ఎర్ర బుగ్గ కార్లు, విఐపి కార్లకు గుడ్‌బై చెప్పిన ఆమ్ ఆద్మీ!
సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడని, సామాన్యుడి సత్తా ఏంటో ఢిల్లీ సర్కారు రుచి చూపించి, ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గతంలో తనకు ఎలాంటి ప్రత్యేక పోలీసుల భద్రత అవసరం లేదని, ఆ భగవంతుడే తనకు రక్షణగా ఉంటాడని చెబుతూ, పోలీసుల జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీని సైతం సున్నితంగా తిరస్కరించిన సంగతి తెలిసిందే.
అంతేకాదు, ఓ ముఖ్యమంత్రి రోడ్డుపై వెళ్తున్నాడంటో, ఆయన ముందు ఓ పది కార్లు వెనుక ఓ పదికార్లు రయ్ రయ్ మంటూ దూసుకుపోతుంటాయి. ఈ క్రమంలో కిలోమీటర్ల ముందు నుంచే ట్రాఫిక్‌ను నిలిపివేస్తుంటారు. కానీ, కేజ్రీవాల్ మరియు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఎర్ర బుగ్గ (రెడ్ బీకాన్) కార్లకు, విఐపి కార్ల సంస్కృతికి తాము దూరమని చెప్పకనే చెప్పారు.

అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన తొలిరోజు అసెంబ్లీ సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులంతా సామాన్యుల్లా సాధారణంగా సభకు వచ్చారు. కొందరు ఎమ్మెల్యేలు మెట్రో రైళ్లలో మరికొందరు ఆటోల్లోను, తమ వ్యక్తిగత కార్లలోను సభకు వచ్చారు. ఇంకొందరైతే బ్యాటరీతో నడిచే ఆటోరిక్షాలలో విధాన సభకు వచ్చారు. క్యాంపస్ చుట్టూ కూడా ఎలాంటి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు లేరు.
కేజ్రీవాల్ సారధ్యంలో సామాన్యుడు సైతం విధాన సభలోకి ప్రవేశించి వెసులుబాటు కల్పించారు. అనేకమంది ఆప్ పార్టీ క్యాప్‌లను ధరించి ఉన్నారు. ఈ టోపీలపై 'మై ఆమ్ ఆద్మీ హూ' (నేను సామాన్యుడిని), 'ముజే స్వరాజ్ చాహియే' (నాకు స్వాతంత్ర్యం కావాలి) అని రాసి ఉంది. అరవింద్ కేజ్రీవాల్ మాత్రం తన స్వంత బ్లూకలర్ వ్యాగన్ఆర్ కారులో వచ్చారు. ఏదేమైనప్పటికీ, బుగ్గ కార్లకు స్వస్తి చెప్పడం, సామాన్యులను విధాన సభలోకి అనుమతించడం వంటి విషయాల్లో అరవింద్ కేజ్రీవాల్ తన సింప్లిసిటీని మరోసారి తెలియజేశారు.


Click it and Unblock the Notifications








