పర్యాటకులకు షాక్.. ఇకపై నంది హిల్స్‌కు వెళ్లాలంటే ఆ వాహనాలకు నో ఎంట్రీ..
సౌత్ ఇండియాలోో ప్రముఖ పర్యాటక ప్రాంతం నంది హిల్స్. అక్కడి ప్రకృతి అందాలను చూడటానికి ప్రతి ఏటా లక్షల్లో పర్యాటకులు తరలి వెళ్తుంటారు. వారాంతాల్లో నంది కొండలకు పర్యాటకుల తాకిడి ఎక్కువ. ఈ క్రమంలో పర్యాటకులకు షాక్ ఇచ్చింది కర్ణాటక ప్రభుత్వం.
రానున్న 6-8 నెలల్లో నంది హిల్స్‌ను డే టూరిజం డెవలప్‌మెంట్‌గా అభివృద్ధి చేయాలన్న కర్ణాటక రాష్ట్ర పర్యాటక శాఖ ప్రణాళికలో భాగంగా, నంది హిల్స్‌లోకి ప్రైవేట్ మరియు వ్యక్తిగత వాహనాలను నిషేధించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

బెంగళూరుతో పాటు పరిసర ప్రాంతాల నుంచి నంది హిల్స్‌కు రోజూ వందల సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. వారాంతాల్లో ఈ సంఖ్య వేలకు చేరుకుంటుంది. దీంతో అక్కడ పర్యావరణం కాలుష్యంతో దెబ్బ తినడమే కాకుండా.. పర్యాటకులు కలుషిత గాలి పీల్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొండపైకి పెట్రోల్, డీజిల్ వాహనాలు రాకుండా నిషేధం విధిస్తూ పర్యాటకులకు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
కర్ణాటక రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి కపిల్ మోహన్ దీనిపై వివరణ ఇచ్చారు. బెంగుళూరు వాసుల కోసం నంది హిల్స్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. 9వ శతాబ్దానికి చెందిన భోగ నందీశ్వర ఆలయాన్ని నైట్ లైటింగ్ మరియు సౌండ్-లైట్ షోతో తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. వారసత్వం స్థలంగా ఆ ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేస్తున్నారు.
నంది హిల్స్ పరిసర ప్రాంతాలు వారాంతాల్లో రద్దీగా ఉంటాయి. తరచుగా అక్కడ ట్రాఫిక్ కూడా పెరుగుతూ ఉంది. ఇంధనంతో నడిచే వాహనాలు కావడంతో కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు ఫ్యూయెల్‌తో నడిచే వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించడాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించారు.
నందిబెట్ట బెంగుళూరు నుంచి 60 కి.మీ దూరంలో ఉంది. ఇంకా దీనిని ప్రమాదాలు జరిగే జోన్‌గా పరిగణిస్తారు. కాబట్టి కొత్త సంవత్సరం మరియు ఇతర ప్రధాన సెలవుల సమయంలో కొండలను మైదానాలకు కలిపే 2 కి.మీ.ల పరిధిలోకి బైక్‌లు మరియు నాలుగు చక్రాల వాహనాలు ప్రవేశించకుండా పోలీసులు ఇప్పటికే నిషేధం విధించారు.
దీనికి తోడు రానున్న 6-8 నెలల్లో నంది హిల్స్‌ను డే టైమ్ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీని ద్వారా చుట్టుపక్కల ప్రాంతంలో ట్రాఫిక్‌ను తగ్గించడమే కాకుండా, నంది హిల్స్ ప్రకృతి అందాలను మరియు చారిత్రక ప్రాముఖ్యతను ఆస్వాదించవచ్చు. అంతే కాకుండా పర్యాటకులకు సురక్షితమైన వాతావరణాన్ని కూడా అందిస్తుంది.
పర్యాటకులు నంది కొండలను సందర్శించేందుకు కేబుల్ కార్ ఎంపిక కూడా ఉంటుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఇందులో ప్రయాణించేందుకు ఒక్కో వ్యక్తికి దాదాపు రూ.250-300 ఖర్చవుతుంది. పర్యాటకులను సురక్షితంగా ఉంచడానికి, కొండలపైకి ప్రైవేట్ వాహనాలు రాకుండా నిషేధించాలని పర్యావరణ శాఖ నిర్ణయించింది. ఇంకా నంది హిల్స్‌ను చూడటానికి వచ్చే పర్యాటకులను కొండ పైకి తరలించడానికి చిన్న ఎలక్ట్రిక్ బస్సుల సముదాయాన్ని త్వరలో ఏర్పాటు చేయనుంది.
నంది హిల్స్ వద్ద ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి బెంగళూరు నుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రా, ఇతర సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది పర్యాటకులు తరలివస్తున్నారు. పచ్చని చెట్లు, పొగ మంచు, వాటి మధ్య ఎంతో అందంగా కనిపించే కొండలు.. వీటిని చూస్తుంటే మనసు తేలికగా ఉంటుంది. రానున్న రోజుల్లో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున, ఇప్పుడు తీసుకున్న చర్యలు పర్యావరణ నష్టాన్ని నివారించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








