లగ్జరీ కారు కొని ఏళ్ల తరబడి ఏడ్చాడు.. 15 ఏళ్ల తర్వాత గెలిచిన కస్టమర్.. నిస్సాన్ కంపెనీకి కోర్టు భారీ షాక్
ఒక సామాన్య వినియోగదారుడు కష్టపడి సంపాదించిన సొమ్ముతో కారు కొనుక్కుంటే, అది అతనికి సంతోషాన్ని ఇవ్వాలి. కానీ, కేరళకు చెందిన ఒక వ్యక్తికి మాత్రం తాను కొన్న లగ్జరీ ఎస్‌యూవీ (SUV) ఏకంగా 15 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగేలా చేసింది. చిట్టచివరకు న్యాయం గెలిచింది. కారు కొన్న 15 ఏళ్ల తర్వాత సదరు కంపెనీకి షాక్ ఇస్తూ, కస్టమర్‌కు రూ.28 లక్షలు తిరిగి చెల్లించాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆ వినియోగదారుడు పడ్డ ఇబ్బందులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ కథ కేరళలోని కొట్టాయంకు చెందిన జేసన్ లుకోస్ అనే వ్యక్తితో మొదలైంది. ఆయన 2011 జూన్ నెలలో అప్పట్లో ఎంతో క్రేజ్ ఉన్న నిస్సాన్ ఎక్స్-ట్రెయిల్ (Nissan X-Trail) అనే ప్రీమియం ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఈ కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు (CBU), అందుకే దీని ధర దాదాపు రూ.28 లక్షలుగా ఉండేది. లక్షలు పోసి లగ్జరీ కారు కొన్నానన్న ఆనందం జేసన్‌కు వారం రోజులు కూడా నిలవలేదు. కారు డెలివరీ తీసుకున్న కేవలం 6 రోజుల్లోనే, కేవలం 780 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఆ ఎస్‌యూవీ నడిరోడ్డుపై ఆగిపోయింది.

కారు మొరాయించడంతో వెంటనే దాన్ని సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఆ రోజుకు రిపేర్ చేసి ఇచ్చినా, సమస్య మాత్రం తీరలేదు. ఆ తర్వాత ఇంజిన్ నుంచి వింత శబ్దాలు రావడం, మాటిమాటికీ కారు ఆగిపోవడం వంటి ఇబ్బందులు మొదలయ్యాయి. జేసన్ ఎన్నిసార్లు సర్వీస్ సెంటర్‌కు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. చివరకు సెప్టెంబర్ 2011 నాటికి, అంటే కారు కొన్న కేవలం మూడు నెలల్లోనే అది పూర్తిగా పనికిరాకుండా పోయింది. అప్పటికి ఆ కారు తిరిగింది కేవలం 11,922 కిలోమీటర్లు మాత్రమే. అంత ఖరీదైన కారు ఇంజిన్ ఫెయిల్ కావడంతో జేసన్ నిస్సాన్ కంపెనీని సంప్రదించారు.
అయితే, ఇక్కడే కంపెనీ తన అసలు రంగు బయటపెట్టింది. ఇంజిన్ ఫెయిల్ కావడానికి కారులో లోపం కారణం కాదని, జేసన్ ఆ కారులో కల్తీ డీజిల్ (కిరోసిన్ కలిపిన ఇంధనం) వాడటం వల్లే ఇంజిన్ పాడైపోయిందని నిస్సాన్ డీలర్, కంపెనీ ఎదురుదాడికి దిగారు. కానీ జేసన్ వెనక్కి తగ్గలేదు. తన తప్పు లేదని నిరూపించుకోవడానికి ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. ఈ క్రమంలో కోర్టు ఒక స్వతంత్ర సాంకేతిక కమిటీని నియమించి విచారణ జరిపించింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కంపెనీకి గట్టి షాక్ ఇచ్చింది. ఇంజిన్ ఫెయిల్యూర్‌కు కారణం ఇంధనం కాదు, ఆ కారు తయారీలోనే సాంకేతిక లోపం (Manufacturing Defect) ఉందని నివేదిక తేల్చి చెప్పింది.

ఈ నివేదిక ఆధారంగా 2021లో కేరళ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ జేసన్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. కానీ నిస్సాన్ కంపెనీ దాన్ని సవాలు చేస్తూ జాతీయ కమిషన్ (NCDRC) కు వెళ్ళింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఇప్పుడు జాతీయ కమిషన్ కూడా కంపెనీ వాదనను కొట్టిపారేసింది. వినియోగదారుడికి నాణ్యమైన సేవలు అందించడంలో నిస్సాన్ మరియు డీలర్ పూర్తిగా విఫలమయ్యారని (Deficiency in Service) స్పష్టం చేసింది. జేసన్ కారు కోసం చెల్లించిన రూ. 28 లక్షల మొత్తాన్ని రెండు నెలల్లోగా తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత సమయంలోగా చెల్లించకపోతే, ఆ మొత్తంపై 9 శాతం వడ్డీని కూడా కలిపి ఇవ్వాలని కోర్టు తేల్చి చెప్పింది.
ఈ కేసు వాహన వినియోగదారులందరికీ ఒక పెద్ద పాఠం. కొత్త కారులో లోపాలు ఉన్నప్పుడు కంపెనీలు సాకులు చెప్పినా, గట్టిగా పోరాడితే న్యాయం జరుగుతుందని ఈ తీర్పు నిరూపించింది. 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జేసన్ గెలిచారు. కంపెనీలు ఎంత పెద్దవైనా సరే, కస్టమర్ల హక్కులను కాలరాస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ ఘటన హెచ్చరిస్తోంది.


Click it and Unblock the Notifications








