ఏఐ క్రైమ్ పెట్రోలింగ్ కారు.. నేరస్థుల ముఖాలు చూసి వారేం చేశారో ఇట్టే చెప్పేస్తుంది.!!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన క్రైమ్ ఫైటింగ్ పెట్రోల్ కారును ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఎగ్జిబిషన్‌లో పోలీసులు ఆవిష్కరించారు. నిందితులు చేసిన నేరాలను వారి ముఖాలను చూసి గుర్తించేలా ఈ ఏఐ పెట్రోలింగ్ వాహనాన్ని రూపొందించారు.
ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాత్ర కీలకంగా మారింది. ముఖ్యంగా పోలీసు వ్యవస్థకు హెల్ప్ చేసేందుకు ఏఐ చాలా దోహదపడుతోంది. అందుకే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిని ఏఐ కెమెరాల ద్వారా ఇట్టే పట్టుకోగలుగుతున్నారు. కార్లలోనూ త్వరలోనూ ఈ AI టెక్నాలజీని ప్రవేశపట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల దుబాయ్‌లో ప్రవేశపెట్టిన ఓ మిషన్ ఆసక్తికరంగా మారింది.

ఏఐ టెక్నాలజీతో పనిచేసే పరికరాలు వివిధ టెస్టులు, సర్వేల ద్వారా పొందిన డేటాతో పని చేస్తాయి. ADASతో సహా నేటి ఆధునిక కార్లు AI ప్రపంచంలో భాగంగా మారాయి. AI టెక్నాలజీతో ప్రజల భద్రతను మెరుగుపరచడానికి చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి దుబాయ్‌లో వివిధ రీసెర్చ్‌ల తర్వాత అభివృద్ధి చేసిన ఈ హైటెక్ పెట్రోల్ కారును విడుదల చేశారు.
పట్టణ ప్రాంతాల్లోని ప్రజల భద్రతను మెరుగుపరిచేందుకు, ఇంకా పోలీసులకు సహాయం చేసేందుకు రూపొందించిన ఈ ఏఐ పెట్రోలింగ్(AI Powered Self Driving Patrol Car) కారును అక్టోబర్ 16న దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరిగిన GITEX గ్లోబల్ 2023 ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. ఇందుకు సంబంధించి వాహనం చిత్రాలతో పాటు ట్విట్టర్ పోస్ట్‌ను దుబాయ్ పోలీసులు షేర్ చేశారు.
'360-డిగ్రీ కెమెరా మరియు ఫేస్-రికగ్నిషన్ టెక్నాలజీతో కూడిన సెల్ఫ్ డ్రైవింగ్ పెట్రోలింగ్ వాహనంతో దుబాయ్ పోలీసులు ప్రజల భద్రతను మరింతగా మెరుగుపరిచారు' అని ట్విట్టర్ పోస్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ హైటెక్ పెట్రోలింగ్ వాహనం అటానమస్ కారుగా చెబుతున్నారు.
దుబాయ్ పోలీసులు షేర్ చేసిన వివరాల ప్రకారం, ఈ పెట్రోలింగ్ వాహనంలో అధునాతన 360-డిగ్రీ కెమెరాను అమర్చారు. ఈ వాహనం దాని చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను మొత్తం 360 డిగ్రీల యాంగిల్‌లో పర్యవేక్షించగలదు. ఇంకా ఈ పెట్రోలింగ్ వాహనం స్మార్ట్ టెక్నాలజీని అంటే ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కలిగి ఉంది.
ఈ టెక్నాలజీని హైటెక్ పెట్రోలింగ్ కారులో ప్రవేశపెట్టడం ద్వారా నేరస్తుల ముఖాలను బట్టి నేరాలను గుర్తిస్తుంది. అంతే కాకుండా వాహనాల నంబర్ ప్లేట్లను స్కాన్ చేసి వాటికి సంబంధించిన పూర్తి వివరాలను కొన్ని సెకన్లలో పోలీసులకు అందజేస్తుంది. ఇంకా డైరెక్ట్ కమ్యూనికేషన్ టెక్నాలజీని కలిగి ఉన్న ఈ పెట్రోలింగ్ వాహనం రియల్ టైమ్‌లో పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాలను తక్షణమే అందిస్తుంది.
దుబాయ్ పోలీసులు ఈ AI పెట్రోలింగ్ వాహనాలతో ఆన్-బోర్డ్ డ్రోన్‌లను ఉపయోగించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ హైటెక్ పెట్రోలింగ్ వాహనాన్ని ఎలక్ట్రిక్ పవర్‌తో నడిచే వాహనంగా రూపొందించారు. ఫుల్ ఛార్జింగ్ బ్యాటరీతో వాహనం గరిష్ఠంగా 15 గంటల పాటు నడుస్తుందని దుబాయ్ పోలీసులు తెలిపారు. ఈ వాహనం గరిష్ఠంగా గంటకు 5-7 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదు.
పెరుగుతున్న నేరాలు, రోడ్డు ప్రమాదాల దృష్ట్యా ఆటోమొబైల్ రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీకి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఇలాంటి అత్యాధునిక వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి బయటకు రావడం పోలీసులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా ఇవి అటానమస్ కావడం మరో ప్లస్ పాయింట్ అనే చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








