ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ సూపర్ హిట్.. 2 నెలల్లో 25 లక్షల మంది యూజర్లు.. దీని బెనిఫిట్స్ ఏంటంటే ?
జాతీయ రహదారులపై ప్రయాణించే వాళ్లకు గుడ్ న్యూస్. ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) ద్వారా టోల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తీసుకువచ్చిన ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. 2025 ఆగస్టు 15న ప్రవేశపెట్టబడిన ఈ పాస్‌ను కేవలం రెండు నెలల్లోనే ఉపయోగించిన వారి సంఖ్య 25 లక్షలు దాటింది.
టోల్ గేట్ల వద్ద వెయిటింగ్ లేకుండా, పదేపదే రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రయాణాన్ని సులభతరం చేసే ఈ యాన్యువల్ పాస్ గురించి, దాని ప్రయోజనాలు, నష్టాలు, ఎలా కొనుగోలు చేయాలి అనే వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ప్రవేశపెట్టిన కేవలం రెండు నెలల్లోనే దీనిని ఉపయోగించే వారి సంఖ్య 25 లక్షలు దాటింది. 2025 ఆగస్టు 15న ప్రారంభించిన ఈ పాస్.. జాతీయ రహదారుల వినియోగదారులకు తక్కువ ఖర్చుతో కూడిన ట్రావెల్ ఆప్షన్ అందజేస్తుంది. ఈ పాస్ జాతీయ రహదారులు, నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వేలపై ఉన్న సుమారు 1,150 టోల్ ప్లాజాల వద్ద చెల్లుబాటు అవుతుంది.
ఈ యాన్యువల్ పాస్‌ను ఏడాది పాటు చెల్లుబాటు లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్‌ల కోసం రూ.3,000 ఏకమొత్తం చెల్లించడం ద్వారా పొందవచ్చు. దీనివల్ల ఫాస్టాగ్‌ను పదేపదే రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ ఉన్న అన్ని నాన్ కమర్షియల్ వెహికల్స్‌కు ఈ పాస్ వర్తిస్తుంది.

హైవే యాత్ర యాప్ (HighwayYatra App) లేదా ఎన్‌హెచ్ఏఐ (NHAI) వెబ్‌సైట్ ద్వారా డబ్బులు చెల్లించిన తర్వాత వెహికల్ ఇప్పటికే ఉన్న ఫాస్టాగ్‌పై ఈ యాన్యువల్ పాస్ కేవలం రెండు గంటల్లోపు యాక్టివ్ అవుతుంది. ఈ పాస్ మరొకరికి ట్రాన్సఫర్ చేసేందుకు వీలు లేదు.
ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ తీసుకుంటే.. మీకు టోల్ పేమెంట్స్ చిక్కుల నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. ప్రతిసారీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు క్యాష్‌లెస్, ఆటోమేటిక్ ఎంట్రీని పొందవచ్చు, దీనివల్ల టోల్ ప్లాజా వద్ద పొడవైన క్యూలలో వేచి ఉండాల్సిన పని లేదు.

మీరు రోజువారీగా లేదా తరచుగా ప్రయాణించేవారు అయితే ఏడాదంతా అయ్యే ఖర్చు ముందుగానే నిర్ణయించుకోవచ్చు. ఆఫీస్‌కు రోజూ వచ్చిపోయే వారికి లేదా హైవేలపై ఎక్కువగా ప్రయాణించే వారికి ఇది చాలా ప్రయోజనకరమైన డీల్ అవుతుంది.
తక్కువ దూరం లేదా అప్పుడప్పుడు మాత్రమే ప్రయాణించే వారికి ఈ పాస్ నష్టదాయకం. మీరు నెలకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే టోల్ దాటుతుంటే రూ.3,000 మొత్తం వృథా కావచ్చు. ఈ మొత్తం నాన్ రిఫండబుల్. ఒకసారి యాన్యువల్ పాస్ తీసుకుంటే, డబ్బు తిరిగి రాదు.
అలాగే, ఈ పాస్ ప్రతిచోటా చెల్లుబాటు కాదు. మీరు ఏ టోల్ ప్లాజా లేదా హైవే నుంచి కొనుగోలు చేశారో ఆ పరిధిలోనే ఇది చెల్లుబాటు అవుతుంది. ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత, మీరు పూర్తి వినియోగించుకున్నా, లేకపోయినా మళ్లీ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
మీరు ఈ పాస్‌ను ఇంట్లో కూర్చొనే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఎన్‌హెచ్ఏఐ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేయండి. ముందుగా మీ కారు ఈ పాస్‌కు అర్హత ఉందో లేదో తనిఖీ చేస్తారు. మీ ఫాస్టాగ్ చెల్లుబాటును కూడా చూస్తారు. ఆ తర్వాత రూ.3,000 చెల్లించాలి. డబ్బు చెల్లించిన సుమారు 2 గంటల్లోపు మీ పాస్ యాక్టివేట్ అవుతుంది.


Click it and Unblock the Notifications








