జీపీఎస్ టోల్‌గేట్ ఎలా పనిచేస్తుందో తెలుసా? రూ. 10,000 కోట్ల ఆదాయం పక్కా అంటున్న నితిన్ గడ్కరీ
దేశంలో త్వరలోనే కొత్త జీపీఎస్ టోల్ వసూలు సిస్టమ్ అందుబాటులోకి రానుంది. దీనివల్ల ట్రాఫిక్ తగ్గడమే కాకుడా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఆదాయం కనీసం రూ .10,000 కోట్లు పెరగనుంది. అతి త్వరలోనే భారత్‌లో రాబోయే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) ద్వారా ఈ మొత్తం సొమ్ము NHAIకి దక్కనుంది. టోల్ మేనేజ్‌మెంట్ ఆదాయం పెంపుదలకు ఈ సరికొత్త విధానం సహాయపడుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ ప్రక్రియను అమలు చేయడానికి తగిన టెండర్ పక్రియ ఇప్పటికే కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీ కోసం..
భారతదేశంలో ప్రస్తుతం ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మాత్రం ఫాస్టాగ్ లేని వాహనాలకు టోల్ బూత్‌లో ప్రత్యేక కౌంటర్ ద్వారా సాధారణ పద్ధతిలో అధిక మొత్తంలో టోల్ ఫీజు వసూలు చేసి పంపిస్తున్నారు. ఫాస్టాగ్ వ్యవస్థ అందుబాటులో ఉన్న కానీ టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఏర్పడుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను తీసుకు వస్తుంది.

ఈ విధానం ద్వారా హైవేలపై ట్రాఫిక్‌ని నిలువరించవచ్చని కేంద్రం భావిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ ఇతర విధివిధానాలపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం ఆఖర్లో సరికొత్త టోల్ వసూలు విధానాన్ని భారత్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం వాహనాల్లో RFID (Radio Frequency Identification) చిప్స్ ఆధారంగా టోల్ వసూలు జరుగుతోంది.
అయినా కానీ ట్రాఫిక్ పూర్తిస్థాయిలో తగ్గడం లేదు. వాహనాలకు ఎలాంటి అంతరాలు ఏర్పడకుండా ఉండేందుకు ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను మార్పులు చేసి కొత్త జీపీఎస్ టోల్ విధానాన్ని కేంద్రం అమలు చేయనుంది. ఫాస్టాగ్ అమల్లోకి వచ్చిన మూడేళ్ల తర్వాత దేశవ్యాప్తంగా NHAI టోల్ ప్లాజాల వద్ద జీపీఎస్ ఆధారిత వ్యవస్థను తీసుకురావాలని కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చింది. అందుకు అనుగుణంగా చర్యలు కొనసాగుతున్నాయి.

జీపీఎస్ టోల్ చెల్లింపు కోసం వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా కొత్త విధానం మరింత సౌలభ్యంగా ఉండనుంది. జాతీయ రహదారులపై ఉన్న అన్ని ఫిజికల్ టోల్ బూత్‌లను తొలగించి ఆ సెక్షన్ల గుండా ఎలాంటి అడ్డంకులు లేకుండా జీపీఎస్ ఆధారిత వాహనాలు వెళ్లేందుకు ఈ విధానం వీలు కల్పిస్తుంది. ఈ వ్యవస్థను అమలు చేయాల్సిన ఏజెన్సీ ఇంకా ఖరారు కాలేదు.
దేశవ్యాప్తంగా జీఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ మేనేజ్మెంట్ వ్యవస్థను అమలు చేయగల పెద్ద గ్లోబల్ కంపెనీల నుంచి గత నెలలోనే టెండర్లను ఆహ్వానించింది. రెండేళ్లలోనే దాదాపు 50,000 కిలోమీటర్ల భారత జాతీయ రహదారి నెట్‌వర్క్‌ని కవర్ చేయాలని టెండర్ లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త జీఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫాస్టాగ్ వ్యవస్థలోని కొన్ని నష్టాలను తొలగిస్తుందని నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.

తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యవస్థ ద్వారా రూ.10,000 కోట్లు అధిక ఆదాయం వస్తుందని తెలిపారు. అంతే కాకుండా ఈ వ్యవస్థలో ఉన్న 99 శాతం లొసుగులను తొలగిస్తుందన్నారు. ఈ విధానంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టోల్ వసూళ్లలో పారదర్శక, గుణాత్మక, జవాబుదారీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
GPS టోల్ కలెక్షన్ ఎలా పనిచేస్తుంది: GNSS ఆధారిత వ్యవస్థలో హైబ్రిడ్ మోడల్‌ని ఉపయోగించి ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ ఎకోసిస్టమ్ సహాయంతో తొలుత ఈ టోల్ వసూలు అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) సహాయంతో పాటు హైబ్రిడ్ మోడల్‌ని మిక్స్ చేస్తారు. ఈ విధానం ద్వారా హైవేల్లోని టోల్ సెక్షన్లలోకి ఏదైనా వాహనం ప్రవేశించిన లేదా నిష్క్రమించినా ట్రాక్ చేయడానికి వర్చువల్ టోల్ బూత్‌లు ఉంటాయి.
ఈ టోలింగ్ వ్యవస్థ కోసం ప్రారంభంలో ఫాస్టాగ్-ఓన్లీ లేన్లు ఉన్నట్లే GNSS ఆధారిత టోల్ వసూళ్ల కోసం NHAI ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేయనుంది. టోల్ గేట్ల వద్ద లేన్లను జీఎన్ఎస్ఎస్ లేన్లుగా మారుస్తారు. ముందుగా ఆ రోడ్డు నెట్‌వర్క్‌లోని టోల్డ్ సెక్షన్ వెంబడి వర్చువల్ గాంట్రీలను ఏర్పాటు చేస్తారు. రిజిస్ట్రేషన్ నంబర్, వాహన రకం ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలను అప్పటికే వర్చువల్ గాంట్రీలు సేకరిస్తాయి.
వాహనాలు ఈ వర్చువల్ టోల్ బూత్‌ల గుండా వెళతాయి. అప్పుడే GNSS ఆధారిత వ్యవస్థ ఆటోమేటిక్‌గా వినియోగదారుల బ్యాంక్ ఖాతా నుంచి కొంత మొత్తాన్ని తీసుకుంటుంది. టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేకమైన జీఎన్ఎస్ఎస్ లేన్లు ఉంటాయి. ఇవి సాంకేతికతను ఉపయోగించి వాహనాలు సజావుగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తాయి. ఇందులో ఉన్న సౌలభ్యం ఏటంటే కేవలం మీరు ప్రయాణించిన దూరానికే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








