డ్రైవర్ లేకుండా దానంతట అదే పారిపోయిన కారు..! ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు..!!
ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడు డ్రైవర్ అవసరం లేని అటానమస్ కార్ల తయారీపై పనిచేస్తున్నాయి. ఈ విభాగంలో టెస్లా వంటి దిగ్గజం కంపెనీలు డ్రైవర్లతో పనిలేకుండా నడిచే రోబో టాక్సీలను కూడా ప్రవేశపెట్టేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. మరి ఇలాంటి ఆటానమస్ కార్ల విషయంలో ఏదైనా అనుకోని ప్రమాంద లేదా తప్పు జరిగితే ఎవరిని శిక్షించాలి. ఇప్పుడిదే మిలియన్ డాలర్ల ప్రశ్న. అంతేకాదు, ఇప్పుడు నిజంగా ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి.
తాజాగా, అమెరికాలో ఓ డ్రైవర్ రహిత కారును ట్రాఫిక్ పోలీసులు ఛేజ్ చేసి మరీ ఆపారు. అమెరికన్ రోడ్లపై జనరల్ మోటార్స్ 'క్రూయిజ్' అనే అటానమస్ వాహనాన్ని పరీక్షిస్తోంది. అయితే, ఓ ట్రాఫిక్ తప్పిదం కారణంగా, అక్కడి పోలీసులు ఈ కారును ఆపేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

జనరల్ మోటార్స్ అటానమస్ 'క్రూయిస్' అనేది రోబో ట్యాక్సీ ఫ్లీట్ కోసం డ్రైవర్ అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా నడిచేలా మార్చబడిన షెవర్లే బోల్ట్ ఎలక్ట్రిక్ వాహనం. జనరల్ మోటార్స్ ఈ అటానమస్ బోల్ట్ EVలను నగరంలోని ఉద్యోగులకు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు అనుకూలంగా రైడ్ లను అందించడానికి రూపొందించబడిన అటానస్ కారు. అయితే, ఈ కారు సందేహాస్పదంగా కనిపించడంతో, ఈ అటానమస్ టాక్సీని శాన్ ఫ్రాన్సిస్కోలోని రిచ్‌మండ్ జిల్లాలో ఏప్రిల్ 2వ తేదీన పోలీసులు ఆపారు.

పోలీసులు ఈ కారును ఆపడానికి ప్రధాన కారణం, ఈ షెవర్లే బోల్ట్ అటానమస్ కారు దాని లైట్లు స్విచ్ ఆన్ చేయకుండా ప్రయాణించడమే. సాధారణంగా రాత్రి సమయాల్లో అమెరికన్ రోడ్లపై ప్రయాణించే కార్లలో తప్పనిసరిగా హెడ్‌లైట్లు ఆన్‌చేయబడి ఉండాలి మరియు బ్రేక్ లైట్లు కూడా తప్పనిసరిగా వెలుగుతూ ఉండాలి. అలా లేని పక్షంలో సదరు కారు యజమానికి పోలీసులు టికెట్ (ఫైన్) వేస్తారు. ఈ అటానమస్ బోల్ట్ కారు విషయంలో కూడా అదే జరిగింది.

హెడ్‌లైట్లు ఆన్ చేయకుండా ప్రయాణిస్తున్న చెవర్లే బోల్ట్ కారును పోలీసులు ఛేజ్ చేసి మరీ ఆపారు. ఆ తర్వాత అందులో డ్రైవర్ లేని విషయాన్ని తెలుసుకొని పోలీసులు నోరెళ్లబెట్టారు. ఈ వీడియోలో, పోలీసు అధికారి అటానమస్ బోల్ట్ EV వద్దకు వెళ్లి, స్టీరింగ్ వీల్ ముందు ఎవరూ లేరని అయోమయంలో చూడటం మీరు కూడా చూడవచ్చు. కారులో అతను సంప్రదించడానికి ఎవరూ లేకపోవడంతో సదరు అధికారి గందరగోళానికి గురవుతాడు, తదుపరి ఏమి చేయాలో నిర్ణయించడానికి అధికారి తన కారుకు తిరిగి వెళ్ళడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.

