కోట్ల ఖరీదు చేసే బుగాట్టి సూపర్ కారుని చిత్తు చేసిన క్రిస్టియానో రొనాల్డో బాడీగార్డ్..!
మనం ఎంతో ఇష్టంగా చూసుకునే కారుకి చిన్న గీత పడితేనే మనస్సు కళుక్కుమంటుంది. అలాంటిది కోట్ల రూపాయల ఖరీదు చేసే సూపర్ కారు గోడకు గుద్దుకొని నుజ్జు నుజ్జయితే కలిగే బాధ మాటల్లో వర్ణించలేనిది. అలాంటి బాధనే పొందాడు ఫుట్‌బాల్ సూపర్ స్టార్ మరియు మాంచెస్టర్ యునైటెడ్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. తాను బహుమతిగా పొందిన బుగాట్టి వేరాన్ గ్రాండ్ స్పోర్ట్ విటెస్సే (Bugatti Veyron Grand Sport Vitesse) స్పెయిన్‌లోని మజోర్కాలో ఓ గోడను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదు.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు తీసే కార్లలో బుగాట్టి వేరాన్ కూడా ఒకటి. ఈ కారు క్రాష్ జరిగిన సమయంలో క్రిస్టియానో రొనాల్డో కారులో లేడు మరియు మజోర్కాలో గోడను ఢీకొన్నప్పుడు వేరాన్ అతని అంగరక్షకులలో (బాడీగార్డ్స్) ఒకరు నడుపుతున్నట్లు నివేదించబడింది. రొనాల్డో మరియు అతని కుటుంబం బుగాట్టితో పాటుగా ఓ కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో బుగాట్టి కారును ఓ బాడీగార్డ్ డ్రైవ్ చేస్తున్నాడు. ఆ సమయంలో అది అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోడను ఢీకొట్టింది.

ప్రమాదం జరిగిన సమయంలో కారులో బాడీగార్డ్ ఒక్కడే ఉన్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత అతడు ఆ కారును అక్కడే వదిలేసి క్రిస్టియానో రొనాల్డో వెళ్తున్న కాన్వాయ్‌లో గమ్యస్థానానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత టో ట్రక్కు సాయంతో ఈ కారును మెకానిక్ షెడ్డుకి తరలించారు. క్రాష్ అయిన బుగాట్టి వేరాన్ సూపర్ కారు క్రిస్టియానో రొనాల్డోకి చెందినది కావడంతో ఈ యాక్సిడెంట్ ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

ఈ ప్రమాదంలో బుగాట్టి వేరాన్ గ్రాండ్ స్పోర్ట్ విటెస్సే కారు ముందు బంపర్ మరియు స్ప్లిటర్ ప్రాంతంలో గీతలు పడ్డాయి. అయితే, ఈ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్‌కు మరింత ఇబ్బంది కలిగించే విషయం ఏంటంటే, హైపర్‌కార్ యొక్క ప్యాసింజర్ సైడ్ (రొనాల్డో ఎక్కువగా కూర్చునే స్థలంలో) భారీ నష్టం జరిగింది. మరమ్మత్తులో ఇది ఎంత మేరకు ఫిక్స్ అవుతుందో లేదో చూడాలి.

క్రిస్టియానో రొనాల్డో ఉపయోగిస్తున్న బుగాట్టి వేరాన్ గ్రాండ్ స్పోర్ట్ విటెస్సే హైపర్ కారు చాలా ప్రత్యేకమైనది. ప్రపంచం మొత్తమ్మీద ఇలాంటి కార్లు 95 మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి మన ఫుట్‌బాల్ స్టార్ వద్ద ఉంది. ఈ హైపర్ కారు ఓపెన్-టాప్ వేరియంట్ రూపంలో 2013లో జర్మనీలోని ఎహ్రా-లెస్సియన్‌లోని ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ ప్రూవింగ్ గ్రౌండ్స్ లో గంటకు గరిష్టంగా 408.84 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుని, అత్యంత వేగవంతమైన స్పీడ్ గా రికార్డు సృష్టించింది.

ఈ టాప్ స్పీడ్ రన్ ను జరుపుకోవడానికి, బుగాట్టి వేరాన్ గ్రాండ్ స్పోర్ట్ విటెస్సే యొక్క 8 ప్రత్యేక వరల్డ్ రికార్డ్ ఎడిషన్ వెర్షన్ లను కూడా కంపెనీ నిర్మించింది. ఆ తర్వాత బుగాట్టి వేరాన్ స్థాన్ని కొత్త బుగ్గాటి చిరోన్ రీప్లేస్ చేయడానికి ముందు కంపెనీ ఇదే కారు (వేరాన్) యొక్క ప్లాట్‌ఫామ్ ను తమ కొత్త కారు కోసం ఉపయోగించుకుంది. ఒకరకంగా చెప్పాలంటే, చిరోన్ ను కొత్త బట్టలు వేసుకున్న వేరాన్ గా పేర్కొనవచ్చు.

ఇక బుగాట్టి గ్రాండ్ స్పోర్ట్ విటెస్సే హైపర్ కార్ విషయానికి వస్తే, ఇది ఫ్రెంచ్ హైపర్‌కార్ తయారీదారు యొక్క అత్యంత శక్తివంతమైన 8.0-లీటర్ క్వాడ్-టర్బో W16 ఇంజన్ తో రూపొందించబడింది. ఈ ఇంజన్ ఏకంగా 1200 PS (1183.5 bhp) శక్తిని మరియు 1,500 Nm గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ద్వారా వచ్చే శక్తి 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ అవుతుంది.

అంటే, బుగాట్టి వేరాన్ గ్రాండ్ స్పోర్ట్ విటెస్సే ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ తో వస్తుందని అర్థం. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, వేరాన్ గ్రాండ్ స్పోర్ట్ కేవలం 2.5 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఇదివరకు చెప్పుకున్నట్లుగా Veyron Grand Sport Vitesse గరిష్టంగా గంటకు 408.84 కిమీ వేగాన్ని అందుకోగలదు. అయితే, ఈ వేగం ట్రాక్ పై మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే, రోడ్ ఉపయోగం కోసం తయారు చేసే బుగ్గాటి వేరాన్ కారు యొక్క గరిష్ట వేగాన్ని గంటకు ఎలక్ట్రానిక్‌గా కేవలం 375 కిమీ మాత్రమే పరిమితం చేశారు.
ఫొటో మూలం: Ultima Hora


Click it and Unblock the Notifications








