ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన టాప్ 10 మోటార్‌సైకిళ్లు ఏవో తెలుసా..?
ప్రస్తుత పోటీ ప్రపంచంలో అనేక ఆటోమొబైల్ కంపెనీలు తమ వైవిధ్యాన్ని చాటుకునేందుకు ఇతర బ్రాండ్లతో పోటీపడుతుంటాయి. ఫలితంగా, ఒకదానికొకటి భిన్నంగా మరియు విలాసవంతంగా ఉండే ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తుంటాయి. కార్లలో కోట్ల రూపాయలు ఖరీదు చేసే మోడళ్లు ఉన్నాయని మనందరికీ తెలుసు. కానీ, బైక్ లలో ఏకంగా 85 కోట్ల రూపాయలు (మీరు కరెక్ట్ గానే చదివారు..) ఖరీదు చేసే బైక్ ఉందంటే మీరు నమ్ముతారా..?

ఈనాటి కథనంలో మనం ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన టాప్ 10 లగ్జరీ మోటార్‌సైకిళ్ల గురించి తెలుసుకుందాం రండి. వీటిలో కొన్ని బైక్‌లు చాలా అంటే చాలా ఖరీదైనవి, వీటికి వెచ్చించే సొమ్ముతో ఓ విలాసవంతమైన ప్యాలెస్‌ను నిర్మించుకోవచ్చు. వాస్తవానికి, ఇటువంటి అరుదైన బైక్‌లు చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే తయారు చేయబడతాయి లేదా కొన్ని కేవలం బైక్ షోలు లేదా ఈవెంట్‌లలో ప్రదర్శించడానికి మాత్రమే తయారు చేయబడ్డాయి. కొందరు ఔత్సాహిక బైక్ ప్రియులు కూడా ఈ ఖరీదైన బైక్‌లను ప్రత్యేకంగా ఆర్డర్‌పై తయారు చేయించుకుంటుంటారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ 10 అత్యంత ఖరీదైన మోటార్‌సైకిళ్లు ఏవో చూద్దాం రండి.

10. డ్యుకాటి టెస్టా స్ట్రాటా ఎన్‌సిఆర్ (Ducati Testa Stratta NCR)
ముందుగా మనం ఈ జాబితాలో చివరి నుండి తెలుసుకుందాం. ఈ జాబితాలో పదవ స్థానంలో ఉన్నది ఇటాలియన్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ డ్యుకాటి తయారు చేసిన డ్యుకాటి టెస్టా స్ట్రాటా ఎన్‌సిఆర్ (Ducati Testa Stratta NCR). ఈ డ్యుకాటి కాన్సెప్ట్ బైక్ సాధారణ స్పోర్ట్స్ బైక్ లాగా కనిపిస్తుంది కానీ దీని నిర్మాణం మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

ఈ బైక్ యొక్క ఫ్రేమ్‌ను తయారు చేయడానికి కార్బన్ ఫైబర్ మరియు టైటానియం పదార్థాలు ఉపయోగించబడ్డాయి, ఇవి చాలా ఖరీదైనవి. ఈ బైక్ లో శక్తివంతమైన 998 సిసి వి2 ట్విన్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. అయితే, తేలికపాటి ఫ్రేమ్ కారణంగా, దీని బరువు కేవలం 134 కిలోలు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం, కంపెనీ ఈ బైక్‌ను ప్రత్యేక ఆర్డర్‌పై మాత్రమే తయారు చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ బైక్ ధర సుమారు 1.73 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది.

9. డ్యుకాటి డెస్మోసెడిసి డి16ఆర్ఆర్ ఎన్‌సిఆర్ ఎమ్16 (Ducati Desmosedici D16RR NCR M16)
డ్యుకాటి బ్రాండ్ కి చెందిన మరొక ఖరీదైన బైక్ డెస్మోసెడిసి డి16ఆర్ఆర్ ఎన్‌సిఆర్ ఎమ్16 (Ducati Desmosedici D16RR NCR M16 ). కంపెనీ బైక్ ను పరిమిత సంఖ్యలో మాత్రమే తయారు చేసింది. ఈ స్పోర్ట్స్ బైక్ లో 989 సిసి V4 ఇంజన్ ఉంటుంది, ఇది గరిష్టంగా 175 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఈ బైక్ రేసింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఈ బైక్ డ్యుకాటి యొక్క రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా చాలాసార్లు పాల్గొంది. బైక్ ఇంజన్‌లో నాలుగు సిలిండర్లు ఉన్నప్పటికీ, దాని బరువు 145 కిలోలు మాత్రమే ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ధర సుమారు రూ.1.78 కోట్లు ఉంటుంది.

