చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా.. నెట్టింట వైరల్ అవుతున్న ఏనుగు సవారీ వీడియో!
ఈ ఫొటో చూడగానే మీకు తప్పకుండా కూలీ నెంబర్ వన్ చిత్రంలోని పాపులర్ గణేష్ సాంగ్ గుర్తుకువస్తుంది. అందులో.. "చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదరా, పాపం కొండంత నీ పెనుభారం" అనే చరణం ఉంటుంది, ఇది ఈ ఫొటోకి చక్కగా సూట్ అవుతుంది.
Recommended Video
చిన్న కార్ట్‌లో ప్రయాణిస్తున్న పెద్ద ఏనుగు వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

సాధారణంగా, ఇతర దేశాలలో జంతువులను తరలించడానికి ప్రత్యేకమైన వాహనాలను ఉపయోగిస్తుంటారు. అందులోనూ ఏనుగు వంటి పెద్ద జంతువులను తరలించాలంటే, వాటి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన భారీ ట్రక్కులను ఉపయోగిస్తారు. కానీ, మనదేశంలో అలా కాదు, ఏనుగు బరువును మోయగలగాలే కానీ, సైకిల్ రిక్షాపై కూడా దానిని ఎక్కుంచుకొని తీసుగెళ్లరు. అలాంటి సంఘటనే ఈ వీడియోలో చూడొచ్చు.

ఏనుగును ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సురక్షితంగా వాహనంలో తరలించాలంటే, అంతే భారీ వాహనం అవసరం. కానీ, మీరు ఈ వీడియోని గమనించినట్లయితే, ఇందులో టాటా ఏస్ లాంటి ఓ మినీ ట్రక్కుకు వెనుకవైపు కట్టిన ఓ నాలుగు చక్రాల ట్రాలీలో భారీ ఏనుగును తరలిస్తున్నారు. అదే ట్రాలీలో ఏనుగు కాళ్ల మధ్యలో ఓ మావటి కూడా కూర్చొని ఉన్నాడు. ఈ ఏనుగు సవారీని ఓ నెటిజన్ వీడియో తీసి, ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు, దీంపో ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

మీమర్లు ఈ వీడియోతో వివిధ రకాల మీమ్స్ కూడా చేస్తున్నారు. కొందరు డ్రైవర్, మావటి ధైర్యాలను మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం ఏంటీ పిచ్చి పని అంటూ తిట్టిపోస్తున్నారు. రోడ్లపై వాహనాలను జాగ్రత్తగా నడపాలని ప్రభుత్వాలు ప్రజలకు ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ, ఇలాంటి అసురక్షితమైన రవాణా విధానాలతో వారు మాత్రం ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ఇలాంటి నిర్లక్ష్యం వలన తమను తాము ప్రమాదంలో పడవేసుకోవడమే కాకుండా రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా హానికారకంగా మారుతున్నారు.

ఈ వీడియోలో, ఏనుగును మినీ ట్రక్కుకు జోడించిన ట్రాలీపైకి తీసుకెళ్లడం చూడవచ్చు. ఈ ట్రాలీపై ఏనుగు పాదాలను కట్టి ఉంచినట్లుగా కనిపిస్తోంది. అంతేకాకుండా, సదరు మినీ ట్రక్కు చాలా వేగంతో కూడా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వేగానికి ట్రాలీ మరియు ట్రాలీపై ఉన్న ఏనుగు రెండూ కుదుపులకు గురవడాన్ని కూడా ఈ వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతానికి, ఈ వీడియో ఎక్కడిది మరియు ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తూ రోడ్డుపైకి వచ్చిన సదరు డ్రైవర్‌పై పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారా అనే విషయాలు ఇంకా తెలియరాలేదు.

ఏదేమైనప్పటికీ, ఈ విషయంలో సదరు డ్రైవర్ మరియు ఆ ఏనుగు యొక్క మావటి ఇద్దరూ పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నారని మాత్రం చెప్పవచ్చు. దురదృష్టవశాత్తూ ఈ చిన్నపొరపాటు జరిగినా, ఆ అమాయకపు ఏనుగు ప్రాణాలు చిక్కుల్లో పడేవి. సాధారణంగా, ఏనుగులు 2.5 టన్నుల నుండి 7 టన్నుల వరకూ బరువును కలిగి ఉంటాయి. కొన్ని అరుదైన ఏనుగులు మాత్రం, సుమారు 12 టన్నుల వరకూ బరువుంటాయి. ఈ వీడియోలో కనిపించే ఏనుగు దాదాపు 3-4 టన్నుల బరువును కలిగి ఉండే అవకాశం ఉంది.

అంతటి భారీ బరువున్న ఏనుగును కేవలం 2 టన్నుల పేలోడ్ సామర్థ్యం కలిగిన ఇలాంటి మినీ ట్రక్కు సాయంతో తరలించడం చట్టరీత్యా నేరం. అలాగే, ఎలాంటి రక్షణ లేకుండా ఏనుగును తరలించడం మరొక నేరం. అంతేకాకుండా, వాహనాలకు అనుమతి లేకుండా టోయింగ్ కోసం ఉపయోగించడం మరొక నేరం. ఇన్ని నేరాలకు పాల్పడిన సదరు డ్రైవర్, పోలీసులకు దొరికితే అతనిపై జరిమానాల వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ వీడియో చూసిన తర్వాతనైనా ఇతరులలో మార్పు వస్తే బాగుండనేది మా అభిప్రాయం.

భారత మార్కెట్లో టాటా మోటార్స్ విక్రయిస్తున్న టాటా ఏస్ ఎల్‌సివి (లైట్ కమర్షియల్ వెహికల్) 'చిన్న ఏనుగు' (చోటా హాథీ) గా ప్రమోట్ చేస్తుంటారు. దీంతో, ఇప్పుడు ఆ చిన్న ఏనుగుపై ఈ పెద్ద ఏనుగు వెళ్తోందని మీమర్స్ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
గమనించాల్సిన విషయం ఏంటంటే, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా భారతదేశపు రోడ్లు రక్తమోడుతున్నాయి. ఈ రకమైన డ్రైవింగ్ ప్రవర్తన కారణంగా, భారతీయ రోడ్లు ప్రపంచంలోనే అత్యంత సవాలుతో కూడినవి మరియు ప్రమాదకరమైనవిగా పరిగణించబడుతున్నాయి. భారతదేశంలో ప్రతి ఏటా సుమారు 3.5 లక్షల రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నాయి. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే, ఇలా నమోదు కానీ ప్రమాదాలు మరెన్నో. ఈ ప్రమాదాల్లో దాదాపు 1.5 లక్షల మంది చనిపోతున్నారని, సుమారు 60 శాతం రోడ్డు ప్రమాదాలు ఓవర్ స్పీడ్ కారణంగానే జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలు వెల్లడిస్తున్నాయి.

రోడ్డు ప్రమాదాలకు గల ఇతర ప్రధాన కారణాలలో ఓవర్‌లోడ్, రాంగ్ సైడ్‌లో డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనాలు నడపడం మొదలైనవి కూడా ఉన్నాయి. రవాణా మంత్రిత్వ శాఖ ప్రకారం, 2020 సంవత్సరంలో మొత్తం 1,20,806 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. ఈ ప్రమాదాల్లో ఎక్కువగా యువతే ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 36 శాతం జాతీయ రహదారులపై జరుగుతుండగా, 25 శాతం రాష్ట్ర రహదారులపై మరియు ఇతర రహదారులపై 39 శాతం ప్రమాదాలు జరిగాయని నివేదికలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications








