సైరస్ మిస్త్రీ మరణానికి హైవైపే ఉన్న "బ్లైండ్ స్పాట్" కారణమా..? అసలు బ్లైండ్ స్పాట్ అంటే ఏమిటి..?
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ మరియు ప్రస్తుత షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్ అయిన సైరస్ మిస్త్రీ గత ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసినదే.
Recommended Video
అతివేగం, వెనుక సీటులో సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్లనే ఆయన మరణించినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ, ఈ కారు యాక్సిడెంట్‌కు గురికావడానికి "బ్లైండ్ స్పాట్" కూడా ఓ కారణం కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

హైవేపై ఉన్న 'బ్లైండ్ స్పాట్'ల గురించి ప్రస్తావించిన పోలీసులు
సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదం కారణంగా ముంబై-అహ్మదాబాద్ హైవేపై ఉన్న ‘బ్లైండ్ స్పాట్స్' అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న పాల్ఘర్ పోలీసులు కూడా హైవేపై ఉన్న 'బ్లైండ్ స్పాట్'ల గురించి కూడా ప్రస్తావించారు. పాల్ఘర్ ఎస్పీ బాలాసాహెబ్ పాటిల్ ముంబై-అహ్మదాబాద్ హైవేపై చాలా చోట్ల బ్లైండ్ స్పాట్‌లు ఉన్నట్లు తెలిపారు. బ్లైండ్ స్పాట్ నిర్మూలన కమిటీ ముందు కూడా ఈ అంశాన్ని లేవనెత్తినట్లు ఆయన చెప్పారు.

ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై వివిధ ప్రదేశాలలో "బ్లైండ్ స్పాట్స్" ఉనికిని గుర్తించిన ఓ అధికారి, ఈ విషయాన్ని బ్లైండ్ స్పాట్ నిర్మూలన కమిటీ ముందు ఉంచారు. ఈ బ్లైండ్ స్పాట్‌లను తొలగించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) కూడా ప్రయత్నాలు చేస్తోందని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని సదరు అధికారి తెలిపారు.

పర్పత్ వే నుండి వస్తున్న కారుతో ప్రమాదం జరిగింది - పోలీసులు
పాల్ఘర్ ఎస్పీ బాలాసాహెబ్ పాటిల్ మీడియాతో తెలిపిన వివరాల ప్రకారం, అతివేగం కారణంగా నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు. అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అన్నారు. అతి వేగం కారణంగా డ్రైవర్ సరైన నిర్ణయం తీసుకోలేకపోయారని, ఆ సమయంలో కారును అనహిత పండోల్ నడుపుతున్నారని చెప్పారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం నలుగురు ఉన్నారు, సైరస్ మిస్త్రీ మరియు జహంగీర్ పండోల్ లు కారులో వెనుక కూర్చున్నారు. వెనుక కూర్చున్న ఇద్దరు వ్యక్తులు సీటు బెల్టు పెట్టుకోలేదని, అనాహిత పండోల్ మరియు ఆమె భర్త డారియస్ పండోల్ ముందు సీట్లలో ఉన్నారని, వారు మాత్రం సీట్ బెల్టులు ధరించి ఉన్నారని పోలీసు తెలిపారు.

నితిన్ గడ్కరీ కూడా ‘బ్లైండ్ స్పాట్' గురించి ప్రస్తావించారు
కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా గచిన ఆగస్టు నెలలో ‘బ్లైండ్ స్పాట్' గురించి ప్రస్తావించారు. దేశంలో ఏటా ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అందులో 1.50 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. రోడ్డు ప్రమాదాలకు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)లోని లోపాలే ప్రధాన కారణమని చెప్పారు. బ్లైండ్ స్పాట్‌లపై ప్రత్యేక దృష్టి సారించి డీపీఆర్ తయారీలో గుణాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని గడ్కరీ అన్నారు.

