తెలంగాణాలో ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఎంత? ఈవీలపై సబ్సిడీ వివరాలు
ప్రస్తుతం భారతదేశంలోని మొత్తం వాహన విక్రయాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా కేవలం 1.3 శాతంగా మాత్రమే. గడచిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1.86 కోట్ల పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలకు గాను కేవలం 2.38 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఐదు సంవత్సరాలుగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ మరియు ప్రోత్సాహం కోసం కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ, భారతదేశ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పర్యావరణ వ్యవస్థ మాత్రం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.

ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల్లో అవగాహన లేకపోవడం, ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేకపోవడం వంటి పలు కారణాలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేవారిని పునరాలోచించేలా చేస్తున్నాయి. అయితే, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈవీ తయారీదారులతో పాటు కొనుగోలుదారులను కూడా ప్రోత్సాహించేందుకు వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రోత్సాహకాలు/సబ్సిడీలు అందజేయడంతో పరిస్థితి మెరుగుపడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం, దేశంలో 13 కంటే ఎక్కువ రాష్ట్రాలు ఎలక్ట్రిక్ వాహనాలపై తమ విధానాలను వెల్లడించాయి.

ఎలక్ట్రిక్ వాహన విధాన (EV Policy)ని నోటిఫై చేసిన 13 రాష్ట్రాల్లో ఢిల్లీ, మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాలు బలమైన కొనుగోలు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. భారత ప్రభుత్వం యొక్క FAME II (ఫేమ్ 2) ప్రోత్సాహకాలలో ఈ రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉండటంతో, ఆయా రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాల ముందస్తు ధర కూడా 50 నుండి 65 శాతం వరకు తగ్గించబడింది మరియు ధర పరంగా వీటిని సాంప్రదాయ పెట్రోల్-డీజిల్ ఇంజన్ వాహనాలతో సమానంగా తీసుకురాగలిగారు. ఈ కథనంలో ఎలక్ట్రిక్ వాహనాలపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలు ఎలా ఉన్నాయి, అవి తయారీదారులను మరియు కొనుగోలుదారులను ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం రండి.

మహారాష్ట్ర ఈవీ పాలసీ
భారతదేశపు వాణిజ్య రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ వినియోగదారులకు మరియు తయారీదారులకు అత్యంత అనుకూలమైనది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయడం చాలా చౌకగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రం అన్ని ఎలక్ట్రిక్ వాహన వర్గాలకు ప్రతి కిలోవాట్ కు రూ. 5000 చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. మహారాష్ట్రలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై గరిష్టంగా రూ. 10,000, ఎలక్ట్రిక్ త్రీవీలర్లపై రూ. 30,000, ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లపై రూ. 1,50,000 మరియు ఎలక్ట్రిక్ బస్సులపై రూ. 20 లక్షలు సబ్సిడీని అందిస్తోంది.

ఉదాహరణకు మీరు మహారాష్ట్రలో ఓ 3 kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేస్తున్నట్లయితే, మీరు గరిష్టంగా రూ. 10,000 సబ్సిడీని పొందవచ్చు. అంతేకాదు, మీరు మీ పాత పెట్రోల్ ద్విచక్ర వాహనాన్ని స్క్రాప్ చేస్తే, మీ కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 7,000 వరకు అదనపు సబ్సిడీని కూడా ఇస్తుంది. పైన పేర్కొన్న ఆర్థిక ప్రోత్సాహకాలతో పాటు, కస్టమర్లకు 5 సంవత్సరాల బ్యాటరీ వారెంటీలను అందించడానికి ఆటోమొబైల్ కంపెనీలు కూడా సిద్ధంగా ఉన్నాయి.

గుజరాత్ ఈవీ పాలసీ
ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినిల్లు అయిన గుజరాత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలపై అత్యధికంగా ప్రతి కిలోవాట్ కి రూ. 10,000 సబ్సిడీని అందిస్తున్నారు. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలపై గరిష్టంగా రూ. 20,000, ఎలక్ట్రిక్ త్రీవీలర్లపై రూ. 50,000 మరియు ఎలక్ట్రిక్ కార్లపై రూ.1.5 లక్షలు సబ్సిడీని అందిస్తున్నారు. అంతేకాకుండా, ఈ రాష్ట్రం ఎలక్ట్రిక్ వాహనాలపై కొంత రిజిస్ట్రేషన్ రుసుమును కూడా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది, అయితే మహారాష్ట్ర ప్రభుత్వం వలె కాకుండా గుజరాత్ రాష్ట్రం ఎలక్ట్రిక్ వాహన ధరలో కేవలం 6 శాతం మాత్రం పన్నులను వసూలు చేస్తోంది.

ఛార్జింగ్ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం గరిష్టంగా రూ. 5 లక్షల సబ్సిడీ ఇస్తుండగా, గుజరాత్ ప్రభుత్వం గరిష్టంగా రూ. 10 లక్షల సబ్సిడీని ఇస్తోంది. రాబోయే సంవత్సరాల్లో మహారాష్ట్ర 7 నగరాల్లో 2,400 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని చూస్తోంది, అయితే గుజరాత్ దాదాపు 528 ఛార్జింగ్ స్టేషన్‌లను నిర్మించే పనిలో ఉంది.

