దిల్ రాజు అల్లుడి లగ్జరీ పోర్షే కారు చోరీ.. గంటలోనే పట్టుకున్న పోలీసులు, విచారణలో దొంగ మాటలకు షాక్.!!
ప్రముఖ నిర్మాత దిల్ రాజు అల్లుడికి చెందిన ఖరీదైన పోర్షే కారును దొంగిలించిన ఓ ఖతర్నాక్ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అతను చెప్పిన కారణాలు విని పోలీసులు ఖంగు తిన్నారు.
హైదరాబాద్‌లో ఇటీవల రూ 1.7 కోట్లు విలువైన లగ్జరీ పోర్షే(Porsche Cayman) కారు చోరీకి గురైంది. కాగా గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును ఛేదించి దొంగను పట్టుకున్నారు. పోర్షే కారు ప్రముఖ తెలుగు సినీ ప్రొడ్యూసర్ దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డికి చెందినదిగా పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఈ ఘటన జరిగింది.

దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి తన పోర్షే కేమాన్ కారులో మాదాపూర్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కు జిమ్ కోసం వెళ్లాడు. పార్కింగ్ ఏరియాలో కారు పార్క్ చేసి లోపలికి వెళ్లారు. ఇది గమనించిన ఓ దొంగ.. అక్కడ ఎవరూ లేని సమయం చూసి కారును చాకచక్యంగా ఎత్తుకెని వెళ్లిపోయాడు. కాసేపటికి అక్కడికి వచ్చిన అర్చిత్ రెడ్డి కారు అక్కడ లేకపోవడం చూసి షాక్‌కు గురయ్యారు.
దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజ్‌ల సాయంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. లభ్యమైన సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే మాదాపూర్, జూబ్లీహిల్స్‌లోని వివిధ ప్రాంతాల్లో కారు తిరుగుతున్నట్లు తేలింది. జూబ్లీహిల్స్‌లో ఓ చోట రెడ్ సిగ్నల్ జంప్ చేసినట్లు గుర్తించగా వెంటనే కేబిఆర్ పార్క్ సమీపంలోని ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిదితుడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

అతడిని విచారించగా, దొంగ హైదరాబాద్‌లోని మన్సూరాబాద్ ప్రాంతానికి చెందిన సాయకిరణ్‌గా పోలీసులు గుర్తించారు. లగ్జరీ కార్లను దొంగిలించడం, వాటిల్లో ఫ్యూయెల్ అయిపోయే వరకు రోడ్లపై దర్జాగా తిరగడం అతని హాబీ.. అయితే ఫ్యూయెల్ అయిపోగానే కారు అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. గతంలోనూ సాయికిరణ్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి.
విచారణలో సాయి కిరణ్ వ్యాఖ్యలు విని పోలీసులు ఖంగు తిన్నారు. తనకు జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీకి పీఏనని, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో తనకు హై లెవెల్ పరిచయాలు ఉన్నాయని పోలీసులకు తెలిపాడు. అంతే కాకుండా దిల్ రాజు అల్లుడి పోర్షే కేమాన్ కారును దొంగిలించాలని మంత్రి కేటీఆర్ తనకు సూచించారని కూడా వెల్లడించాడు.

సాయికిరణ్ మాటలతో విసిగిపోయిన పోలీసులు అతని కుటుంబీకులను సంప్రదించారు. అయితే సాయికిరణ్ మానసికంగా ఆరోగ్యంగా లేడని.. బ్రైట్ లైఫ్ ఫౌండేషన్‌లో చికిత్స పొందుతున్నాడని కుటుంబీకులు ధ్రువీకరించారు. అయితే ఈ చోరీ సంఘటనపై సాయికిరణ్‌పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై ఇప్పటి వరకు సమాచారం ఖచ్చితంగా లేదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








