టెస్లాను కాదన్నాడు.. సొంతంగా కంపెనీ పెట్టాడు.. ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్నాడు..
అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా సంస్థలో ఎవరైనా జాబ్ వస్తే వద్దనుకుంటారా? లక్షల రూపాయాల్లో జీతం, అనేక సౌకర్యాలు మరియు సదుపాయాలు వదులుకొని, స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయుల కోసం కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచించాడు మన హైదరాబాద్ టెకీ శ్రీనివాస్. టెస్లా నుండి నిష్క్రమించిన రాణి శ్రీనివాస్ ఈ రోజు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో దేశాన్ని అభివృద్ధి చేస్తున్న భారతదేశంలోని స్టార్టప్ కంపెనీలకు ఒక ఉదాహరణగా నిలుస్తున్నాడు.

శ్రీనివాస్ టెస్లా యొక్క సీనియర్ IT మేనేజర్ హోదాలో పనిచేసి, 2017లో భారతదేశానికి వచ్చేశారు. ఆ తర్వాత అతను సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ మరియు సిఎన్‌జి ఇంధనాలతో నడిచే ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చడానికి కన్వర్షన్ కిట్‌లను అభివృద్ధి చేసే స్టార్టప్ కంపెనీని ప్రారంభించాడు. జీరో 21 పేరుతో అతను ఈ కంపెనీని మొదలు పెట్టాడు. మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

భారతదేశంలో నానాటికి పెరుగుతున్న కాలుష్యం నుండి పుట్టుకొచ్చిన ఆలోచనే ఈ జీరో 21
హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ (49) తన 26 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 20 దేశాల్లో పనిచేశాడు. గడచిన 2014లో, అతను USA లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ కంపెనీ అయిన టెస్లాలో IT మేనేజర్‌గా నియమితుడయ్యాడు. అయితే, టెస్లాలో మూడేళ్లపాటు పనిచేసిన తర్వాత, భారతదేశంలో సంప్రదాయ వాహనాల వల్ల పెరుగుతున్న కాలుష్యం గురించి ఆందోళన చెందాడు, ఆ తర్వాత అతను ఈ సమస్యను అధిగమించడానికి భారతదేశానికి వచ్చి ఓ స్టార్టప్ ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు.

ఆ తర్వాత భారతదేశానికి చేరుకున్న శ్రీనివాస్ జీరో 21 రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ (Zero 21 Renewable Energy Solutions Private Limited)ని స్థాపించాడు. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, జీరో 21 పేరులో 21 అనే పదం '21వ శతాబ్దంలో గాలి మరియు శబ్ద కాలుష్యాన్ని పూర్తిగా సున్నా చేయటం' అని సూచిస్తుంది. శ్రీనివాస్ 2018 ప్రారంభంలో, తన స్టార్టప్ యొక్క మొదటి ఉత్పత్తి స్మార్ట్ త్రీ-వీలర్ ఎలక్ట్రిక్ కార్గోపై పని చేయడం ప్రారంభించాడు. ఈ ఎలక్ట్రిక్ కార్గో బ్యాటరీని మార్చకుండా 10 సంవత్సరాల పాటు ఉంటుందని శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఈ ఎలక్ట్రిక్ కార్గో వాహనం 350-400 కిలోల బరువును మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలిపారు. ఈ కార్గో 160 Ah లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. ఇది పూర్తి ఛార్జింగ్‌తో 120-130 కిమీల పరిధిని అందిస్తుంది మరియు గరిష్టంగా గంటకు 30 కిలోమీటర్ల వేగంతో పరులుగు తీస్తుంది. లాస్ట్ మైల్ డెలివరీ విభాగంలో దీన్ని తీసుకురావచ్చని కంపెనీ చెబుతోంది.

జీరో21 ఎలక్ట్రిక్ కార్గో కస్టమర్లలో వంట గ్యాస్, వాటర్ క్యాన్‌లు అందించే కంపెనీలు మరియు లాస్ట్ మైల్ డెలివరీని అందించే ఈ-కామర్స్ కంపెనీలు కూడా ఉన్నాయని శ్రీనివాస్ చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న త్రీవీలర్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలను కూడా కంపెనీ విక్రయిస్తోంది.

సాధారణ ఆటోరిక్షా కేవలం 3 గంటల్లో ఎలక్ట్రిక్ ఆటోరిక్షాగా మారుతుంది
డీజిల్ కార్గో మరియు ప్యాసింజర్ ఆటోలను కూడా కంపెనీ ఎలక్ట్రిక్‌గా మారుస్తుంది. దీని కోసం, కంపెనీ తన పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ నుండి ఎలక్ట్రిక్ రెట్రోఫిటింగ్ కిట్‌ను అభివృద్ధి చేసింది, ఇది కేవలం 3-4 గంటల్లో సాధారణ ఆటోను ఎలక్ట్రిక్‌గా మార్చగలదు. ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రిక్ రెట్రోఫిట్టింగ్ కిట్‌లను చట్టబద్ధం చేసిన తర్వాత, కంపెనీ భారతదేశంలో సర్టిఫైడ్ రెట్రోఫిట్టింగ్ కంపెనీగా నమోదు చేయబడింది.

జీరో 21 కి చెందిన రాణి శ్రీనివాస్ ఎలక్ట్రిక్ రెట్రోఫిట్టింగ్ కిట్ దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ వేగాన్ని వేగవంతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కిట్‌లు పొదుపుగా ఉండటమే కాకుండా వాటితో పాటు కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసినట్లుగా సర్వీస్ వారెంటీని కూడా కంపెనీ ఇస్తుందని ఆయన చెప్పారు.

టెస్లా (Tesla) కంపెనీకి నో స్పెషల్ బెనిఫిట్స్..
ఇదిలా ఉంటే, భారత మార్కెట్లోకి ప్రవేశించాలని ఎంతగానో ఎదురుచూస్తున్న అమెరికన్ కార్ కంపెనీ టెస్లా (Tesla)కి మరోసారి భారత ప్రభుత్వం నుండి చుక్కెదురైంది. భారతదేశంలోకి దిగుమతి చేసుకునే కార్లపై పన్ను తగ్గించాలన్న టెస్లా డిమాండ్ చేస్తోంది. అయితే, ఈ ప్రతిపాదనను భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఇతర విదేశీ కంపెనీలకు వర్తించే పన్ను నిబంధనలే టెస్లాకు కూడా వర్తిస్తాయని, టెస్లాకు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు ఉండబోవని ప్రభుత్వం తెలిపింది.

ప్రస్తుతం, భారతదేశంలోకి దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ కార్లపై ప్రభుత్వం 60 నుంచి 100 శాతం వరకూ దిగుమతి సుంకాలను వసూలు చేస్తోంది. అయితే, ఈ సుంకాన్ని 40 శాతానికి తగ్గించాలని టెస్లా డిమాండ్ చేస్తోంది. కానీ, ప్రభుత్వ వాదన మాత్రం మరోలా ఉంది, టెస్లా భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తే, ఉత్పత్తి ప్రోత్సాహక పథకం (పిఎల్‌ఐ) కింద మంచి ప్రయోజనాలు అందించబడతాయని, ప్రస్తుతానికి దిగుమతి పన్నులను మాత్రం తగ్గించే యోచన లేదని తేల్చి చెప్పింది.


Click it and Unblock the Notifications