లోక్ అదాలత్‌లో చలాన్ కట్టినా ఆన్‌లైన్‌లో పెండింగ్? జరిమానా కనిపించకుండా ఉండాలంటే ఇలా చేయండి
మీ వాహనం మీద పడిన చలాన్‌ను లోక్ అదాలత్‌లో కట్టేసినా, ఆ జరిమానా ఇప్పటికీ ఆన్‌లైన్ ట్రాఫిక్ వెబ్‌సైట్ లేదా ఈ-చలాన్ పోర్టల్‌లో పెండింగ్‌లో కనిపిస్తుంటే ఆందోళన చెందాల్సిన పనిలేదు. డేటా అప్‌డేట్ కావడంలో ఆలస్యం లేదా టెక్నికల్ సమస్యల కారణంగా ఇలా జరగడం సహజం. అయితే చలాన్ కట్టిన తర్వాత కూడా అది ఆన్‌లైన్‌లో కనిపిస్తే, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండటానికి వెంటనే కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రికార్డును సరిదిద్దడానికి, సమస్యను పరిష్కరించుకోవడానికి తీసుకోవాల్సిన ఈజీ చర్యలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.
పేమెంట్ రశీదు భద్రపరుచుకోండి
లోక్ అదాలత్‌లో చలాన్ కట్టిన తర్వాత మీరు చేయాల్సిన మొదటి ముఖ్యమైన పని, పేమెంట్ రశీదు భద్రంగా ఉంచుకోవడం. మీరు లోక్ అదాలత్‌లో చలాన్ కట్టినప్పుడు, వారు తప్పనిసరిగా మీకు రసీదు లేదా పేమెంట్ చేసినట్లు ఓ స్లిప్ ఇస్తారు. ఆన్‌లైన్‌లో అప్‌డేట్ కాకపోయినా, మీరు చలాన్ కట్టారనడానికి ఈ రశీదే అతి ముఖ్యమైన రుజువు.

సాధారణంగా లోక్ అదాలత్‌లో పేమెంట్ చేసిన తర్వాత, ఆన్‌లైన్ సిస్టమ్‌లలో చలాన్ వివరాలు అప్‌డేట్ కావడానికి 30 రోజుల వరకు సమయం పట్టవచ్చు. కాబట్టి, కొన్ని రోజులు వేచి చూడటం మంచిది.
ట్రాఫిక్ పోలీసులు లేదా ఆర్టీఓ ఆఫీసును సంప్రదించండి
కొన్ని రోజుల తర్వాత కూడా చలాన్ ఆన్‌లైన్‌లో కనిపిస్తుంటే, మీ స్థానిక అధికారులను సంప్రదించడం ద్వారా సమస్యను త్వరగా పరిష్కరించుకోవచ్చు. మీ ప్రాంతంలోని ట్రాఫిక్ పోలీసు ఆఫీసు లేదా ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లి, మీ పేమెంట్ రశీదును అధికారులకు చూపించండి.

అధికారులు మీ రసీదును పరిశీలించి, చలాన్ నంబర్ లేదా వాహనం నంబర్‌ను అడిగి, రికార్డులను పరిశీలిస్తారు. వారు స్వయంగా సిస్టమ్‌లో చలాన్‌ను క్లోజ్ చేసి, మాన్యువల్‌గా అప్‌డేట్ చేస్తారు. ఒకవేళ నేరుగా వెళ్లడం కుదరకపోతే, సంబంధిత విభాగం హెల్ప్‌లైన్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీకి మీ రశీదు స్కాన్ చేసిన కాపీని పంపి కూడా ఫిర్యాదు చేయవచ్చు.
ఈ-చలాన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి
మీరు ఈ-చలాన్ పోర్టల్‌లో మీ చలాన్‌ను చూసినట్లయితే, అదే వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఈ-చలాన్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న గ్రీవెన్స్ లేదా కంప్లైంట్ సెక్షన్కి వెళ్లండి. అక్కడ వాహనం నంబర్, చలాన్ నంబర్, చెల్లింపు రసీదుకు సంబంధించిన వివరాలు పూర్తి చేసి, రసీదు యొక్క స్కాన్ చేసిన కాపీ లేదా ఫోటోను అప్‌లోడ్ చేయండి. సాధారణంగా ఈ-చలాన్ పోర్టల్ ద్వారా నమోదు చేసిన ఫిర్యాదులు 7 నుంచి 10 పని దినాలలో పరిష్కారమవుతాయి.

లోక్ అదాలత్ నుంచి సర్టిఫికెట్ తీసుకోండి
పైన తెలిపిన చర్యలు తీసుకున్నా కూడా సమస్య పరిష్కారం కాకపోతే, లోక్ అదాలత్ నుంచి అధికారిక ధృవీకరణ పత్రాన్ని పొందాలి. మీరు ఏ లోక్ అదాలత్‌లో చలాన్ చెల్లించారో అక్కడి నుంచి పేమెంట్ సర్టిఫికెట్ జారీ చేయించుకోవాలి. ఈ పత్రం చలాన్ చట్టబద్ధంగా మూసివేయబడిందని ధృవీకరిస్తుంది. ఈ పేమెంట్ సర్టిఫికెట్ ట్రాఫిక్ విభాగంలో సమర్పించడం ద్వారా మీ చలాన్ రికార్డు పర్మనెంటుగా అప్‌డేట్ అవుతుంది.


Click it and Unblock the Notifications