హైవేపై డోర్లు తెరిచి కారు డ్రైవింగ్.. వీడియో వైరల్, కారు సీజ్
ఇటీవల రహదారులపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనదారులు విచ్చలవిడిగా డ్రైవింగ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. కారు టాప్ ఎక్కి స్టంట్స్ చేయడం, కారు కదులుతున్నప్పుడు డోర్లు పట్టుకుని వేలాడటం లాంటి ఘటనలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. పోలీసుల దృష్టికి వెళ్లడంతో చలాన్లు విధించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం కొందరు ఆకతాయిలు ఇలా పబ్లిక్ రోడ్లపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించినా ఇలాంటివి పునరావృతం అవుతూనే ఉన్నాయి. చివరికి ట్రాఫిక్ జరిమానాలతో తప్పించుకుంటున్నారు. తాజాగా గోవాలో రహదారిపై కారు డోర్లు తీసి వాహనం నడుపుతున్న వీడియో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

గోవాలో జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. మారుతి రిట్జ్ కారులో ప్రయాణిస్తున్న కొందరు.. ఆ కారు నాలుగు డోర్లు వెడల్పుగా తెరిచి వాహనాన్ని నడుపుతున్నారు. ఈ సంఘటనను వెనుక నుంచి వస్తున్న మరో వాహనంలోని వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. వీడియో వైరల్ కావడంతో, పోలీసు అధికారులు వెంటనే కారు డ్రైవర్‌ను పట్టుకున్నారు.
సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. వీడియోలో కారు హైవేలో ఎడమ లేన్‌లో వెళ్తూ నాలుగు డోర్లు తెరిచి ఉంచడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పక్కన వెళ్తున్న వాహనాలు అప్రమత్తంగా ఉంటూ ఆ కారుకు కొంచెం దూరంగా ప్రయాణిస్తున్నాయి. కారు డోర్లు తెరిచి ఉన్నా అదృష్టవశాత్తు ఇతర వాహనాలతో ఎటువంటి ఘర్షణలు జరగలేదు. అనంతరం డ్రైవర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద యూ టర్న్‌ని తీసుకోవడంతో వీడియో ముగిసింది.

నివేదికల ప్రకారం, ఈ సంఘటన గోవాలోని పోర్వోరిమ్‌లో జాతీయ రహదారిపై చోటుచోసుకుంది. రిట్జ్ వెనుక ఉన్న కారులో ప్రయాణికులు ఆ కారు యొక్క స్పష్టమైన వీడియోను రికార్డు చేశారు. అంతేకాకుండా దాని రిజిస్ట్రేషన్ నంబర్‌ను కూడా ఆన్‌లైన్‌లో కూడా పోస్ట్ చేశారు.
వీడియో వైరల్ కావడంతో, గోవా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ నంబరు ఆధారంగా కారు డ్రైవర్ మరియు యజమానిని గుర్తించగలిగారు. కారు డ్రైవర్ ఫహిద్ హమాజాను అరెస్టు చేసి, కారును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, రిట్జ్ యజమానికి వ్యతిరేకంగా నోటీసులు జారీ చేశారు.

ప్రస్తుతం ఆ నోటీసుకు సంబంధించిన నిర్దిష్ట వివరాలు, ఇతర సమాచారం బహిర్గతం కాలేదు. ఈ ఘటనకు పాల్పడిన వారి చిత్రాలను ఉత్తర గోవా ఎస్పీ అధికారికంగా ట్విట్టర్‌లో షేర్ చేశారు, వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నట్లు తెలిపారు. కాగా వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడిపారా లేదా అనే విషయాన్ని నివేదికలో పేర్కొనలేదు. ఏది ఏమైనప్పటికీ, డోర్లు తెరిచి ఉన్న కారును నడపడం ప్రమాదమని గుర్తించాలి.
వీడియోను గమనిస్తే సిగ్నల్ వద్ద యూ టర్న్ తీసుకునే సమయంలో మారుతి రిట్జ్ కారు డ్రైవర్ అజాగ్రత్తగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఇది ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. సాధారణంగా భారత్‌లో వెనుక సీట్లో కూర్చున్న వారు సీటు బెల్టులు ధరించరు. ఇలా డోర్లు తెరిచి ప్రయాణిస్తున్నప్పుడు సడెన్‌గా వెనుక కూర్చున్న వారు రోడ్డుపై పడితే ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి.


Click it and Unblock the Notifications








