ఈ20 పెట్రోల్‌తో బండి ఇంజిన్ ఖరాబైతే ఇన్సూరెన్స్ వస్తుందా రాదా?.. కంపెనీల క్లారిటీ
భారతదేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి, ముడిచమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాడకాన్ని బాగా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఈ20 (20 శాతం ఎథనాల్, 80 శాతం పెట్రోల్) ఇంధనం అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఎథనాల్ పెట్రోల్ వాడటం వల్ల ముఖ్యంగా పాత కార్లు, బైకులు, స్కూటర్ల మైలేజ్ తగ్గిపోతోందని, ఇంజిన్లు కూడా త్వరగా పాడవుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఎథనాల్ పెట్రోల్ వాడి ఇంజిన్ పాడైతే ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ ఇవ్వవనే ప్రచారం సాగడంతో కస్టమర్లలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
బీమా కంపెనీల కీలక క్లారిటీ
ఈ గందరగోళానికి తెరదించుతూ ప్రముఖ బీమా సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ (ICICI Lombard) ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. వాహనాలలో ఈ20 లేదా అంతకంటే ఎక్కువ ఎథనాల్ కలిపిన ఇంధనాన్ని ఉపయోగించినంత మాత్రాన మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు కాన్సిల్ కాబోవని స్పష్టం చేసింది. బండి ఎంత పాతదైనా సరే, అందులో ఎథనాల్ పెట్రోల్ కొట్టించడాన్ని ఓనర్ నిర్లక్ష్యంగా బీమా కంపెనీలు భావించవని తేల్చి చెప్పింది. ఈ20 ఇంధనాన్ని వాడినా సరే కస్టమర్ల మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎప్పటిలాగే పూర్తిగా చెల్లుబాటు అవుతాయని పెద్ద ఊరటనిచ్చింది.

ఇన్సూరెన్స్ పరిధిలోకి రాని మెకానికల్ సమస్యలు
ఇదే సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీలు మరో ముఖ్యమైన సాంకేతిక విషయాన్ని కూడా వాహనదారులకు వివరించాయి. సాధారణంగా మనం ఎలాంటి ఇంధనం (సాధారణ పెట్రోల్ లేదా ఎథనాల్ పెట్రోల్) వాడినప్పటికీ.. బండిలో వచ్చే మెకానికల్ లోపాలు, ఇంజిన్ అరకట్టడం లేదా సాధారణ మెయింటెనెన్స్, వేర్ అండ్ టేర్ (సహజమైన అరుగుదల) వంటి రిపేర్లు స్టాండర్డ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీల కింద కవర్ కావు. మోటార్ ఇన్సూరెన్స్ అనేది ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, ప్రకృతి వైపరీత్యాలు, పర్సనల్ యాక్సిడెంట్ కవర్, థర్డ్-పార్టీ నష్టాలను భర్తీ చేయడానికి మాత్రమే డిజైన్ చేయబడింది. కాబట్టి కేవలం ఇంధనం కారణంగా క్లెయిమ్స్ తిరస్కరణకు గురికావని కంపెనీ స్పష్టం చేసింది.
ఎథనాల్ బ్లెండింగ్‌లో సరికొత్త మైలురాళ్లు
ప్రస్తుతం మన దేశంలో ఈ20 ఇంధనం అన్ని పెట్రోల్ బంకులలో తప్పనిసరిగా లభిస్తోంది. అయితే ప్రభుత్వం ఇక్కడితోనే ఆగడం లేదు. భవిష్యత్తులో ఈ22, ఈ25, ఈ27, ఈ30 (అంటే 22 శాతం నుంచి 30 శాతం వరకు ఎథనాల్ కలిపిన పెట్రోల్) వంటి మరిన్ని వేరియంట్లను తీసుకురావడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవన్నీ ఇంకా మార్కెట్లోకి విక్రయానికి రావలసి ఉంది. కాగా, ఏకంగా 85 శాతం ఎథనాల్ ఉండే ఈ85 ఇంధనాన్ని కేంద్ర ఇంధన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల ఢిల్లీలో అధికారికంగా ప్రారంభించారు. ప్రారంభంలో దేశవ్యాప్తంగా 50 బంకులలో ఈ సరికొత్త ఇంధనం అందుబాటులోకి రానుంది.

ధర తక్కువ.. కానీ మైలేజ్ టెన్షన్ ఎక్కువ
ప్రభుత్వ లెక్కల ప్రకారం దిల్లీలో సాధారణ ఈ20 పెట్రోల్ ధర లీటరుకు రూ.102.12 పైసలుగా ఉంటే.. కొత్తగా వచ్చిన ఈ85 ఫ్లెక్స్ ఇంధనం ధర దానికంటే 20 రూపాయలు తక్కువగా.. అంటే లీటరుకు రూ.82.12 పైసలకే లభిస్తోంది. ధర పరంగా ఇది చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. మైలేజ్ విషయంలో కస్టమర్ల నుంచి ప్రతికూల రివ్యూలు వస్తున్నాయి. లోకల్ సర్కిల్స్ చేసిన ఒక తాజా సర్వే ప్రకారం ఎథనాల్ ఇంధనం వాడుతున్న వాహనాలలో మైలేజ్ దాదాపు 20 శాతం వరకు పడిపోయిందని సగానికి పైగా వాహనదారులు వాపోతున్నారు. అలాగే పాత బండ్లలో కార్బోరేటర్, ఫ్యూయల్ లైన్లు, ట్యాంకులు పాడవుతున్నాయని చెప్తున్నారు.
కంపెనీల సన్నద్ధత.. భవిష్యత్తు ఇంధనం
ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న పాత వాహనాలలో కేవలం 3 శాతం మాత్రమే ఎథనాల్ ఇంధనానికి అనుకూలంగా ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఈ సమస్యను అధిగమించడానికి ఆటోమొబైల్ కంపెనీలు కూడా వేగంగా అడుగులు వేస్తున్నాయి. హీరో మోటోకార్ప్, మారుతి సుజుకి వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే ఈ85 ఇంధనంతో నడిచే సరికొత్త మోటార్ సైకిళ్లు, వ్యాగన్ఆర్ వంటి హ్యాచ్‌బ్యాక్ కార్ల ఫ్లెక్స్-ఫ్యూయల్ వేరియంట్లను మార్కెట్లోకి పరిచయం చేశాయి. ప్రభుత్వం కూడా హైబ్రిడ్, ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల వాడకాన్ని పెంచడానికి భారీ రాయితీలను ఇవ్వడంపై ఆలోచిస్తోంది.


Click it and Unblock the Notifications