8. ఎకోస్ ఎఫ్ఈ టిఐ ఎక్స్ఎక్స్ టైటానియం సిరీస్ (Ecosse FE Ti XX Titanium Series)
ఈ బైక్‌ను 2007లో విడుదల చేశారు. ఆ సమయంలో దాని విభాగంలో ఇది అత్యంత ఖరీదైన బైక్. ఈ బైక్‌లోని భాగాలను కార్బన్ ఫైబర్ మరియు అల్యూమినియం అల్లాయ్ తో తయారు చేశారు. ఇందులో శక్తివతంమైన 2.4 లీటర్ ఇంజన్ ఉంటుంది. ఇది సాధారణ ఎంట్రీ లెవల్ కారులో ఉండే ఇంజన్ కన్నా శక్తివంతమైనది. ఈ ఇంజన్ గరిష్టంగా 228 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ఈ బైక్‌ను కేవలం 13 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. మార్కెట్లో దీని ధర రూ. 2.30 కోట్ల నుండి ప్రారంభం అవుతుంది.

7. డాడ్జ్ టోమాహాక్ వి10 (Dodge Tomahawk V10 )
డాడ్జ్ అనేది కార్లను తయారు చేసే సంస్థ. ఈ బ్రాండ్ తయారు చేసిన డాడ్జ్ టోమాహాక్ వి10 (Dodge Tomahawk V10 ) ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బైక్. దీని గరిష్ట వేగం గంటకు 450 కిలోమీటర్లు మరియు ఇది కేవలం 2.5 సెకన్లలో గంటకు 0-60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

ఈ బైక్‌లో 507 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేయగల శక్తివంతమైన 8.3 లీటర్ 20 వాల్వ్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ తో పాటు ఈ బైక్ డిజైన్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మెరుగైన బ్యాలెన్స్ కోసం దీని ముందు మరియు వెనుక భాగంలో రెండేసి చొప్పున చక్రాలు అమర్చబడి ఉంటాయి. దీని ఖరీదు దాదాపు రూ.4.23 కోట్లు.

6. హార్లే డేవిడ్‌సన్ కాస్మిక్ స్టార్‌షిప్ (Harley Davidson Cosmic Starship)
పాపులర్ అమెరికన్ టూవీలర్ బ్రాండ్ హ్యార్లే డేవిడ్సన్ తయారు చేసిన ఈ బైక్ ఒక కళాఖండంగా చెప్పుకోవచ్చు. ప్రఖ్యాత కళాకారుడు, జాక్ ఆర్మ్‌స్ట్రాంగ్‌తో భాగస్వామ్యంతో, హార్లే డేవిసన్ పసుపు మరియు ఎరుపు రంగుల కలయికతో కంపెనీ ఈ ప్రత్యేకమైన మోడల్ ను తయారు చేసింది. కంపెనీ దీనిని 1.5 మిలియన్ డాలర్లకు (రూ. 11.54 కోట్లు) విక్రయించింది. ఇందులో ఉపయోగించిన పెయింట్ ధరే దాదాపు 9 లక్షల డాలర్లట.

5. బిఎమ్ఎస్ నెహ్మెసిస్ (BMS Nehmesis)
ఇక ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్న బైక్ బిఎమ్ఎస్ నెహ్మెసిస్ (BMS Nehmesis). ఈ బైక్ చూడటానికి చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ, ఇందులో అనేక ఆధునిక ఫీచర్లను ఉపయోగించారు. ఈ బైక్‌కు సైడ్ స్టాండ్ లేదు, బదులుగా బైక్‌కు ఎయిర్ సస్పెన్షన్ ఇవ్వబడింది, దీని కారణంగా బైక్ ను ఇంజన్‌పైనే పార్క్ చేయవచ్చు. ఎయిర్ సస్పెన్షన్ ఆన్‌తో, బైక్ యొక్క ఎత్తును దాదాపు 10 అంగుళాల వరకు పెంచుకోవచ్చు. మార్కెట్లో ఈ బైక్ ధర దాదాపు రూ. 23 కోట్లు.

4. హీడ్‌బ్రాండ్ & వోల్ఫ్‌ముల్లర్ (Hidebrand & Wolfmuller)
చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా మోటార్‌సైకిళ్లను తయారు చేసే ప్రయత్నం ప్రారంభమైనప్పుడు, అప్పటి ఇంజనీర్ల ఆలోచన నుండి పుట్టుకొచ్చినదే ఈ ఐకానిక్ హీడ్‌బ్రాండ్ & వోల్ఫ్‌ముల్లర్ (Hidebrand & Wolfmuller) మోటార్ సైకిల్. హీడ్‌బ్రాండ్ మరియు వోల్ఫ్‌ముల్లర్ అనే ఇద్దరు ఆవిరి యంత్ర ఇంజనీర్లు పెట్రోల్‌తో నడిచే బైక్‌ను అభివృద్ధి చేశారు. ఇది నెట్టడం ద్వారా స్టార్ట్ అవుతుంది. ఈ బైక్‌లో కిక్ మరియు గేర్ లేదు. ఇందులోని థ్రోటల్‌ని తిప్పడం ద్వారా మాత్రమే ఇది ముందుకు సాగేది. చాలా పరిమిత సంఖ్యలో ఉత్పత్తి అయిన ఈ బైక్ ధర సుమారు రూ.27 కోట్లు.

