబడితే రూ. 500 జరిమానా, సరిదిద్దకుండా రెండోసారి పట్టుబడితే రూ.1500 జరిమానా విధించనున్నారు. చెన్నై మెట్రోపాలిటన్ ప్రాంతంలో నేటి నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది. అదే సమయంలో, మీడియా, న్యాయవ్యవస్థ, వైద్యులు, న్యాయవాదులు మరియు పోలీసులు తమ వాహనాలపై అటువంటి స్టిక్కర్లను అతికించడానికి షరతులతో కూడిన అనుమతి లభించింది.
తగిన పరిస్థితుల్లో మాత్రమే ఈ స్టిక్కర్లను అతికించాలని కూడా చెన్నై పోలీసు శాఖ హెచ్చరించింది. షరతులు ఉల్లంఘించి స్టిక్కర్ అతికించినా జరిమానా విధిస్తామని ప్రకటనలో స్పష్టం చేశారు. వాహన తనిఖీలో అటువంటి స్టిక్కర్ ఉన్న వాహనం పట్టుబడితే, ఫలానా వ్యక్తి ఫలానా విభాగంలో పనిచేస్తున్నట్లు ధృవీకరించబడదు.
కానీ అదే సమయంలో, షరతులను ఉల్లంఘించి వాహనంపై స్టిక్కర్ అతికించినట్లయితే, అది చట్ట ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఈ మేరకు అతనికి జరిమానా విధించబడుతుంది. చాలా మంది వ్యక్తులు తమ వాహనాలపై ప్రెస్ మరియు పోలీసు స్టిక్కర్‌లను ఉపయోగించడం ద్వారా వాహన తనిఖీల నుంచి సులభంగా తప్పించుకుంటున్నారు.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: సంఘ విద్రోహ శక్తులు కూడా కొందరు ఇలా నకిలీ స్టిక్కర్లను ఉపయోగిస్తుండటంతో.. దీన్ని అరికట్టేందుకు చెన్నై మెట్రో పాలిటన్ పోలీసులు ఈ తరహా చర్యలు చేపట్టారు. ఇలాంటి చట్టం తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలు కావాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications








