మ్యాన్యువల్ vs ఆటో క్లైమేట్ కంట్రోల్.. కారులో కూలింగ్ కింగ్ ఏది ? వాటి లాభనష్టాలివే ?
వేసవిలో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కారులో చల్లగా ఉండాలని అందరూ అనుకుంటారు. అప్పుడు ఏసీ చాలా సహాయపడుతుంది. కార్లలో సాధారణంగా రెండు రకాల ఏసీ సిస్టమ్స్ ఉంటాయి. అవి మ్యాన్యువల్ ఏసీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్. ఈ రెండింటిలో ఏది మంచిది, మీ అవసరాలకు ఏది సరిపోతుందో చాలామందికి తెలియదు. ఈ వార్తలో ఈ రెండు సిస్టమ్స్ మధ్య తేడాలు, వాటి లాభాలు, నష్టాల గురించి తెలుసుకుందాం.
మ్యాన్యువల్ AC అంటే మనమే స్వయంగా టెంపరేచర్, ఫ్యాన్ స్పీడ్, గాలి ఏ దిశలో రావాలని కోరుకుంటున్నామో అలా సెట్ చేసుకోవాలి. ఇందులో మూడు బటన్స్ ఉంటాయి. అవి టెంపరేచర్, ఫ్యాన్ స్పీడ్, విడ్ డైరెక్షన్. కారు లోపల వేడిగా ఉన్న గాలిని ఏసీ చల్లబరిచి, ఫ్యాన్ ద్వారా కారులోకి పంపుతుంది.

మ్యాన్యువల్ ఏసీ వల్ల లాభాలున్నాయి. మ్యాన్యువల్ AC ఉన్న కార్లు తక్కువ ధరకే వస్తాయి. కాబట్టి బడ్జెట్ తక్కువ ఉన్నవారికి ఇది మంచి ఆప్షన్. దీనిని వాడడం చాలా ఈజీ, అర్థం చేసుకోవడం సులువు. ఏదైనా సమస్య వస్తే, రిపేర్ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇది తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది.
మ్యాన్యువల్ ఏసీ వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. వాతావరణం మారినప్పుడు లేదా చలి/వేడి ఎక్కువగా అనిపించినప్పుడు టెంపరేచర్, ఫ్యాన్ స్పీడ్‌లను తరచుగా మార్చుకోవాల్సి వస్తుంది. ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు ఇలా పదే పదే సెట్టింగ్స్ మార్చడం డ్రైవర్‌కు చిరాకు తెప్పిస్తుంది. కారులో ఒకే టెంపరేచర్ ఉండేలా చూసుకోవడం కష్టం, కొన్నిసార్లు చాలా చల్లగా, మరికొన్నిసార్లు వేడిగా అనిపించవచ్చు.

ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అనేది ఒక స్మార్ట్ AC సిస్టమ్. మనం టెంపరేచర్‌ను ఒక్కసారి సెట్ చేస్తే చాలు, కారులోని సెన్సార్స్ ఆ టెంపరేచర్‌ను కారు లోపల స్థిరంగా ఉండేలా చూసుకుంటాయి. దీనివల్ల మనం పదేపదే సెట్టింగ్స్ మార్చాల్సిన అవసరం ఉండదు.
దీని వల్ల కారు లోపల ఎప్పుడూ మనం సెట్ చేసిన టెంపరేచర్ ఉంటుంది. ఇది డ్రైవర్‌కు చాలా సౌకర్యంగా ఉంటుంది. సెట్టింగ్స్ మార్చాల్సిన అవసరం లేదు కాబట్టి, డ్రైవర్ రోడ్డుపై పూర్తిగా దృష్టి పెట్టగలడు. కొన్ని కార్లలో డ్యుయల్-జోన్, ట్రై-జోన్ వంటి ఆప్షన్స్ ఉంటాయి. దీనివల్ల కారులో ఉన్న ప్రయాణికులు ఎవరికి కావాల్సిన టెంపరేచర్‌ను వారు సెట్ చేసుకోవచ్చు.

దీని వల్ల కూడా కొన్ని నష్టాలున్నాయి. ఈ ఫీచర్ సాధారణంగా మిడిల్ రేంజ్ లేదా హై-ఎండ్ కార్లలో ఉంటుంది. కాబట్టి వీటి ధర ఎక్కువగా ఉంటుంది. ఇందులో సెన్సార్లు, ఇతర ఎలక్ట్రానిక్ భాగాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఏదైనా పాడైతే రిపేర్ ఖర్చు ఎక్కువ అవుతుంది.
ఈ రెండింటిలో ఏ సిస్టమ్ ఎంచుకోవాలనేది మీ అవసరాలు, మీరు ఎంత దూరం ప్రయాణిస్తారు.. బడ్జెట్ పైన ఆధారపడి ఉంటుంది. మ్యాన్యువల్ AC అనేది తక్కువ ధరలో కారు కొనాలనుకునే వారికి, ప్రతిరోజూ తక్కువ దూరాలు ప్రయాణించే వారికి ఉపయోగంగా ఉంటుంది.
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అనేది ఎక్కువ దూరాలు లేదా హైవేలపై ప్రయాణించే వారికి, కారులో ఎక్కువ సౌకర్యం, లేటెస్ట్ టెక్నాలజీ కావాలనుకునే వారికి, కుటుంబంలో ఎక్కువ మంది ప్రయాణించే వారికి, కారు టెంపరేచర్ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవ్వాలని కోరుకునే వారికి ఉపయోగకరంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