ఢిల్లీ ఈవీ పాలసీ
దేశ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం 2020లో ప్రారంభించిన ఈవీ పాలసీలో స్వల్ప మార్పులు చేసే ప్రక్రియలో ఉంది. ఇది కర్నాటక మాదిరిగానే ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ స్కీమ్ కోసం మార్గదర్శకాన్ని కలిగి ఉంటుంది. మూడు సంవత్సరాల రోడ్‌మ్యాప్‌తో ఢిల్లీ ఈవీ పాలసీ ఆగస్టు 2020లో ప్రారంభించబడింది. ఢిల్లీ ప్రభుత్వం యొక్క ఈవీ పాలసీ దేశంలోనే అత్యంత సమగ్రమైన ఈవీ పాలసీలలో ఒకటిగా ఉంటుంది.

ఈ పాలసీ ప్రకారం, ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ప్రతి కిలో వాట్ కు రూ. 5,000 చొప్పున సబ్సిడీని అందిస్తుంది మరియు దీని గరిష్ట పరిమితి రూ. 30,000 వరకూ ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలోని అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు 2-3 kWh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి, అంటే మీరు పొందగలిగే గరిష్ట సబ్సిడీ దాదాపు రూ. 15,000 వరకూ ఉంటుంది. అలాగే, ఎలక్ట్రిక్ త్రీవీలర్లపై రూ. 30,000 వరకు మరియు ఎలక్ట్రిక్ కార్లపై రూ. 1.5 లక్షల వరకు సబ్సిడీని అందిస్తుంది. పాత వాహనాలను స్క్రాప్ చేసిన వారికి అదనపు సబ్సిడీ కూడా ఇవ్వబడుతుంది.

కర్ణాటక ఈవీ పాలసీ
ఒకవేళ, మీరు కర్నాటకలో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేస్తున్నట్లయితే, మీరు కేంద్ర ప్రభుత్వం యొక్క FAME-II పథకం కింద సబ్సిడీకి అర్హులు, ఇది ప్రతి కిలోవాట్ కి రూ.15000 వరకూ ఉంటుంది, కానీ కర్ణాటక ప్రభుత్వం, గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఢిల్లీ ప్రభుత్వాలు అందించే సబ్సిడీలను అందించదు. కర్నాటక ప్రభుత్వం ఇటీవలే ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ పథకాన్ని ప్రారంభించింది, ఇది రాపిడో, ఓలా, ఊబర్ వంటి అగ్రిగేటర్లు ఇ-బైక్ టాక్సీ ఆపరేటర్లుగా నమోదు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

ఈ టాక్సీలు 10 కి.మీల పాటు నడపడానికి అనుమతించబడతాయి మరియు ఇది లాస్ట్ మైల్ మొబిలిటీ సెగ్మెంట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి సపోర్ట్ ఇవ్వవచ్చని భావిస్తున్నారు. 2017లో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం కర్ణాటక కావడం విశేషం. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో పెట్టుబడిదారులకు 15 శాతం మూలధన రాయితీని ఇవ్వడానికి రాష్ట్రం ఇటీవల తన విధానాన్ని మార్చింది. వచ్చే 2-3 ఏళ్లలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయాలని కర్ణాటక నిర్ణయించింది.

తెలంగాణ ఈవీ పాలసీ
ఇక మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణా విషయానికి వస్తే, తెలంగాణ తన ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని 2020లో ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్డు పన్ను మరియు రిజిస్ట్రేషన్ నుండి 100 శాతం మినహాయింపును అందిస్తుంది, కానీ ప్రస్తుతం మహారాష్ట్ర, ఢిల్లీ మరియు గుజరాత్ అందించే సబ్సిడీలను మాత్రం తెలంగాణా అందించడం లేదు.

అయితే, రాష్ట్రం రూ. 30 కోట్ల వరకు మూలధన పెట్టుబడి రాయితీ, సంవత్సరానికి రూ. 5 కోట్ల వరకు SGST రీయింబర్స్‌మెంట్, రూ. 5 కోట్ల వరకు విద్యుత్ సుంకం మినహాయింపు మరియు రూ. 5 కోట్ల వరకు వడ్డీ రాయితీ వంటి కొన్ని బలమైన సరఫరా వైపు ప్రోత్సాహకాలను అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వ అధికారులు ప్రస్తుతం పునర్నిర్మించిన FAME పథకం మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేస్తున్నారు మరియు 2020లో ప్రవేశపెట్టిన వారి విధానంలో కొన్ని మార్పులను ప్రకటించవచ్చు.

ఒడిషా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ
చివరిగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) కొనుగోలుపై ఒడిశా ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను పరిశీలిస్తే, ఈ రాష్ట్రం ఈవీలపై 15 శాతం వరకూ సబ్సిడీని ప్రకటించింది. ద్విచక్ర వాహనాలకు వాహన ధరలో 15 శాతం సబ్సిడీ, గరిష్టంగా రూ.5,000, త్రీ వీలర్లకు రూ.10,000, నాలుగు చక్రాల వాహనాలకు రూ.50,000 సబ్సిడీ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకం డిసెంబర్ 31, 2025 వరకు అందుబాటులో ఉంటుందని ఒడిషా తెలిపింది.


Click it and Unblock the Notifications