2017లో జాతీయ రహదారిపై 45 స్పాట్‌లను గుర్తించారు
ఓ నివేదిక ప్రకారం, 2017లో స్టేట్ హైవే ట్రాఫిక్ పోలీసులు ముంబై అహ్మదాబాద్ నేషనల్ హైవే (NH 8)లో సుమారు 45 బ్లైండ్ స్పాట్‌లను గుర్తించారు. 2016లో 1,428 కిలోమీటర్ల పొడవైన ఈ హైవేపై 1,169 ప్రమాదాలు జరగ్గా, అందులో 307 మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, హైవే లపై బ్లైండ్ స్పాట్‌లను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది.

అసలు బ్లైండ్ స్పాట్ అంటే ఏమిటి?
బ్లైండ్ స్పాట్‌లు అంటే హైవే లేదా రోడ్‌లో మీరు సరిగ్గా చూడలేని ప్రదేశాలు. సింపుల్‌గా చెప్పాలంటే, మన కళ్లతో రోడ్డుపై మనం చూడలేని ప్రదేశాలను బ్లైండ్ స్పాట్స్ అని పిలుస్తారు. ప్రత్యేకించి మలుపుల వద్ద ఈ బ్లైండ్ స్పాట్స్ ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా బ్లైండ్ స్పాట్ క్రాష్‌లు రోడ్డుపై అనేక ప్రదేశాలలో సంభవించవచ్చు, ముఖ్యంగా ట్రక్కులు చుట్టూ ఉన్నప్పుడు. లేన్‌లు మారుతున్నప్పుడు, రెండు లేన్లు ఒక్కటిగా కలుస్తున్నప్పుడు (లేన్ మెర్జ్), కారును రివర్స్ చేస్తున్నప్పుడు, ద్విచక్రవాహనదారులు లేదా పాదచారులు రోడ్డుపై ఉన్నప్పుడు కూడా బ్లైండ్ స్పాట్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది.

బ్లైండ్ స్పాట్ క్రాష్ లను నివారించడం ఎలా?
బ్లైండ్ స్పాట్ వద్ద డ్రైవ్ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన మొదటి రూల్ ఏంటంటే, అతి వేగాన్ని తగ్గించుకోవడం. బ్లైండ్ స్పాట్స్ లో ఎదురుగా లేదా పక్కగా వస్తున్న వాహనం మనకు పూర్తిగా కనిపించకపోవచ్చు అలాంటి సందర్భాల్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. కాబట్టి, మీ కళ్లకు బ్లైండ్ స్పాట్ కనిపించిన వెంటనే మీ వాహన వేగాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మీ కారులో ఉండే అదనపు భద్రతా ఫీచర్లతో పాటుగా, బ్లైండ్ స్పాట్ క్రాష్‌ను నివారించడానికి మీరు ఉపయోగించాల్సిన అదనపు మార్గాలు కూడా ఉన్నాయి, అవేంటంటే..

ప్రయాణాననికి ముందే కారు అద్దాలను చక్కగా సెట్ చేసుకోవడం, వెనుక సీట్లలోని హెడ్‌రెస్ట్‌లు మీ రియర్ వ్యూని బ్లాక్ చేయకుండా ఉండేలా చూసుకోవడం, కారు లోప ఉండే రియర్ వ్యూ మిర్రర్ ని చక్కగా సర్దుబాటు చేసుకోవడం, బయటి మార్కెట్లో లభించే బ్లైండ్ స్పాట్ మిర్రర్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవడం లేదా సైడ్-వ్యూ మిర్రర్‌లను అప్‌గ్రేడ్ చేసుకోవడం, లేన్లు మారేటప్పుడు ఓవర్-ది-షోల్డర్ (భుజం పై నుండి) తనిఖీ చేయండి మరియు ఇతరుల బ్లైండ్ స్పాట్‌ల పట్ల అప్రమత్తంగా ఉండంటం మొదలైనవి.


Click it and Unblock the Notifications








