స్కూటర్ కొనాలంటే ఈ నెల 31లోపే కొనేయండి..ఇప్పుడే కొంటేనే వేలల్లో లాభం.. లేకుంటే జేబు ఖాళీ ఖాయం
మీరు ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? అయితే మీకు ఇది డెడ్ లైన్ సమయం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై ఇస్తున్న భారీ సబ్సిడీ గడువు ముగియడానికి కేవలం మరి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. మార్చి 31, 2026 తర్వాత ఈ సబ్సిడీలో భారీ మార్పులు రానున్నాయి. దీనివల్ల ఎలక్ట్రిక్ టూ వీలర్ల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. ఈ లోపే కారు లేదా బైక్ ఇంటికి తెచ్చుకుంటే మీకు వేల రూపాయల లాభం కలుగుతుంది. ప్రస్తుత ఆఫర్లు, సబ్సిడీ వివరాలు, మార్కెట్ ట్రెండ్స్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం PM E-DRIVE(PM Electric Drive Revolution in Innovative Vehicle Enhancement) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం 2028 వరకు ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ టూ-వీలర్లు (e-2W), త్రీ-వీలర్లపై (e-3W) ఇచ్చే ఇన్సెంటివ్‌లు మాత్రం 31 మార్చి 2026 వరకే అమల్లో ఉంటాయి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి kWh బ్యాటరీ సామర్థ్యంపై రూ.5,000 వరకు సబ్సిడీ ఇస్తోంది. అయితే, ఏప్రిల్ 1, 2026 నుంచి ఇది రూ.2,500కి పడిపోతుంది. అంటే, మీరు ఏప్రిల్‌లో స్కూటర్ కొంటే నేరుగా మీ జేబు నుంచి రూ.5,000 నుంచి రూ.10,000 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఈ మార్చి నెలాఖరు లోపు కొనుగోలు పూర్తి చేయడం తెలివైన పని.

టాప్ కంపెనీల బంపర్ డిస్కౌంట్లు:
సబ్సిడీ గడువు ముగుస్తుండటంతో, ఓలా, ఎథర్, టీవీఎస్ వంటి దిగ్గజ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి అదనపు డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి.
ఏథర్ ఎనర్జీ (Ather Energy): ఏథర్ తన పాపులర్ రిజ్తా, 450 సిరీస్‌లపై ఏకంగా రూ.20,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, క్రెడిట్ కార్డ్ ఆఫర్లు, అదనపు వారంటీ బెనిఫిట్స్ ఉన్నాయి.
ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric): దేశంలోనే నంబర్ వన్ ఈవీ కంపెనీ ఓలా, తన ఎస్1 సిరీస్ స్కూటర్లపై రూ.10,000 వరకు నేరుగా తగ్గింపు ఇస్తోంది.
టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube): నమ్మకానికి మారుపేరుగా ఉన్న ఐక్యూబ్ మోడళ్లపై కూడా ఎక్స్ఛేంజ్ బోనస్, లోన్లపై తక్కువ వడ్డీ రేట్లు అందుబాటులో ఉన్నాయి.

PM E-DRIVE పథకం ప్రత్యేకతలేంటి?
కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 10,900 కోట్లతో ఈ భారీ పథకాన్ని అమలు చేస్తోంది. దీని ముఖ్య ఉద్దేశ్యం భారతదేశాన్ని 2070 నాటికి నెట్-జీరో (కర్బన ఉద్గారాలు లేని దేశం)గా మార్చడం.
డైరెక్ట్ సబ్సిడీ: టూ-వీలర్లపై రూ. 10,000 వరకు, త్రీ-వీలర్లపై రూ.50,000 వరకు, ఎలక్ట్రిక్ బస్సులపై గరిష్టంగా రూ.35 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది.
ఈ-వోచర్ సిస్టమ్: గతంలో సబ్సిడీ రావడం ఆలస్యమయ్యేది, కానీ ఇప్పుడు డీలర్ల దగ్గరే ఆధార్ ఆధారిత ఈ-వోచర్‌ను స్కాన్ చేసి వెంటనే తగ్గింపు పొందవచ్చు.
ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు: ప్రభుత్వ భవనాలు, రద్దీ ప్రాంతాల్లో వేల సంఖ్యలో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రూ.2,000 కోట్లు కేటాయించింది. దీనివల్ల రేపు మీ ఊర్లో కూడా ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వస్తాయి.

ఏ బైక్ ధర ఎంత?
మార్కెట్లో ప్రస్తుతం ఉన్న కొన్ని బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్ల ధరలు ఇలా ఉన్నాయి:
ఏథర్ రిజ్టా: రూ.75,999 నుంచి రూ.1.61 లక్షల వరకు.
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్: రూ.1.30 లక్షల నుంచి రూ.1.90 లక్షల వరకు.
టీవీఎస్ ఐక్యూబ్: రూ. 1.11 లక్షల నుంచి రూ.1.62 లక్షల వరకు.
రివోల్ట్ RV400: రూ.1.40 లక్షల నుండి ప్రారంభం.
ఈ ధరలు ఎక్స్-షోరూమ్ ధరలని గమనించాలి. మార్చి 31 దాటితే వీటిలో రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు పెరుగుదల ఉండే అవకాశం ఉంది.
కొనేముందు ఇవి గమనించండి
ఎలక్ట్రిక్ వాహనం కొనేటప్పుడు కేవలం సబ్సిడీ మాత్రమే కాదు, బ్యాటరీ వారంటీ, రేంజ్ (ఒకసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది?), మీ ఏరియాలో సర్వీస్ సెంటర్ ఉందో లేదో సరిచూసుకోవాలి. పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనం అనేది దీర్ఘకాలంలో మీకు లక్షల రూపాయల ఆదాయాన్ని మిగిలిస్తుంది.


Click it and Unblock the Notifications








