TollPlaza Scam గుజరాత్‌లో ఘరానా మోసం.. నకిలీ టోల్‌గేట్‌తో కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు.. నివ్వెరబోయిన అధికారులు
ఆన్‌లైన్ మోసాలు, నకిలీ దందాలు, ఫేక్ ఫైనాన్స్ ఇలా చాలా రకాల మోసాల్ని చూసుంటాం. అమాయకుల దగ్గర్నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. కానీ ఇక్కడ ఓ గ్యాంగ్ మాత్రం ఏకంగా ప్రభుత్వాన్నే మోసం చేసింది. ఫేక్ టోల్ ప్లాజా(Fake Toll Plaza)తో ప్రభుత్వాన్నే బురిడీ కొట్టించారు ఈ ఘరానా దొంగలు...
గుజరాత్‌లో ఘరానా మోసం వెలుగు చూసింది. రోడ్డు మధ్యలో నకిలీ టోల్ ప్లాజా(Fake Toll Plaza In Gujarat) ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి కోట్ల రూపాయలు దండుకున్నారు. ఫేక్ టోల్ ప్లాజా ఏర్పాటు చేసిన ఏడాదిన్నర వరకూ దీనిని అధికారులు గుర్తించకపోవడం గమనార్హం. అసలు ఏ మాత్రం డౌట్ రాకుండా ఇంత పెద్ద మోసం ఎలా చేయగలిగారు. పూర్తి సమాచారం ఈ కథనంలో..

గుజరాత్‌లోని మోర్బీ, కచ్ జిల్లాలను కలుపతూ 8A నంబరు నేషనల్ హైవే ఉంది. ఈ జాతీయ రహదారిపై వాఘసియా టోల్ గేట్‌ను(Toll Gate Scam) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే వాహనదారులు చాలా మంది టోల్ ట్యాక్స్‌ను తప్పించుకునేందుకు ఈ టోల్ ప్లాజాను తగలకుండా పక్కనే ఉన్న మరో ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లేవారు. ఈ క్రమంలో కొందరు మోసగాళ్లు దీనిని గమనించారు.
దీంతో ఈ మోసగాళ్లు ఓ భారీ మోసానికి పథకం రచించారు. ప్లాన్‌లో భాగంగా మొదటగా ఈ మార్గంలో మూతపడిపోయిన ఓ సిరామిక్ ఫ్యాక్టరీని అద్దెకు తీసుకున్నారు. ఆ ఫ్యాక్టరీకి ఇరువైపులా హైవే వరకు బైపాస్ రోడ్డును నిర్మించారు. అనంతరం చివరగా ఫ్యాక్టరీలో ఫేక్ టోల్ ప్లాజాను ఏర్పాటు చేశారు. దాదాపు ఏడాదిన్నర నుంచి ఈ ఘరానా మోసగాళ్లు ఈ నకిలీ టోల్ ప్లాజాను నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇక్కడే ఈ మోసగాళ్లు.. తమపై ఎవరికీ అనుమానం రాకుండా మరో ప్లాన్ వేశారు. వాహనదారులకు కానీ అధికారులకు కానీ ఎటువంటి డౌట్ రాకుండా ఉండేలా చూసుకున్నారు. ఇందుకోసం హైవేలపై ఉన్న టోల్ ఛార్జీలతో పోలిస్తే అందులో సగం మాత్రమే వసూలు చేశారు. దీంతో వాహనదారులు కూడా దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదట..
కాగా ఇంతకీ ఈ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. ఈ టోల్ ప్లాజాపై స్థానిక మీడియా, టీవీ ఛానల్స్‌లో రావడంతో ఈ నకిలీ టోల్ ప్లాజా వ్యవహారాన్ని అధికారులు గుర్తించారు. దీంతో స్థానిక అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘరానా మోసానికి పాల్పడిన ఐదుగురిని అరెస్ట్ చేశారు.

ఈ ఐదుగురు నిందితుల్లో ఒకరు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కాగా.. మరొకరు పాటిదార్ వర్గానికి చెందిన ప్రముఖ నేత కుమారుడిగా సమాచారం. వైట్ హౌస్ సిరామిక్ కంపెనీ యజమాని అమర్షి పటేల్, వనరాజ్ సింగ్ ఝాలా, హర్విజయ్ సింగ్ ఝాలా, ధర్మేంద్ర సింగ్ ఝాలా, యువరాజ్ సింగ్ ఝాలా, గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా సమాచారం.
ఏడాదిన్నర కాలంగా ఈ ఫేక్ టోల్ ప్లాజా నిర్వహణతో రూ. 75 కోట్లకు పైగా ఈ ఐదుగురు మోసగాళ్లు వసూలు చేసినట్లు స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. సామాన్య ప్రజలతో పాటు పోలీసులు, ప్రభుత్వ అధికారులను కూడా నిందితులు మోసం చేసినట్లుగా స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
ప్రైవేటు భూముల యజమానులు ఈ విధంగా ఏడాదిన్నరగా బహిరంగంగానే కోట్ల రూపాయలు దండుకున్నారని అధికారిక టోల్ వాఘాసియా టోల్ ప్లాజా మేనేజర్ తెలిపారు. నివేదిక ప్రకారం, నిందితులు ట్రాఫిక్‌ను హైవే కుడి మార్గం నుండి మళ్లించారని.. వైట్ హౌస్ సిరామిక్ కంపెనీ భూమిలో నిర్మించిన వారి టోల్ ప్లాజా వైపు వాహనాలను మళ్లించినట్లు తెలిసిందన్నారు. ఏదేమైనా వీరు చేసిన మోసాన్ని చూస్తే దిమ్మదిరిగి పోవడం ఖాయం.


Click it and Unblock the Notifications








