అజిత్ పవార్ ఆఖరి ప్రయాణం ఆ విమానంలోనే..ప్రమాదానికి గురైన లియర్‌జెట్ 45 ప్రత్యేకతలివే
మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించారు. బారామతిలో ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా జరిగిన ఈ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అసలు అజిత్ పవార్ ప్రయాణించిన ఆ విమానం ఏది ? అది ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? దాని సామర్థ్యం ఎంత? అనే సాంకేతిక వివరాలపై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆ విమానం వివరాలు, అందులో ఎవరెవరు ఉన్నారు అనే పూర్తి సమాచారం ఈ వార్తలో తెలుసుకుందాం.
మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బుధవారం ఉదయం 8:45 గంటలకు బారామతి ఎయిర్ పోర్టు సమీపంలో కూలిపోయింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి సకాలంలోనే టేకాఫ్ అయినప్పటికీ, ల్యాండింగ్‌కు కేవలం ఐదు నిమిషాల ముందు ఈ ఘోరం జరిగింది.

అజిత్ పవార్ ప్రయాణించిన ఈ విమానం పేరు లియర్‌జెట్ 45 (Learjet 45). ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిజినెస్ జెట్‌లలో అత్యంత వేగవంతమైన, సురక్షితమైన విమానంగా పేరు పొందింది. కానీ బారామతిలో జరిగిన ఈ దుర్ఘటన ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది.
లియర్‌జెట్ 45 విమానాన్ని కెనడాకు చెందిన ప్రసిద్ధ విమాన తయారీ సంస్థ బాంబార్డియర్ ఎయరోస్పేస్ (Bombardier Aerospace) నిర్మించింది. దీని రిజిస్ట్రేషన్ నంబర్ VT-SSK. ఇది ఒక సూపర్ లైట్ మీడియం సైజ్ బిజినెస్ జెట్. ఇందులో సాధారణంగా 8 నుంచి 9 మంది ప్రయాణికులు కూర్చునే వీలుంటుంది. ఈ విమానం గంటకు గరిష్టంగా 464 నాట్స్ (సుమారు 860 కిమీ) వేగంతో ప్రయాణించగలదు.

ఇది భూమి నుంచి 51,000 అడుగుల ఎత్తులో ప్రయాణించే కెపాసిటీని కలిగి ఉంది. కమర్షియల్ విమానాలు కూడా ఇంత ఎత్తుకు వెళ్లవు. ఒక్కసారి ఇంధనం నింపితే సుమారు 2000 నాటికల్ మైళ్ల (3700 కి.మీ) దూరం వరకు నిరంతరాయంగా ఎగిరే శక్తి దీని సొంతం.
ఈ విమానాన్ని 2004లో మరింత ఆధునికీకరించి Learjet 45XR వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతటి శక్తివంతమైన ఇంజిన్ కలిగిన విమానం కూలిపోవడం వెనుక బలమైన సాంకేతిక లోపం లేదా వాతావరణ పరిస్థితులే ఉండి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

అజిత్ పవార్ ప్రయాణించిన ఈ విమానం ఢిల్లీకి చెందిన M/S VSR Ventures Pvt Ltd అనే ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందినది. ఈ సంస్థ ప్రముఖులకు విమానాలను అద్దెకు ఇవ్వడంతో పాటు ఏవియేషన్ కన్సల్టెన్సీ సర్వీసులను కూడా అందిస్తుంది.
అయితే ఈ కంపెనీ ట్రాక్ రికార్డ్ అంత ఆశాజనకంగా మాత్రం లేదు. సరిగ్గా 2023 సెప్టెంబర్ 14న ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఇదే కంపెనీకి చెందిన మరో విమానం ప్రమాదానికి గురైంది. ఆ రోజు పెను ప్రమాదం తప్పినప్పటికీ, నేడు జరిగిన ఘటనలో అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోవడం ఆ కంపెనీ భద్రతా ప్రమాణాలపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.

బుధవారం ఉదయం 8:10 గంటలకు ముంబై నుంచి ఈ విమానం బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం 8:50 గంటలకు బారామతిలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. కానీ 8:45 నిమిషాలకే రన్‌వేకు సమీపంలో క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. ఈ విమానంలో మొత్తం 5 మంది ప్రయాణిస్తున్నారు.
వారిలో అజిత్ పవార్ (మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి), విదిప్ జాదవ్ (ముంబై PSO హెడ్ కానిస్టేబుల్), కెప్టెన్ సుమిత్ కపూర్ (పైలట్), కెప్టెన్ శాంభవి పాఠక్ (కో-పైలట్), పింకీ మాలి (ఫ్లైట్ అటెండెంట్) ఉన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో మంటలు చెలరేగడంతో అందరూ అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం అందుతోంది. లో విజిబిలిటీ (మంచు) కారణంగా పైలట్ రన్‌వేను అంచనా వేయడంలో పొరపాటు పడి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అజిత్ పవార్ వంటి కీలక నేత ప్రయాణిస్తున్నప్పుడు ఇలాంటి భద్రతా లోపాలు జరగడం చర్చనీయాంశమైంది.
కేంద్ర పౌర విమానయాన శాఖ (DGCA) ఈ ఘటనపై సీరియస్ అయ్యింది. బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు, విమానం కూలిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. ఏవియేషన్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ నిబంధనల ప్రకారం ప్రైవేట్ జెట్‌ల నిర్వహణ సరిగ్గా ఉందా లేదా అన్న కోణంలో విఎస్ఆర్ వెంచర్స్ కంపెనీని విచారిస్తున్నారు.
అజిత్ పవార్ ప్రయాణించిన విమానం 1998-2009 మధ్య తయారైన పాత మోడల్ కావడం వల్ల మెయింటెనెన్స్ సమస్యలు వచ్చి ఉంటాయా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఏదేమైనా, ఒక మోడ్రన్ జెట్ విమానం ఇలా మృత్యుపాశం కావడం మహారాష్ట్రను విషాదంలో ముంచెత్తింది.


Click it and Unblock the Notifications








