Fame-3 మహిళలు ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనండి.. ఫేమ్-3 కింద మీకు భారీ డిస్కౌంట్!!
ఎలక్ట్రిక్ వాహనాలను(Electric Vehicles) ప్రోత్సహించేందుకు కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఫేమ్-3(FAME- III) పథకాన్ని తీసుకువచ్చేందుకు యత్నిస్తోంది. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్రం.. దీనిపై రూ. వేల కోట్లు కేటాయించనుంది. ఈ పథకం ద్వారా మహిళలకు కూడా లబ్ధి చేకూర్చేలా కసరత్తు చేస్తోంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లోకి వచ్చిన ఈవీలు మంచి సేల్స్‌తో దూసుకుపోతున్నాయి. ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలో స్టార్టప్‌లుగా వచ్చిన ఓలా, ఏథర్ ఎనర్జీ, సింపుల్ ఎనర్జీ కంపెనీలు సత్తా చాటుతున్నాయి. అంతే కాకుండా ప్రముఖ ఆటో కంపెనీలు సైతం ఈ రంగంలోకి అడుగుపెట్టి సరికొత్త మోడళ్లతో టూ వీలర్లు, కార్లను విడుదల చేస్తున్నాయి.

విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే ఉద్దేశంతో గతంలో కేంద్రం ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్(FAME) పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు సబ్సిడీ అందిస్తుంది. తద్వారా ఈవీల ధరలు తగ్గడంతో కస్టమర్లు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఫేమ్-1(FAME-1) కు కొనసాగింపుగా 2019 ఏప్రిల్‌లో ఫేమ్- 2 సబ్సడీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ కొనుగోళ్లపై సబ్సిడీ కేంద్రం సబ్సిడీ ఇస్తోంది. కాగా ఈ స్కీమ్ ఈ ఏడాది మార్చి 31 తో ముగియనుంది. ఈ క్రమంలో వీటికి కొనసాగింపుగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఫేమ్-3(FAME-3) పథకాన్ని తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో FAME-3 పథకానికి రూ. 26,400 కోట్లు కేటాయించాలని కేంద్ర పరిశ్రమల శాఖ పట్టుబట్టింది. ఈ మేరకు భాగస్వామ్య పక్షాలతో చర్చల అనంతరం ఈ ప్రతిపాదన చేసినట్లు సమాచారం. కాగా ఫేమ్-1, ఫేమ్-2 దశల్లో ఈవీలపై సబ్సిడీ అనంతరం ఫేమ్-3 ఫేజ్ అవసరంపై కేంద్ర పరిశ్రమల శాఖను ఆర్థిక శాఖ ప్రశ్నించగా.. ఈవీల వినియోగంపై ప్రజల దృష్టిని మరల్చాలంటే ఫేమ్-3 అవసరం ఉందని ప్రతిపాదించింది.
FAME-3 పథకం కోసం రూ. 26,400 కోట్లు కేటాయించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ప్రతిపాదిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ టూ వీలర్ల కోసం రూ. 8,158 కోట్లు, ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల కోసం రూ. 4,100 కోట్లు, ఈవీ ఫోర్ వీలర్ల కోసం రూ. 1800 కోట్లు, ఎలక్ట్రిక్ బస్సుల కోసం మరో రూ. 9,600 కోట్లు కోటాయించాలని ప్రతిపాదన తీసుకొచ్చింది.
కాగా ఈసారి ఫేమ్-3 లో తొలిసారిగా ఈ- ట్రాక్టర్లు, హైబ్రిడ్ వాహనాలను చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటికోసం రూ. 300 కోట్లు కేటాయించే యోచనలో ఉంది. ఫేమ్-3 అమల్లోకి వస్తే మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ మరింతగా పెరుగుతుందనడంలో సందేహం లేదు.
అయితే గతంలో మాదిరి కాకుండా ఈ సారి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఇచ్చే సబ్సిడీని క్రమంగా తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు మొదటి ఏడాదిలో కిలోవాట్ బ్యాటరీకి రూ. 15 వేలు, మరుసటి ఏడాది రూ. 7,500, ఆ తర్వాత వరుసగా రెండేళ్లలో ఈ సబ్సిడీని రూ. 3,000, రూ.1500 కు తగ్గించాలని కేంద్రం భావిస్తోంది.
కాగా త్రీ వీలర్, ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలకూ ఇదే విధానాన్ని అనుసరించాలని కేంద్రం యోచిస్తోంది. వీటితో పాటు మహిళలకు కూడా అదనపు ప్రయోజనం చేకూర్చనుంది. మహిళల పేరిట రిజిస్టర్ చేసే ఏ ఎలక్ట్రిక్ వాహనానికైనా 10 శాతం చొప్పున అదనంగా సబ్సిడీ ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది.
ఫేమ్-3 లో భాగంగా ఈ సారి కొనుగోళ్లపై రాయితో పాటు టెక్నాలజీ డెవలప్‌మెంట్, ట్రయల్ రన్ వర్క్స్ కోసం కూడా నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. దీంతో మొత్తంగా కలుపుకొని FAME మూడో దశలో దాదాపు రూ. 33,000 కోట్లు కేటాయించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








