వందే భారత్ రైలులో అగ్ని ప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. ఆ కాసేపటికే..
రైల్వే కనెక్టివిటీ లక్ష్యంగా భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టింది. దశల వారీగా దేశవ్యాప్తంగా పలు స్టేషన్ల నుంచి వందే భారత్ సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే ఇటీవల తరచూ వందే భారత్ రైళ్లకు సంబంధించి పలు సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భోపాల్ - ఢిల్లీ వందేభారత్ రైలులో సోమవారం(జూలై 17) అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భోపాల్‌లోని రాణి కమలపాటి నుంచి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్‌కు వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సీ-14 కోచ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. బ్యాటరీ కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు.

ట్రైన్ నంబర్ 20171 భోపాల్- హజ్రత్ నిజాముద్దీన్ వందే భారత్, సోమవారం ఉదయం 5:40 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. బినా రైల్వే స్టేషన్‌కు చేరుకోకముందే కుర్వాయి కేథోరా ప్రాంతంలో ట్రైన్‌లో మంటలు చెలరేగాయి. సంఘటన సమయంలో ప్రమాదం జరిగిన కోచ్‌లో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నారు.
దీంతో వెంటనే రైలు ఉదయం 7 గంటల సమయంలో కుర్వాయి కేతోరా వద్ద ఆగిపోయింది. కోచ్‌లోని బ్యాటరీ బాక్స్ వద్ద మంటలు ప్రారంభమయ్యాయని రైల్వే సిబ్బంది గుర్తించారు. మంటలను గుర్తించిన సిబ్బంది వెంటనే లోకో పైలట్‌కు సమాచారం అందించారు. అప్రమత్తమైన సిబ్బంది ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ప్రయాణికులందరినీ రైలు నుంచి సురక్షితంగా కిందికి దింపారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

ఆ రైలులో కాంగ్రెస్ నేత అజయ్‌సింగ్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. ఈ ప్రమాదంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు వందే భారత్ రైలును మొత్తం ఖాళీ చేయించారు. మంటలను అదుపు చేయడంలో అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సైతం సహాయం అందించారు. అకస్మాత్తుగా బ్యాటరీ పేలిన శబ్ధం వచ్చి మంటలు రావడంతో భయాందోళనలకు గురయ్యమాని ప్రయాణికులు తెలిపారు.
సీ 14 కోచ్‌లో తాను కూర్చున్న సీటు కింద నుంచి మంటలు వెలువడుతున్న శబ్ధాన్ని విన్నట్లు ఓ ప్రయాణికుడు తెలిపారు. వెంటనే అందరూ అక్కడి నుంచి పక్కకు జరిగారని.. రైలు ఆగినప్పుడు, బ్యాటరీ బాక్స్ కాలిపోయిందని తెలిపారు. సంఘటన గురించి గార్డుకి తెలియజేసిన అనంతరం తమ సామగ్రితో రైలు దిగినట్లు తన అనుభవాన్ని పంచుకున్నారు.
మరో ప్రయాణికుడు జరిగిన ప్రమాదం గురించి చెబుతూ తాను రాణి కమలాపాటి నుంచి గ్వాలియర్‌కు వెళుతుండగా కుర్వాయి సమీపంలో కోచ్‌కు రెండు వైపులా పొగలు వ్యాపించాయని చెప్పారు. రైలు ఆగిపోయాక, ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తరలించామని వివరించారు. కాగా ప్రమాదం అనంతరం డిఫెక్టివ్ బ్యాటరీని తీసేశారు.
ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. వారికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. బ్యాటరీ బాక్స్‌కు మాత్రమే మంటలు వ్యాపించాయని ఆ తర్వాత మంటలు ఆరిపోయాయని చెప్పారు. బ్యాటరీ బాక్స్ ప్రయాణీకులకు దూరంగా అండర్‌గేర్‌లో ఉందని చెప్పారు. మంటలు ఆర్పివేశాక, డిఫెక్టివ్ బ్యాటరీలను తీసివేసినట్లు చెప్పారు. ఆ తరువాత తిరిగి ఉదయం 10.05 గంటలకు వందే భారత్ ట్రైన్ ఢిల్లీకి పయనమైంది.
భోపాల్ - ఢిల్లీ మార్గంలో వందే భారత్ రైలు సేవలను ఏప్రిల్ 1 న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రైలు మొదటగా ఆగ్రాకు ప్రయాణించిన అనంతరం.. నిజాముద్దీన్ నుంచి రాణి కమలపాటికి ఏప్రిల్ 2 నుంచి అధికారిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 3న రైలు కమలపాటి నుంచి నిజాముద్దీన్‌కు తిరుగు ప్రయాణం చేసింది.


Click it and Unblock the Notifications








