థ్రిల్లింగ్ జర్నీ అంటే ఇది కదా.. ప్రజలను మైమరిస్తున్న అండర్ వాటర్ మెట్రో సర్వీస్.. ఫొటోలు వైరల్
దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ సేవలు(Underwater Metro Tunnel) అందుబాటులోకి వచ్చాయి. వెస్ట్ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఈ మెట్రో టెన్నెల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా అధికారికంగా సామాన్య ప్రజలకు ఈ సేవలు శుక్రవాం(మార్చి 15) నుంచి అందుబాటులోకి వచ్చాయి.
భారత్‌లో తొలిసారిగా కోల్‌కతాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అండర్ వాటర్ మెట్రో టన్నెల్(Underwater Metro Tunnel Kolkata) సేవలు ప్రారంభమయ్యాయి. ఈ మార్గంలో ప్రయాణించేందుకు నగరవాసులు ఎక్కువగా ఆసక్తి కనబరిచారు. ప్రారంభమైన మొదటిరోజే ఈ మెట్రో రైలుకు మంచి స్పందన లభించింది. తొలిరోజు వందల సంఖ్యలో ప్రయాణికులు ఈ మార్గంలో ప్రయాణించి సరికొత్త అనుభూతిని పొందారు.

కోల్‌కతాలో హుగ్లీ నదిలో నుంచి ఈ మెట్రో రైలు మార్గం ఉంటుంది. అండర్ వాటర్ మెట్రో లైన్ కోసం 30 మీటర్ల లోతు సొరంగాన్ని నిర్మించారు. ప్రజల హర్షధ్వానాలతో రైలు ప్రయాణం హౌరా స్టేషన్ నుంచి ప్రారంభమైంది. రైలు బయలుదేరగానే ప్రయాణికులు చప్పట్లతో తమ సంతోషం వ్యక్తం చేశారు. నీటి మార్గం గుండా ప్రయాణించడంతో వింత అనుభూతికి లోనయ్యారు.
కాగా శుక్రవారం ఉదయం 7 గంటలకు హౌరా స్టేషన్ నుంచి ఈ మెట్రో రైలు తొలి ప్రయాణం ప్రారంభమైంది. అదేవిధంగా మరో రైలు కూడా అటువైపు ఉన్న ఎస్ప్లానేడ్ స్టేషన్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గం గుండా జర్నీని ఆస్వాదించడానికి చాలా మంది ఆసక్తి కనబరిచారు. రైలు టికెట్ల కోసం జనం ఎగబడ్డారు. ఆశ్చర్యం ఏమిటంటే.. ఉదయం మెట్రో రైలు టికెట్ల కోసం రాత్రి నుంచే పడిగాపులు కాశారు.

ప్రయాణికులు హర్షధ్వానాలు, కేరింతల మధ్య హౌరా మైదాన్ - ఎస్ప్లానేడ్ టెర్మినల్స్ మధ్య మెట్రో రైలు సేవలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రయాణంలో చిన్నారులు కూడా పాల్గొని సందడి చేశారు. మార్చి 6 న ప్రధాని మోదీ ఈ రెండు రైల్వే టెర్మినళ్ల మార్గాన్ని మెట్రో రాకపోకలకు ప్రారంభించారు. ఈ దశలో శుక్రవారం నుంచి సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
కాగా ఈ సొరంగ రైల్వే మార్గంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రైలు నీటిలోపలికి వెళుతున్న అనుభూతిని కలిగించేందుకు సొరంగాన్ని నీలిరంగు లైట్లతో అలంకరించడం విశేషం. లైట్ వాటర్ స్ప్లాషింగ్‌ను అనుకరించేలా దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రైలు నదిలో నుంచి వెళ్లే సమయంలో మాత్రమే ఈ లైట్లు వెలుగుతుంటాయి.

ఈ రెండు స్టేషన్ల మధ్య మెట్రో మార్గంలో 520 మీటర్ల పొడవున అండర్ వాటర్‌లో ప్రయాణించేలా.. ఈ మెట్రో టన్నెల్‌ను సిద్ధం చేశారు. ఈ సొరంగ మార్గంలో ప్రయాణించేందుకు దాదాపు 45 సెకన్లు సమయం పడుతుంది. కాగా హుగ్లీ నదిలో మెట్రో టన్నెల్ నిర్మాణం 2017 లో ప్రారంభమైంది.

దాదాపు రూ. 4,965 కోట్ల వ్యయంతో ఈ కొత్త మెట్రో లైన్ నిర్మాణం చేపట్టారు. హౌరా - ఎస్ప్లానేడ్ స్టేషన్ల మధ్య దూరం 4.8 కి.మీ పొడవుగా ఉంది. త్వరలో కోల్‌కతా మెట్రో అథారిటీ ఈ మెట్రో లైన్‌ను మరికొన్ని కి.మీల వరకు విస్తరించననున్నట్లు ప్రకటించింది.


Click it and Unblock the Notifications








