ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ వాడే వాళ్లకు గుడ్‌న్యూస్.. NHAI కొత్త ఫీచర్.. ఇక గిఫ్టుగా కూడా ఇవ్వొచ్చు
భారతదేశంలో టోల్ గేట్ల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు ఫాస్ట్ ట్యాగ్(FASTag) సిస్టమ్‌ను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మరింత సరళీకృతం చేసింది. ఇటీవల ప్రారంభించిన ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ (Annual Pass) ఇప్పుడు బహుమతిగా ఇవ్వడం మరింత ఈజీ అయింది.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, తమ రాజ్‌మార్గయాత్ర యాప్ ద్వారా ఈ కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ యాన్యువల్ పాస్‌ను తరచుగా జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రైవేట్ వాహన యజమానుల కోసం తీసుకువచ్చారు.. కేవలం రూ.3,000 చెల్లించి ఏడాది పొడవునా టోల్ పాస్‌ను ఎలా బహుమతిగా ఇవ్వవచ్చు, ఈ పాస్ ప్రత్యేకతలు వివరంగా తెలుసుకుందాం.

జాతీయ రహదారుల మీద ఎక్కువగా ప్రయాణించే వారికి ఉపశమనం కలిగించే విధంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తమ రాజ్‌మార్గయాత్ర యాప్ ద్వారా కొత్త ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ గిఫ్టింగ్ ఫీచరును అక్టోబరు 18, శనివారం ప్రారంభించింది. ఈ యాన్యువల్ పాస్‌ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2025 ఆగస్టు 15న ప్రారంభించింది.
ఇది ముఖ్యంగా రోజువారీ జాతీయ రహదారులపై ప్రయాణించే వారి కోసం రూపొందించారు ఈ పాస్ కేవలం ప్రైవేట్, వ్యాపారేతర వాహనాలకు (ఉదాహరణకు, కారు, జీప్, వ్యాన్) మాత్రమే వర్తిస్తుంది. రాజ్‌మార్గయాత్ర యాప్ ద్వారా ఎవరికైనా ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్‌ను బహుమతిగా ఇవ్వడం చాలా సులభం.

యాప్‌లో యాడ్ పాస్(Add Pass) ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆ తర్వాత కింది ప్రాసెస్ ఫాలో అవ్వాలి. పాస్ గిఫ్ట్ చేయాలనుకుంటున్న వ్యక్తి వెహికల్ నంబర్, సంప్రదింపు వివరాలను నమోదు చేయాలి. ట్రాన్సాక్షన్ కన్పాం చేసేందుకు ఒక ఓటీపీ (OTP) వస్తుంది. ఓటీపీని సరిచూసిన తర్వాత, ఆ వార్షిక పాస్ ఆ వ్యక్తి వెహికల్ కు యాడ్ చేసిన ఫాస్ట్‌ట్యాగ్‌పై ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. పేమెంట్ చేసిన సుమారు రెండు గంటల్లోపు ఈ పాస్ యాక్టివేట్ అవుతుంది.
ఈ యాన్యువల్ పాస్ ధర, చెల్లుబాటు, వినియోగ పరిమితులకు సంబంధించి ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ఒకేసారి రూ.3,000 చెల్లింపుతో, ఈ పాస్ ఒక ఏడాది పాటు లేదా 200 టోల్‌లను దాటేంత వరకు (ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే అది) చెల్లుబాటు అవుతుంది. ఈ లిమిట్ పూర్తయిన తర్వాత, ఫాస్ట్‌ట్యాగ్ మళ్లీ కామన్ పేమెంట్ మోడ్‌కు మారిపోతుంది. ఈ పాస్‌ను భారతదేశంలోని సుమారు 1,150 టోల్ ప్లాజాల వద్ద ఉపయోగించవచ్చు.

ఈ పాస్ కేవలం జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేల మీద మాత్రమే చెల్లుబాటు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు నిర్వహించే ఎక్స్‌ప్రెస్‌వేలు, రాష్ట్ర రహదారులపై దీనికి ఎక్స్ ట్రా ఛార్జీలు వర్తించవచ్చు.
ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ప్రారంభించిన రెండు నెలల్లోనే ప్రజల్లో విపరీతంగా ప్రాచుర్యం పొందింది. ఇప్పటివరకు 25 లక్షలకు పైగా వినియోగదారులు ఈ పాస్‌ను స్వీకరించారు. 5.67 కోట్లకు పైగా లావాదేవీలు దీని ద్వారా నమోదయ్యాయి. తరచుగా ప్రయాణించే వారికి ఇది సమయం, డబ్బు ఆదా చేయడంలో బాగా సహాయపడుతుంది.

మీరు ఈ పాస్‌ను ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. NHAI అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేయండి. ముందుగా, మీ వెహికల్ ఈ పాస్‌కు చెల్లుబాటు అవుతుందో లేదో తనిఖీ చేయబడుతుంది. మీ ఫాస్టాగ్ చెల్లుబాటును చూస్తారు. దీని తర్వాత 3000 రూపాయల చెల్లింపు చేయాలి. చెల్లింపు చేసిన దాదాపు 2 గంటల్లో మీ పాస్ సక్రియం అవుతుంది.


Click it and Unblock the Notifications








