World EV Day: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు అల్టర్నేటివ్.. ఈవీలే సొల్యూషన్! భారత్‌లో దూకుడు
ఈ రోజు ప్రత్యేకమైన రోజు, ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల దినోత్సవం. ఈ రోజున ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యం, వాటి వల్ల సమాజానికి, పర్యావరణానికి కలిగే ప్రయోజనాలను గుర్తు చేసుకోవడం చాలా అవసరం. ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయడం అనేది కేవలం ఒక కొత్త టెక్నాలజీని ఆహ్వానించడం మాత్రమే కాదు, అది ప్రకృతికి మరింత దగ్గరగా వెళ్లే ప్రయాణం కూడా. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు దేశ రవాణా రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, పెట్రోల్-డీజిల్ వనరులపై ఆధారపడడం వల్ల కలిగే సమస్యలు, వాయు కాలుష్యం పెరుగుతుండడంతో చాలా మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టి మళ్లించారు. ఫలితంగా, ఇప్పుడు నగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
ఈ వాహనాల నుంచి ఎలాంటి ఉద్గారాలు విడుదల కాకపోవడంతో, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీంతో గాలి నాణ్యత మెరుగుపడటమే కాకుండా, వాతావరణ మార్పులను నియంత్రించే లక్ష్యానికి కూడా దోహదం అవుతోంది. భారతదేశం 2070 నాటికి నికర-జీరో ఉద్గారాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో, ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తోంది.

ముఖ్యంగా FAME II , PLI పథకం ఉన్నాయి. వీటి ద్వారా దేశంలోనే బ్యాటరీ ఉత్పత్తిని పెంచి, వాహనాల ధరలను తగ్గించడం, అంతేకాకుండా దేశీయ తయారీని ప్రోత్సహించడం లక్ష్యం. ప్రారంభంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఛార్జింగ్ స్టేషన్ల కొరత. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. నగరాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో, ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా మారుతున్నాయి.
పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా నిలవడమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడు దేశ భవిష్యత్తు రవాణా రంగానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా మారుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం పెరుగుతున్న ఈ సమయంలో, స్వచ్ఛమైన శక్తి వనరులపై ఆధారపడటం అత్యవసరం అయింది. ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, రాబోయే పదేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య భారీ స్థాయిలో పెరగనుంది.

అంతర్గత దహన ఇంజిన్ (ICE) వాహనాలకు సవాలు విసురుతూ, వీటికి ప్రత్యామ్నాయంగా EVలు మార్కెట్‌లో మరింత బలమైన స్థానం సంపాదించనున్నాయి. ధర పరంగా కూడా ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు, రూ.10 లక్షల లోపు బడ్జెట్ సెగ్మెంట్‌లో MG కామెట్ EV, టాటా టియాగో EV వంటి చిన్న కానీ స్మార్ట్ మోడళ్లు వినియోగదారులకు మంచి ఎంపికలుగా మారాయి.
మరోవైపు, సుమారు రూ.30 లక్షల వరకు ఖరీదు చేసే మహీంద్రా XEV 9e వంటి ప్రీమియం మోడళ్లు ఉన్నత సాంకేతికత, అధునాతన ఫీచర్లతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో, చిన్న బడ్జెట్ ఫ్యామిలీ నుంచి ప్రీమియం కార్లను కోరుకునే కస్టమర్ల వరకు, అన్ని వర్గాలకు సరిపోయేలా ఎలక్ట్రిక్ వాహనాలు లభిస్తున్నాయి. ఈ పరిణామం ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు, దేశ రవాణా రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు బాటలు వేస్తోంది.

రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ మరింత వేగంగా విస్తరించబోతోందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఈవీలపై ఉన్న ప్రధాన అడ్డంకి ధర, ఛార్జింగ్ సౌకర్యాల లేమి. ఎలక్ట్రిక్ వాహనాల వాడకంలో ప్రధాన సమస్యగా నిలిచిన ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఛార్జింగ్ స్టేషన్లు విస్తరించడం వినియోగదారుల నమ్మకాన్ని పెంచుతోంది. ఫాస్ట్-చార్జింగ్ సాంకేతికతలు కూడా డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