ఇదేం కొత్త తలనొప్పిరా దేవుడా, ఇప్పుడు మేము టికెట్ ఎవరికి వేయాలి అంటూ సదరు పోలీసు అవాక్కయ్యాడు. నిజానికి, ఈ విషయంలో జరిమానాను సదరు రోబో టాక్సీని నిర్వహించే సంస్థ పేరుపై విధించే అవకాశం ఉంది. ఈ అటానమస్ కార్లను డిజైన్ చేసిన ఇంజనీర్లు, అవి ట్రాఫిక్ స్టాప్‌లను మరియు పోలీసులు వాహనాలను గుర్తించే టెక్నాలజీని కలిగి ఉంటాయి. సాధారణ డ్రైవర్ల మాదిరిగా ఈ కార్లు పోలీసుల నుండి పారిపోకుండా, హాజర్డ్ లైట్లు ఆన్ చేసుకొని, రోడ్డు పక్కన ఉన్న సురక్షితమైన ప్రదేశానికి వస్తాయి.

ఈ వీడియోని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఇందులోని షెవర్లే బోల్ట్ క్రూయిజ్ అటానమస్ కారు ముందుగా ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిలుపబడి ఉంటుంది. దాని వెనుకనే ఓ పోలీసు కారు కూడా నిలిచి ఉంటుంది, కారు లోని పోలీస్ దిగి, అటానమస్ కారు వద్దకు రాగానే సిగ్నల్ మారడంతో, కారు ముందుకు వెళ్లి హాజర్డ్ లైట్స్ ఆన్ చేసుకొని, రోడ్డు పక్కగా ఆగుతుంది. సదరు కారు తన నుండి పారిపోయిందని భావించిన పోలీసు అధికారి బ్యాకప్ ని పిలుస్తాడు. అప్పుడు ఆ కారు దగ్గరకి ముగ్గురు పోలీసులు వస్తారు.

పోలీసులు కారును అన్‌లాక్ చేయడానికి ప్రయత్నించినా ఫలితం ఉండదు. మరొక అధికారి తన ఫ్లాష్ లైట్ సాయంతో కారు లోపల ఎవరైనా ఉన్నారేమో అని చెక్ చేస్తారు. ఇదంతా ప్రజల సేఫ్టీలో ఓ భాగమే అయినప్పటికీ, ఈ దృశ్యాన్ని చూస్తున్న వారికి మాత్రం ఇది నవ్వు తెప్పిస్తుంది. భవిష్యత్తులో మనం ఇలాంటి ప్రపంచంలో బ్రతకబోతున్నాం అనేది వాస్తవం. అగ్రరాజ్యంలో ఇప్పటికే అటానమస్ కార్లు రోడ్లపై నిర్భయంగా తిరిగేస్తున్నాయి.

నిజానికి ఈ అటానమస్ కారు సరైన ప్రోటోకాల్‌నే అనుసరించింది, ఇది చేసిన పొరపాటల్లా ఆటోమేటిక్‌గా హెడ్‌లైట్లను ఆన్ చేయకపోవడమే. ఈ విషయమైన ఒక అధికారి క్రూయిజ్ సిబ్బందిని సంప్రదించారని మరియు వారికి ఎటువంటి జరిమానాను విధించలేదని క్రూయిజ్ తన ట్విట్టర్‌లో ధృవీకరించింది. ఈసారికి తప్పించుకుంది సరే, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరిన్ని జరిగితే, వాటి వలన రోడ్డు ప్రమాదాలు జరిగితే "హూ ఈజ్ రెస్పాన్సిబల్ అండీ.." అంటూ నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications