రైల్వే అధికారి పేరుతో దర్జాగా ఫేక్ టికెట్ల విక్రయం.. నిఘా వేసి పట్టుకున్న పోలీసులు..
చెన్నైలో నకిలీ రైల్వే టిక్కెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి నకిలీ రబ్బరు స్టాంపు, నోట్ ప్యాడ్ స్వాధీనం చేసుకున్నారు. అదేంటి రైల్వే టికెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయడమేంటని అనుకుంటున్నారా.. పూర్తి సమాచారం ఈ కథనంలో చదవండి.
మనం దేశంలో రైలు ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా టికెట్ కొనుగోలు చేయాలి. లోకల్ బస్సు ప్రయాణమైతే బస్సు ఎక్కిన తర్వాత మాత్రమే టికెట్ కొనుగోలు చేస్తాం. కానీ రైలు టికెట్ కొన్న తర్వాత మాత్రమే మీరు రైలు ప్రయాణం చేయవచ్చు. అందుకోసం దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో టిక్కెట్ కౌంటర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఆన్‌లైన్ ద్వారా కూడా మనం టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు.

ఇక్కడ చెన్నై సెంట్రల్ సబర్బన్ రిజర్వేషన్ సెంటర్ ఎదుట ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)గా నటిస్తూ ప్రయాణికులను ఓ వ్యక్తి బురిడీ కొట్టించాడు. నకిలీ రైల్వే టికెట్లు జారీ చేసి డబ్బు వసూలు చేశాడు. పథకం ప్రకారం ఆ వ్యక్తిని రైల్వే పోలీస్ ఫోర్స్ (RPF) జూలై 18న అరెస్టు చేసింది. నోట్‌ప్యాడ్‌ను తీసుకెళ్తున్న వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు రైల్వే అధికారి తెలిపారు.
నకిలీ టిక్కెట్లు విక్రయిస్తున్న వ్యక్తి జితేంద్ర షాగా పోలీసులు గుర్తించారు. నిందితుడు రాజస్థాన్‌కు చెందినవాడని, ప్రస్తుతం చెన్నైలోని కొడుంగయ్యూర్‌లో నివసిస్తున్నాడని విచారణలో తెలుసుకున్నారు. ఆర్పీఎఫ్ కథనం ప్రకారం.. జితేంద్ర తన తండ్రి జ్యువెలరీ షాపులో అకౌంటెంట్‌గా పనిచేసేవాడని సమాచారం. అసలు ఆ వ్యక్తి ఫేక్ టిక్కెట్లను ఎలా విక్రయించాడనేది ఆశ్చర్యకరంగా మారింది.

చెన్నై వంటి నగరాల్లో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లను ఎంచుకుని అక్కడ తన ప్రతిభను చాటుకున్నాడు నిందితుడు. అక్కడికి రైల్వే ఆఫీసర్ లాగా వచ్చి అమాయక కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని వారి నుంచి వేలల్లో డబ్బులు వసూలు చేశాడు. కొన్ని స్టేషన్లలో రబ్బర్ స్టాంపులు లాంటివి తీసుకుని జనాలను చూసి టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతున్న వారిని ఎంచుకుని టిక్కెట్లు ఎలా తీసుకోవాలో సలహాలు ఇచ్చేవాడు.
తర్వాత రైల్వేలో పనిచేస్తున్న డీటీఆర్‌లందరూ తనకు తెలుసని చెప్పి ప్రయాణికులను నమ్మించేవాడు. తనను తాను సీనియర్ రైల్వే అధికారిగా పరిచయం చేసుకుంటూ మాట్లాడేవాడు. ఛార్జీల వివరాలను పేపర్‌పై రాసి తన వద్ద ఉన్న నకిలీ రబ్బరు స్టాంపుతో సీల్ చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేసేవాడు.

ఇలా నకిలీ టిక్కెట్లు పొందిన ప్రయాణికులు అసలు విషయం తెలియక రైలు ఎక్కి డీటీఆర్ వద్ద ప్రత్యక్షమయ్యేవారు. అనంతరం మోసపోయామని తెలిసి పక్క స్టేషన్‌లో దిగేవారు. అక్కడ మరో టికెట్ తీసుకుని రైలు ఎక్కేవారు. దీనిపై ఫిర్యాదులు పెరగడంతో రైల్వే పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచి సదరు వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
తన తండ్రి మరణానంతరం జితేంద్ర సులభంగా డబ్బు సంపాదించడం కోసం ఇలాంటి పనులు చేస్తున్నాడని పోలీసుల విచారణలో తెలిసింది. అతను హిందీలో అనర్గళంగా మాట్లాడటం వల్ల చెన్నై సెంట్రల్, ఎగ్మోర్, తాంబరం, పెరంబూర్ మరియు వేలచ్చేరి రైల్వే స్టేషన్లలో రైల్వే టిక్కెట్ల కోసం క్యూలో నిలబడిన ఉత్తర భారతీయులను మోసం చేసేవాడని రైల్వే పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
రైల్వే టికెటింగ్‌పై కొంతమందిపై ఇప్పటికీ అవగాహన లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. రైల్వే టిక్కెట్లను ఆన్‌లైన్‌లో లేదా నేరుగా కౌంటర్ నుంచి మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో టికెట్ కొనుగోలు చేయాలనుకుంటే IRCTC అధీకృత ఏజెంట్ల ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు.
బుక్ చేసిన టికెట్‌పై PNR నంబర్ ఉండాలి. PNR నంబర్ లేని టికెట్ రైల్వేలో చెల్లదు. భారతదేశం అంతటా నడుస్తున్న అన్ని రైళ్లకు PNR నంబర్ ఉన్న టిక్కెట్లు మాత్రమే రిజర్వ్ చేసిన టిక్కెట్‌లుగా పరిగణించబడతాయి. మిగతావన్నీ నకిలీ టిక్కెట్లుగా గ్రహించాలి. రిజర్వ్‌డ్ కోచ్‌లకు ఈ పద్ధతి వర్తిస్తుంది.
రిజర్వ్ చేయని కోచ్‌ల టిక్కెట్‌లను నేరుగా టికెట్ కౌంటర్ నుంచి లేదా UDS యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ రెండూ నేరుగా రైల్వే స్టేషన్‌కు వెళ్లడం ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. యాప్ ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్లు కూడా రైల్వే స్టేషన్ నుంచి బుక్ చేసుకున్నప్పుడే బుక్ అవుతాయి.


Click it and Unblock the Notifications








