ఇలాంటి బాస్ దొరికితే చాలు! ఒక్కో ఉద్యోగికి ఒక కారు గిఫ్ట్.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో!
దీపావళి, భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూసే పండుగ. వెలుగుల ఈ వేళలో కంపెనీలు కూడా తమ ఉద్యోగుల కష్టానికి గౌరవంగా బహుమతులు ఇస్తూ ఆనందాన్ని పంచుకోవడం ఒక సంప్రదాయంగా మారిపోయింది. అయితే ఈసారి సోషల్ మీడియాలో కనిపిస్తున్న కొన్ని వీడియోలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. కొందరు కంపెనీలు తమ ఉద్యోగులకు భారీ బహుమతులు, లగ్జరీ వస్తువులు ఇవ్వగా, మరికొందరికి మాత్రం స్వీట్ బాక్స్ కూడా అందలేదు. ఆ వీడియోలు చూసి చాలా మంది ఉద్యోగులు, మనకేమీ దక్కదే! అని నవ్వుతూ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ బాధను రెట్టింపు చేసే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మిట్స్ నేచురా లిమిటెడ్ (Mits Natura Limited) అనే కంపెనీ బాస్ తన ఉద్యోగుల పట్ల చూపించిన ఉదారత అందరినీ షాక్‌కి గురి చేసింది. ఈ కంపెనీ యజమాని దీపావళి సందర్భంగా తన 51 మంది అత్యుత్తమ ఉద్యోగులకు లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చాడు. దీని ఫోటోలు, వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ అంతా తిరుగుతున్నాయి. ఉద్యోగులు ఆ బహుమతులు అందుకుంటూ ఆనందంతో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

కొందరు తమకు లగ్జరీ కారు తాళాలు అందుకున్న క్షణం కెమెరాలో బంధించగా, మరికొందరు తమ బాస్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం పంచుకున్నారు. ఇంతటి బహుమతి ఇచ్చిన మిట్స్ నేచురా లిమిటెడ్ యజమాని పేరు ప్రస్తుతం ప్రతి సోషల్ మీడియా యూజర్ నోట ఉంది. దీని గురించి నెటిజన్లు, ఇలాంటి బాస్ దొరికితే బాగుండు, మా కంపెనీ కూడా కనీసం ఒక లడ్డూ అయినా ఇస్తే చాలు! అని కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంత వేగంగా వైరల్ అవుతుందో అంతే వేగంగా దానికి సంబంధించిన కామెంట్ల వర్షం కూడా కురుస్తోంది. కొందరు నెటిజన్లు మాత్రం కార్ల బహుమతుల వెనుక నిజం ఏమిటో అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్లు నిజంగా కంపెనీ ఖర్చుతో కొనుగోలు చేశారా? లేక రుణం తీసుకుని ఇచ్చారా?, ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేస్తారా? వంటి ప్రశ్నలు కూడా కామెంట్ బాక్స్‌లో వెల్లువెత్తుతున్నాయి.

చండీగఢ్‌కు చెందిన MITS గ్రూప్ చైర్మన్ ఎం.కే. భాటియా గత రెండు సంవత్సరాలుగా ఆయన తన ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ ఏడాది కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఏకంగా 51 మంది ఉద్యోగులకు లగ్జరీ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. ప్రతి ఉద్యోగి అభిరుచులు, అవసరాలను పరిగణనలోకి తీసుకుని వేర్వేరు మోడళ్లను ఎంపిక చేయడం విశేషం.
అందులో మహీంద్రా స్కార్పియో SUV వంటి కారు కూడా ఉంది. కారు తాళాలు అందుకున్న ఉద్యోగుల ముఖాల్లో కనిపించిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. 2002లో తన మెడికల్ స్టోర్ దివాళా తీసినప్పుడు భాటియా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడ్డాడు. అప్పుల్లో కూరుకుపోయి, జీవితంలో తిరిగి లేవగలనా అన్న స్థితి వచ్చింది. అయినా ఆయన తలవంచలేదు. క్రమంగా తన కృషి, నమ్మకం, పట్టుదలతో మళ్లీ నిలబడ్డాడు.

ఆ ప్రయాణంలో తనతో ఉన్న ఉద్యోగులను ఆయన ఎప్పుడూ తన కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారు. 2015లో ఆయన MITS Natura Limitedని స్థాపించాడు. అప్పటి నుండి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. ఇప్పుడు ఆయనకు భారత్‌లో 12 యూనిట్లు విజయవంతంగా పనిచేస్తున్నాయి. ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులను తయారు చేసే ఈ సంస్థ ఇప్పుడు కెనడా, లండన్, దుబాయ్‌లకు కూడా ఎగుమతి లైసెన్స్ పొందింది.


Click it and Unblock the Notifications