3. ఎకోస్ ఈఎస్1 స్పిరిట్ (Ecosse ES1 Spirit)
ఎకోస్ ఈఎస్1 స్పిరిట్ (Ecosse ES1 Spirit) చాలా ప్రత్యేకమైన బైక్. ఈ బైక్ డిజైన్ 21వ శతాబ్దపు ఇంజనీరింగ్ నమూనాగా చెప్పుకోవచ్చు. ఈ బైక్ యొక్క ఛాసిస్ డిజైన్ దీనిని ఇతర బైక్ లతో ప్రత్యేకంగా ఉంటేలా చేస్తుంది. బైక్ యొక్క ఫ్రంట్ సస్పెన్షన్ ఇంజన్‌కి లింక్ చేయబడి ఉంటుంది. అయితే, వెనుక సస్పెన్షన్ మరియు స్వింగ్‌ఆర్మ్ వెనుక గేర్‌బాక్స్‌కు కనెక్ట్ చేయబడి ఉంటాయి.

భారీ డిజైన్ ను కలిగి ఉన్నప్పటికీ, దీని బరువు మాత్రం 120 కిలోలుగానే ఉంటుంది. ఈ బైక్‌కు కారు మాదిరిగానే ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ లభిస్తుంది మరియు ఇందులోని అన్ని కంట్రోల్స్ కూడా పూర్తిగా ఎలక్ట్రానిక్‌గా ఉంటాయి. ఈ బైక్ నడపడానికి రెండు వారాల ప్రత్యేక శిక్షణ అవసరం. మార్కెట్లో దీని ధర దాదాపు రూ. 27.68 కోట్లుగా ఉంటుంది.

2. 1949 ఈ90 ఏజెఎస్ పోర్కుపైన్ (1949 E90 AJS Porcupine)
పేరుకు తగినట్లుగానే ఇదొక పాతకాలపు పురాతన క్లాసిక్ మోటార్‌సైకిల్. పాతదేనని తీసిపారేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఇది ప్రపంచంలోని అత్యంత విలువైన బైక్‌ల జాబితాలో రెండవ స్థానంలో ఉంది. ఏజెఎస్ పోర్కుపైన్ 1949లో సృష్టించబడింది మరియు అదే సంవత్సరంలో బైక్ రేసర్ లెస్ గ్రాహం ఈ బైక్‌తో ప్రపంచ మోటార్‌సైకిల్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. ఈ బైక్ ఆ సమయంలో ఇది అత్యంత విలాసవంతమైన మరియు శక్తివంతమైన బైక్‌లలో ఒకటి. ఈ బైక్ 500సీసీ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని కోవెంట్రీ నేషనల్ మోటార్‌సైకిల్ మ్యూజియంలో ఉంచబడింది. దీని విలువ రూ.53 కోట్లు.

1. నీమాన్ మార్కస్ లిమిటెడ్ ఎడిషన్ ఫైటర్ (Neiman Marcus Limited Edition Fighter)
ఇక నెంబర్ వన్ విషయానికి వస్తే.. ముందు దీని ధరెంతో తెలుసుకుందాం రండి. ఈ ఫొటోలో కనిపించే బైక్ ధర జస్ట్ 85 కోట్ల రూపాయాలు మాత్రమే. దీని పేరు నీమాన్ మార్కస్ లిమిటెడ్ ఎడిషన్ ఫైటర్ (Neiman Marcus Limited Edition Fighter). నీమాన్ మార్కస్ ప్రస్తుత కాలంలో అత్యంత అధునాతనమైన బైక్. ఈ బైక్ యొక్క ఛాసిస్ మరియు ఫ్రేమ్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా మరియు సినిమాలలో కనిపించే బైక్స్ లా ఫ్యూచరిస్టిక్ గా ఉంటుంది.

ఈ బైక్‌లోని విశేషమేమిటంటే, దీని ఫ్రేమ్ ఒక పెద్ద ఇనుప ముక్కను కత్తిరించి తయారు చేయబడింది. అంటే, దీని ఫ్రేమ్ మొత్తం ఒకే పీస్‌తో తయారు చేయబడిందన్నమాట మరియు ఇందులో ఎక్కడా జాయింట్ కానీ లేదా వెల్డింగ్ కానీ ఉండదు. ఈ బైక్‌లో శక్తివంతమైన 1966 సీసీ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా గంటకు 300 కిమీ వేగాన్ని కలిగి ఉంటుంది మరియు కేవలం 3 సెకన్లలో గంటకు 0-100 కిమీ వేగాన్ని అందుకోగలదు. ఇవి టాప్ 10 ఖరీదైన బైక్స్, మరి వీటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్స్ లో తెలియజేయండి.


Click it and Unblock the Notifications








