వెండితెరపై నితిన్ గడ్కరీ జీవిత చరిత్ర.. అతనే హీరో.. రిలీజ్ ఎప్పుడంటే.??
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జీవితం ఆధారంగా త్వరలో సినిమా విడుదల కానుంది. 'ఎక్స్‌ప్రెస్‌వే మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పిలుచుకునే గడ్కరీ బయోపిక్ ఈ నెల 27 న విడుదల కానుంది.
దేశంలో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకుల జీవితాల ఆధారంగా పలు చిత్రాలు తెరకెక్కాయి. దేశ అభివృద్ధిలో వారు ఎదుర్కొన్న ఒడుదొడుకులను ఆకట్టుకునే విధంగా దర్శకులు తెరకెక్కించారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, తమిళనాడు మాజీ సీఎం, దివంగత నాయకురాలు జయలలిత జీవితాల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ క్రమంలో దేశంలో ఎక్స్‌ప్రెస్‌వేల విస్తరణకు కృషి చేస్తున్న కేంద్ర రోడ్లు, రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27 న విడుదల కానుంది. గడ్కరీ బీజేపీ కార్యకర్త నుంచి ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో రవాణా శాఖ మంత్రి అయ్యే వరకు ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఒడుదొడుకులను ఈ సినిమాలో చిత్రీకరించారు.
కాగా ఈ సినిమా మరాఠీ భాషలో విడుదలవుతోంది. 'గడ్కరీ' పేరుతో విడుదలవుతున్న ఈ సినిమాలో నితిన్ గడ్కరీ పాత్రను నటుడు రాహుల్ చోప్డా పోషించారు. ఈ చిత్రానికి అనురాగ్ రంజన్ భూసారి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతగా అక్షయ్ అనంత్ దేశ్‌ముఖ్ వ్యవహరిస్తున్నారు. నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ఎంపీగా కొనసాగుతున్నారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిరంతర కృషి ఫలితంగా, గత జూన్ నెలలో, రహదారి నెట్‌వర్క్ విస్తరణలో భారత్ చైనాను అధిగమించి ప్రపంచంలో రెండవ స్థానంలో నిలవడం చరిత్రాత్మక విజయం. కాగా రోడ్ నెట్‌వర్క్ విస్తరణలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. దేశంలో ప్రస్తుతం 1.45 లక్షల కిలోమీటర్ల మేర రహదారులున్నాయి.
నితిన్ గడ్కరీ గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే రహదారుల విస్తరణకు సంబంధించి పెద్ద ప్రాజెక్టుల విషయంలో వాటిని ఎలా కిక్ స్టార్ట్ చేయాలో గడ్కరీకి బాగా తెలుసు. ప్రధాని మోదీ హయాంలో ఆయన ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేశారు. ప్రతిపక్షాల నుంచి సైతం ఆయనకు ఈ విషయంలో ప్రశంసలు దక్కాయనడంలో సందేహం లేదు.
భారత్‌లో తొమ్మిదేళ్ల క్రితం 91,287 కి.మీ మేర రహదారులు ఉండేవి. రోడ్లు, రవాణా శాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశవ్యాప్తంగా హైవేలను నిర్మించడానికి ఆయన పూనుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 2019 నుంచి జూన్ 2023 వరకు దాదాపు 30,000 కిలోమీటర్ల హైవేలు నిర్మించారు. వాటిలో బెంగళూరు- మైసూర్, మీరట్- ఢిల్లీ, ఘాజీపూర్- లక్నో ఎక్స్‌ప్రెస్‌వేలు ప్రధానమైన రహదారులుగా చెప్పవచ్చు.
ఇవే కాకుండా దేశంలో తొలి 8 లైన్ల ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే కూడా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ రహదారి ప్రత్యేకత ఏంటంటే.. దీని పొడవు 27.6 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ద్వారకలో మొదలుకుని హర్యానా గురుగ్రామ్‌లోని ఖేర్కి దౌలా టోల్ ప్లాజా వద్ద ఎండ్ అవుతుంది. ఈ రహదారి ద్వారా ఢిల్లీ, హర్యానా ప్రజలకు లబ్ధి చేకూరనుంది.


Click it and Unblock the Notifications








