ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకోవడానికి ఆటో డ్రైవర్ క్రేజీ స్టంట్.. ఏం చేశాడో తెలిస్తే షాకవుతారు..
దేశంలో మెట్రో పాలిటన్ నగరాల్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. హైదరాబాద్, ముంబయి, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో రోడ్లపైన వాహనాలతో రద్దీ నెలకొంటోంది. దీంతో ఆఫీసు పని మీద, బయటికి వెళ్లే వారు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నారు.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడంతో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకూ సమస్యగా మారింది. ఉదయం, సాయంత్రం వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో నిలబడి ఇంటికి లేదా ఆఫీస్‌కి చేరుకోవడానికి ఆలస్యమవుతోంది. వర్షాలు పడితే పరిస్థితి మరింత కష్టంగా మారుతోంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి, ఓ డ్రైవర్ తన ఆటోను పాదచారులు నడిచే ఫుట్ ఓవర్ బ్రిడ్జి మెట్లపై నడిపాడు. ఢిల్లీలోని హమ్‌దర్ద్ నగర్‌లోని సంగమ్ విహార్ ట్రాఫిక్ సర్కిల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
ఫ్లై ఓవర్ కింద రోడ్డుపై ఆటో డ్రైవర్ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా త్వరగా వెళ్లేందుకు ఆటో డ్రైవర్ ఈ చర్యకు పాల్పడ్డాడు. ఈ దృశ్యాన్ని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. డ్రైవర్‌ను 25 ఏళ్ల మున్నాగా గుర్తించారు. తొలుత రోడ్డు మీద నుంచి ఫుట్‌పాత్‌కు ఆటోను తీసుకెళ్లిన డ్రైవర్.. అనంతరం ఫ్లెఓవర్ మెట్లపైకి ఆటోను ఎక్కించారు.

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. వీడియోని పరిశీలిస్తే, డ్రైవర్ ఫ్లైఓవర్‌పై ఆటోను పోనిస్తున్నప్పుడు అందులో ప్రయాణికులు ఎవరూ లేరు. కానీ కొద్ది సేపటి తర్వాత మరొక వ్యక్తి ఆటో ఎక్కాడు. బహుశా అతను ఆటో డ్రైవర్ స్నేహితుడు అయ్యే అవకాశం ఉంది. ఆటోను ఫుట్ ఓవర్ మెట్లు ఎక్కించేందుకు అతను సహకరించడాన్ని వీడియోలో చూడవచ్చు.
ఆటో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై వెళ్తుండగా.. అక్కడ ఉన్న వారు ఆటో డ్రైవర్ చేసిన పని చూసి అవాక్కయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఇది ఢిల్లీ పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో ఢిల్లీ పోలీసులు ఆటోను సీజ్ చేసి డ్రైవర్‌తో పాటు అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు సంగం విహార్ నివాసి అని తెలిసింది.

ఢిల్లీ సహా చాలా రద్దీ నగరాల్లో ఆటోడ్రైవర్లు ఎవరూ ఇలాంటి పనులకు పాల్పడరు. ఆలస్యమైనా సరే.. వారు తమ ప్రయాణీకులను ఒక నిర్దిష్ట గమ్యస్థానానికి సురక్షితంగా చేరుస్తారు. అయితే ఈ డ్రైవరు ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఈ విధంగా ఎందుకు ఆటో నడిపాడనే సమాచారం లేదు.
రోడ్డు లేదా హైవేపై డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. దీని ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చు. మీ కారు లేదా ద్విచక్ర వాహనాన్ని నిర్దేశించిన లైన్‌లో మాత్రమే నడపాలి. ఏ కారణం చేతనైనా వన్‌వే రోడ్‌లలో ప్రయాణించవద్దు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. నిర్దేశిత వేగ పరిమితిలోపు వాహనాలను నడపాలి.
మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. అలాగే మీరు బండి నడుపుతున్నప్పుడు ఫోన్ మాట్లాడకండి. కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్డ్, ద్వి చక్ర వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. ట్రాఫిక్ నిబంధనలను సక్రమంగా పాటించడం ద్వారా మీరు క్షేమంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు.


Click it and Unblock the Notifications








