అసలు 70 లీటర్ల ట్యాంక్.. కానీ పెట్రోల్ బంక్ వాళ్లు 77 లీటర్లు ఎలా పోశారు? బంక్‌లో ఎదురైన షాకింగ్ అనుభవం
భారతదేశంలో పెట్రోల్ పంపుల వద్ద ఫ్యూయల్ సంబంధిత గొడవలు కొత్త విషయం కాదు. సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిన నేపథ్యంలో దేశంలో ఏ మూలన గొడవలు చోటుచేసుకున్న అవి క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన ప్రత్యేకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, తెల్లటి కలర్‌లో మెరిసిపోతున్న BMW 5 సిరీస్ లగ్జరీ సెడాన్ యజమాని సాయంత్రం 6 గంటలకు, కర్నాల్ హైవేలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ పంప్‌లో తన వాహనానికి ఫుల్ ట్యాంక్ నింపడానికి వెళ్ళాడు. అతను బంక్ సిబ్బందికి స్పష్టంగా, తన కారులో పూర్తిగా ఫ్యూయల్ నింపాలని అడిగాడు.
పెట్రోల్ నింపిన వెంటనే, మీటర్ రీడింగ్ 77 లీటర్లను చూపించింది. ఇది చూసి యజమాని ఆశ్చర్యపోయాడు. అతను తన కారు ట్యాంక్ సామర్థ్యం 70 లీటర్లే, వాహనం బంకులోకి వచ్చినప్పుడు 100 కి.మీ దూరానికి సరిపడా ఇంధనం ఉండగా, 10 లీటర్లు మిగిలి ఉండేది అని గుర్తుచేశాడు. 77 లీటర్ల రీడింగ్ ఎలా వచ్చిందో బంక్ సిబ్బందిని ప్రశ్నించాడు. దీని కారణంగా కారు యజమాని, సిబ్బంది మధ్య వాదనలు మొదలయ్యాయి.

వారిద్దరి మథ్య వాదన జరిగిన కాసేపటి తర్వాత, బంక్ యజమాని ప్రత్యక్షంగా వచ్చి తన ఉద్యోగి చేసిన తీరుపై క్షమాపణలు చెప్పాడు. ఈ సమస్యను పరిష్కరించడానికి, కారు యజమాని, బంక్ యజమాని కలిసి ఒక మెకానిక్‌ను పిలిపించి ట్యాంక్‌లోని ఫ్యూయల్‌ను కొలవాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రకారం, మెకానిక్‌ను పిలిపించారు. అతన వచ్చి కారులో ఫ్యూయల్ సరఫరా అయ్యే పైపుని తీసి, ట్యాంక్‌లోని పెట్రోల్ మొత్తం ఒక డబ్బాలో పోసి కొలిచాడు.
ఆ తరువాత డబ్బాలో పోసిన పెట్రోల్‌ను కొలవగా, అది 77 లీటర్లకు బదులుగా కేవలం 57 లీటర్లు మాత్రమే చూపించింది. దీంతో అక్కడి వారు ఆశ్చర్యపోయారు. 77 లీటర్లకు 57 లీటర్లు మాత్రమే అంటే ఈ లెక్కన 20 లీటర్లు తక్కువగా పెట్రోల్ వచ్చింది. దాంతో కారు ఓనర్ దీనిపై బంకు యజమానిని ప్రశ్నించాడు, బంకును ఎలా నమ్మగలం అన్నాడు. అయితే బంకు ఓనర్ తమ తప్పు లేదని వాదించాడు.

బంకు ఓనర్ తమ తప్పు లేదని చెబుతూ, కారును రాత్రంతా అక్కడ ఉంచమని, ట్యాంక్ తీసి కొలిస్తే ఇంకా ఎక్కువ పెట్రోల్ వస్తుందని వాదించాడు. అయితే, ట్యాంక్‌ను తీయడానికి కారు యజమాని నిరాకరించాడు. బంకు నుంచి సరైన కొలతలో ఫ్యూయల్ వస్తుందో లేదో చెక్ చేయమని అడిగాడు. దాంతో మీటర్‌లో 5 లీటర్లకు సెట్ చేసి, 5 లీటర్ల డబ్బాలో నింపారు. తరువాత డబ్బాలో కొలత ప్రకారమే ఫ్యూయల్ నిండింది.
అయినా కూడా కారు ఓనర్ సంతృప్తి చెందలేదు. చివరికి ఇక కారు ఓనర్ ఆ బంకులో ఫ్యూయల్ నింపకుండానే బయటకు వెళ్లి వేరే బంక్‌లోనే ఇంధనం నింపుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన అనుభవాన్ని, పంపులో జరిగిన తథంగాన్ని వివరించే వీడియో జనతా బ్రేకింగ్ న్యూస్ యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేయబడింది. ఈ సంఘటన ప్రతి వాహన యజమానికి, పెట్రోల్ బంకుల నిజమైన కొలతను స్వయంగా చెక్ చేయడం ఎంత ముఖ్యమో చూపిస్తుంది.



Click it and Unblock the Notifications








