దేశంలోనే తొలిసారిగా డ్రైవర్ లేకుండా నడిచే మెట్రో రైల్.. చైనా నుంచి దిగుమతి!!
బెంగళూరులోని నమ్మ మెట్రో కోసం దేశంలోనే తొలి డ్రైవర్ రహిత రైలు చైనా నుంచి చేరుకుంది. దక్షిణ బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలోని హెబ్బగోడి డిపోకి ఈ ప్రత్యేక రైలుని తీసుకువచ్చినట్లు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) తెలిపింది.
నమ్మ మెట్రో ఎల్లో లైన్‌లోని జయదేవ హాస్పిటల్, సిల్క్ బోర్డ్ జంక్షన్, ఎలక్ట్రానిక్స్ సిటీ మీదుగా ఆర్వీ రోడ్డును బొమ్మసంద్రతో కలిపే 19.15 కిలోమీటర్ల మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఆరు కోచ్‌లతో టెస్ట్ రన్ నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక రైలుని చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని CRRC Nanjing Puzhen Co Ltd రూపొందించింది.

నమ్మ మెట్రోకు మొత్తం 216 కోచ్‌లను సరఫరా చేయడానికి 2019 లోనే రూ .1,578 కోట్ల ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం సిద్ధమైన రైల్‌ని బెంగళూరుకి రప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. భారీ షిప్‌ల ద్వారా జనవరి 24న చైనా నుంచి బయలుదేరిన ఈ రైలు ఫిబ్రవరి 6న చెన్నై పోర్టుకు చేరుకుంది. బెంగళూరుకు తరలించేందుకు అన్‌లోడింగ్, కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మరికొన్ని అక్కడే ఉంచారు.
తాజాగా ఈ రైలు బెంగళూరుకి చేరుకుంది. దీనిని పరీక్షించేందుకు 8-10 స్టాటిక్ టెస్ట్‌లు, డైనమిక్ పరీక్షలు, మెయిన్ లైన్ లో 15 టెస్ట్‌లు మరియు 7-8 ఇంటర్ ఫేస్ పరీక్షలతో సహా 32 వేర్వేరు టెస్ట్‌లు నిర్వహించనున్నారు. లక్నోకు చెందిన రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) పర్యవేక్షణలో ఈ టెస్ట్‌లు నిర్వహిస్తామని BMRCL అధికారులు తెలిపారు.
పలు రకాల టెస్టులు పూర్తి చేసుకున్న అనంతరం టెస్ట్‌లకు సంబంధించిన రిజల్ట్స్‌ని చీఫ్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (సీసీఆర్ఎస్)కు, ఆ తర్వాత సాంకేతిక అనుమతి కోసం రైల్వే బోర్డుకు సమర్పిస్తామని ఓ అధికారి తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు ఐదు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని అధికారులు వివరించారు.
ట్రైన్ అసెంబ్లింగ్, టెస్టింగ్‌లను పర్యవేక్షించడానికి ఐదుగురు చైనాకు చెందిన టెక్నీషియన్స్ బెంగళూరుకు రానున్నారు. ఇప్పటికే వీరికి సంబంధించిన వీసాలు మంజూరు చేయబడ్డాయి. మరో 10 మందికి ఫిబ్రవరి నెలాఖరులోగా వీసాలు లభించనున్నాయి. మొత్తం 15 మందితో కూడిన ఈ బృందం పూర్తి పరీక్షల నిర్వహణ నుంచి ఇతర విధానాలను పర్యవేక్షిస్తారు. ఈ టెక్నీషియన్లు నిశితంగా పరీక్షించిన తర్వాత ఈ డ్రైవర్ రహిత ట్రైన్ పట్టాలెక్కుతుంది.
ఎల్లో లైన్ లో సివిల్, ట్రాక్ లేయింగ్ పనులు ఎప్పుడో పూర్తయ్యాయి. కానీ బోగీలు అందుబాటులో లేకపోవడంతో ట్రయల్ రన్ లు ప్రారంభించలేకపోయారు. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పబ్లిక్ సెక్టార్ సంస్థ BEML (కోచ్ కు రూ.9.28 కోట్లు) కంటే చాలా తక్కువ (ఒక్కో కోచ్ కు రూ.7.31 కోట్లు) బిడ్ వేసినందున CRRC ఈ కాంట్రాక్టును దక్కించుకుంది.
చైనా కంపెనీని ఎంచుకోవడానికి కారణాలను అధికారులు వివరించారు. చైనా ట్రైన్‌లో ఉత్తమ ఎలక్ట్రానిక్స్ ఉండటం వల్ల ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. అయితే దేశంలో ఈ అధునాతన టెక్నాలజీని అందుకోవడానికి సమయం పడుతుందని అందుకే చైనా కంపెనీ వైపే మొగ్గు చూపినట్లు BMRCL సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
మే నాటికి మరో రెండు రైళ్లు, ఆ తర్వాత ప్రతి నెలా రెండు రైళ్లు వస్తాయని సంస్థ భావిస్తోంది. ఎల్లో లైన్‌ని ప్రారంభించడానికి ఎనిమిది రైళ్లు అవసరం ఉంటుంది. ఈ లెక్క ప్రకారం 2024 3rd క్వార్టర్‌లో ఈ పనులు కచ్చితంగా పూర్తి అయ్యే అవకాశం ఉంది. దేశంలోనే చరిత్ర సృష్టించేందుకు బెంగళూరు మెట్రో ఉత్సాహంగా ఎదురు చూస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








