ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ బ్లాక్.. రూ.9 కోట్లు చెల్లిస్తేనే సర్వీసులు అని మెసేజ్.. అవాక్కయిన ఓనర్
హైవేలపై టోల్‌గేట్ల వద్ద టోల్ ఛార్జీని చెల్లించడానికి గతంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటే చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఫాస్ట్‌ట్యాగ్ అందుబాటులోకి వచ్చాక క్షణాల్లో లైన్ ముందుకు కదలడం ద్వారా క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వాహనదారులకు లేదు. దీనివల్ల ప్రయాణీకులు విసుగు లేని ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు.
ప్రస్తుతం టోల్ గేట్ల వద్ద ఫాస్ట్‌ట్యాగ్‌కు చాలా గుర్తింపు ఉంది. ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా టోల్ గేట్ల వద్ద పొడవైన క్యూలను నియంత్రించినప్పటికీ, ఫాస్ట్‌ట్యాగ్ వల్ల కలిగే ఇతర సమస్యలు తగ్గడం లేదు. ఇటీవల సోషల్ మీడియాలో ఫాస్టాగ్‌పై ఫిర్యాదులు సర్వసాధారణమైపోయాయి. వివరాల్లోకి వెళితే..

ఇటీవల జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదెక్కడి విడ్డూరం అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఒక వ్యక్తి ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాలో రూ.9 కోట్లు లేకపోవడంతో అతని ఫాస్ట్‌ట్యాగ్ ఖాతా బ్లాక్‌లిస్ట్ చేశారు. ఏంటి షాక్ అవుతున్నారా.. కానీ ఇది నిజం. మీరు నమ్మాల్సిందే..
ఈ సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానాలో ఓ టోల్‌గేట్ వద్ద, ఒక వాహనదారుడు తన పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ ఖాతా ద్వారా టోల్ ఛార్జీని చెల్లించి టోల్ గేట్ దాటి ముందుకు వెళ్లారు. ఆకాసేపట్లోనే.. మీ ఖాతాలో తగినంత మొత్తం లేకపోవడం వల్ల మీ ఖాతా బ్లాక్ చేయబడిందని అతని ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాకు సందేశం వచ్చింది.

ఈ సందేశంతో షాక్‌కు గురైన వాహనదారుడు దీని వెనుక కారణం తెలిసి అవాక్కయ్యారు. సదరు వ్యక్తి ఖాతాలో తగినంత నిధులు లేకపోవడంతో ఖాతా నిలిపివేశామని సందేశంలో సారాంశం ఉంది. మీరు మీ ఖాతాలో రూ. 9 కోట్లు వేసుకొని మీ ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాను కొనసాగించాలని ఉంది. దీంతో కంగుతిన్న ఆ వ్యక్తి హర్యానా ఎక్స్‌ప్రెస్‌వేలో టోల్ క్రాసింగ్ ధరను తనిఖీ చేశారు.
తనిఖీలో హర్యానా ఎక్స్‌ప్రెస్‌వే దాటడానికి 90 రూపాయలు అని ఉంది. దీంతో వాహనదారుడికి విషయం అర్థమైంది. రూ. 90 వసూలు చేయకుండా, తొమ్మిది కోట్ల రూపాయలు చెల్లించాలని తప్పుగా తెలుపుతూ వ్యక్తి ఖాతాను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచినట్లు గ్రహించారు. రూ. 90 కి బదులుగా రూ. 9 కోట్లు లేవని సందేశం పంపించారని అర్థం చేసుకున్నారు.

ఇది గమనించిన ఆ వ్యక్తి వెంటనే పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ (Paytm FASTag) హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడానికి ప్రయత్నించగా.. కనెక్ట్ అవ్వలేదు. దీంతో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. అనంతరం బీహెచ్‌పీ టీమ్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన ఈ విధంగా ఫిర్యాదు చేశారు.
"ఈ రోజు నాకు Paytm నుండి ఒక టెక్స్ట్ సందేశం వచ్చింది. తగినంత బ్యాలెన్స్ లేని కారణంగా నా వాహనం యొక్క Fastag బ్లాక్‌లిస్ట్ చేయబడిందని, Paytm అప్లికేషన్‌లో తనిఖీ చేసినప్పుడు, వారు భారీ మొత్తంలో రూ. తొమ్మిది కోట్లు వసూలు చేశారని నాకు తెలిసింది. నేను అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను జత చేశాను.

ఫాస్ట్‌ట్యాగ్‌ని కొనసాగించడానికి మీ Paytm వాలెట్‌కి ₹ 9,00,00,000/- జతచేయమంటూ ఒక పాప్అప్ వచ్చింది. కానీ అదే టోల్ ప్లాజాలో సాధారణ టోల్ రూ. 90. హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు ఏం చేయాలి.? దయచేసి సలహా ఇవ్వండి." అని అంటూ ఆయన ఫిర్యాదు చేశారు.
ఫాస్ట్‌ట్యాగ్‌లో ఇప్పటికే చాలా మంది ఈ రకమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. దీని గురించి ఫిర్యాదులు చేయడానికి పేటీఎమ్‌లో వ్యవస్థ లేదు. దీని వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ కంపెనీ వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరించిన పరిష్కారాలు అందించడంపై దృష్టి సారించాలని అభిప్రాయపడుతున్నారు.



Click it and Unblock the Notifications








