కోట్లు ఖరీదు చేసే ఫెరారీ కారు రూ.10 లక్షలకే లభిస్తే..
కోట్ల రూపాయల ఖరీదు చేసే ఇటాలియన్ సూపర్ కార్ ఫెరారీ కేవలం రూ.10 లక్షలకే లభిస్తే ఎలా ఉంటుంది? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ..! కానీ ఇది ఒరిజినల్ ఫెరారీ కారు కాదు, అచ్చం ఫెరారీలా కనిపించే డూప్లికేట్ ఫెరారీ కారు.
ఏ వస్తువుకైనా అచ్చుగుద్దినట్లుగా ఉండే నకలును తయారు చేయటంలో చైనీయులు ది గ్రేట్ అన్న సంగతి మనందరికీ తెలిసినదే. తాజాగా చైనాకు చెందిన కొందరు కార్ మోడఫైయర్లు ఫెరారీ ఇటీవలే ఆవిష్కరించిన లాఫెరారీ మోడల్‌కు రెప్లికా (డూప్లికేట్) తయారు చేశారు. అంతేకాదు, పగని జోండా సూపర్ కారును కూడా డూప్లికేట్ చేసేశారు.

ఇవి ఇతర పేర్లతో విక్రయించబడే కాపీక్యాట్ కార్ల మాదిరిగా కాకుండా, అచ్చంగా లేదా ఇంచు మించు ఒకేలా ఉంటూ, ఒరిజినల్ బ్రాండ్ పేరుతోనే అమ్ముడయ్యే డూప్లికేట్ కార్లు. ఒరిజినల్ కార్లను కార్బన్ ఫైబర్ బాడీతో తయారు చేస్తే, ఈ డూప్లికేట్ కార్లను మాత్రం ఫైబర్ గ్లాస్ మెటీరియల్‌తో తయారు చేస్తారు.
ఇంజన్ విషయానికి వస్తే.. ఈ డూప్లికేట్ కారులో ఒరిజినల్ వి8, వి12 వంటి ఇంజన్లను కాకుండా ఏ టొయోటా లేదా హోండా సెడాన్ల నుంచి సేకరించిన వాటిని ఉపయోగిస్తారు. కాబట్టి, ఇవి రియల్ కార్ల మాదిరిగా పెర్ఫార్మెన్స్‌ను కలిగి ఉండకపోయినప్పటికీ, చూడటానికి మాత్రం రియల్ కార్ల మాదిరిగానే అనిపిస్తాయి.

ఒరిజినల్ ఫెరారీ లాఫెరారీ కారు ధర మిలియన్ డాలర్లు ఉంటే, ఈ డూప్లికేట్ కారు ధర కేవలం 20,000 డాలర్లు మాత్రమే (మన కరెన్సీలో సుమారు రూ.11 లక్షలు). ఇలాంటి వ్యాపారం చేయటం అక్రమమే అయినప్పటికీ, ఫెరారీ వంటి కంపెనీలు వీటిని పెద్ద సీరియస్‌గా తీసుకోకపోవటం వల్లనే ఇలాంటి డూప్లికేట్ కార్లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ఇటీవల స్పెయిన్‌లో ఇలాంటి డూప్లికేట్ కార్ రాకెట్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసినదే.


Click it and Unblock the Notifications








