యజమానికి తెలియకుండా 21 బైక్‌లను అమ్మి రూ. 5 కోట్లు కాజేసిన ఘరానా ఉద్యోగి..
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడనేది ఎంత వాస్తవమో.. ఈ స్టోరీ చదివితే మీకే తెలుస్తుంది. తాను పనిచేసిన కంపెనీలో లక్షా, రెండు లక్షలు కాదు ఏకంగా రూ. 5.2 కోట్లు స్వాహా చేశాడు. ఈ మోసమంతా సదరు వ్యక్తి ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత తెలిసింది. దీంతో ఇది ఎలా జరిగిందో తెలియక పోలీసులు, కంపెనీ యాజమాన్యం తలలు పట్టుకుంటోంది.
రంగారెడ్డి జిల్లా కూకట్‌పల్లికి చెందిన ఓ ఘరానా మోసగాడు.. ఓ బైక్ షోరూమ్‌లో పనిచేస్తూ అన్నం పెట్టిన సంస్థనే నిలువునా దోపిడీ చేశాడు. బెంగళూరులోని డుకాటీ బైక్ షోరూమ్‌లో పనిచేసిన 38 ఏళ్ల రాకేష్ అనే వ్యక్తి.. కస్టమర్లకు బైక్‌లను విక్రయించి వారి వద్ద వసూలు చేసిన డబ్బును దారి మళ్లించాడు. అలా రూ. 5.2 కోట్లు స్వాహా చేశాడు.

కస్టమర్లు కొనుగోలు చేసిన డుకాటీ(Ducati Bikes) బైక్‌ల వివరాలు ఆర్‌టీఓలో నమోదు కాకపోవడంతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. డుకాటి స్టోర్ జనరల్ మేనేజర్ సీఎన్ మహేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కూకట్‌పల్లికి చెందిన రాకేష్‌ను నిందితుడిగా గుర్తించారు.
రాకేష్ 2019 జూలై నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు దాదాపు 21 బైక్‌లను విక్రయించడం ద్వారా మొత్తం రూ.5.2 కోట్లు దోపిడీ చేసినట్లు తేలింది. రాకేష్ అక్టోబర్ 20న తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆడిట్ చేస్తుండగా.. కంపెనీకి చెందిన తొమ్మిది డుకాటీ పానిగేల్, మూడు మల్టీస్ట్రాడా, నాలుగు డయావెల్, రెండు మాన్‌స్టర్, ఒక డెసర్ట్‌ఎక్స్, స్క్రాంబ్లర్ మరియు స్ట్రీట్‌ఫైటర్ V4 బైక్‌లను రాకేష్ విక్రయించినట్లుగా తేలింది.

కానీ ఈ బైక్‌ల వివరాలేవి రికార్డుల్లో లేవు. రాకేష్ అమ్మిన ఒక్కో బైక్ ధర రూ.10 లక్షల నుంచి ప్రారంభమై రూ.40 లక్షల వరకూ ఉందని కంపెనీ తెలిపింది. రాకేష్ ఈ 21 మంది కస్టమర్ల నుంచి రూ. 5.2 కోట్లు వసూలు చేశాడు. ఆఫీస్ ఫెసిలిటీ సప్లయర్స్ పేరుతో రిజిస్టర్ చేయబడిన ఖాతాతో సహా పలు బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బును జమ చేసినట్లు షోరూమ్ యాజమాన్యం తెలిపింది.
రాకేష్ కొంత సొమ్మును ఆఫీస్ ఫెసిలిటీ సప్లయర్స్ ఖాతాలో జమచేయగా.. మిగిలిన డబ్బును దారి మళ్లించినట్లు ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. రాకేష్ బైక్‌లను విక్రయించాక.. కంపెనీ బైక్‌ల విక్రయాలను స్వీకరించడానికి కొన్ని విధానాలు ఉంటాయి. డెలివరీ నోట్స్, RTOకి పంపిన ఇన్‌వాయిస్ వివరాలు ఇంకా ఆడిట్‌ల ట్రయల్ ఉండాలి. ఇవి పూర్తయిన తర్వాత బైక్ సేల్ జరుగుతుంది.

అయితే కస్టమర్లు తమ బైక్‌లను ఆర్టీవోలో రిజిస్టర్ చేసుకోలేకపోతున్నారని ఫిర్యాదు చేయడానికి కంపెనీని సందర్శించిన తర్వాతనే ఈ విషయం వెలుగులోకి వచ్చిందంటే.. ఇందులో షోరూమ్‌లో పనిచేసే వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లుగా యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది. దీనిపై పోలీసులు విచారణ జరపాల్సి ఉంది.
ఇంత కాలం ఈ మోసం ఎలా సాగింది.. కస్టమర్లను అంత ఈజీగా ఎలా బురిటీ కొట్టించారో ఎవరికీ అంతుపట్టడం లేదు. కాగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులు మరో కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో తోటి ఉద్యోగుల ప్రమేయం కూడా ఉందా అనే యాంగిల్‌లో దర్యాప్తు చేస్తున్నారు.

కంపెనీ అందుకున్న బైక్‌ల ఇన్వెంటరీ, ఇన్‌వాయిస్ వివరాలతో పాటుగా అమ్మకాలు మరియు డెలివరీ నోట్‌లుగా ఒక నిర్దిష్ట ప్రోటోకాల్ ఆఫ్‌సేల్‌ను అనుసరించి.. వీటిని RTOకి పంపాల్సి ఉంటుంది. ఇన్‌వాయిస్‌లను ధృవీకరించేందుకు పోలీసులు విచారణ చేస్తున్నారు. మరి ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందో విచారణలో తేలనుంది.


Click it and Unblock the Notifications








