ఇకపై ఫాస్టాగ్ పనిచేయక పోవచ్చు.. అతి త్వరలోనే జీపీఎస్ టోల్‌టాక్స్ వసూలుకి శ్రీకారం
దేశంలో సరికొత్త గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టోల్ వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా సమూలంగా మార్పుచేయబోతుంది. తాజాగా ఇందుకోసం అంతర్జాతీయ టెండర్ ను ఆహ్వానించింది. అసలు ఈ సరికొత్త శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ అంటే ఏమిటి? ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ తేడా ఏమిటి? దీనికి సంబంధించిన వివరాలపై ఓ లుక్కేద్దాం.
భారతదేశంలో రహదారులు అనే అంశం భారత ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద వెన్నెముకగా ఉంది. దేశీయ రాకపోకలకు ఈ రహదారులు ప్రధాన మార్గాలుగా ఉన్నాయి. నిత్యం లక్షలాది వాహనాలు దేశంలో రాకపోకలను సాగిస్తున్నాయి. ఈ రహదారిపై తిరిగే వాహనాలకు టోల్ వసూలు చేస్తున్నారు. వాహనాల కెపాసిటీ, డిజైన్ ని బట్టి టోల్ ఫీజును ప్రస్తుతం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వసూలు చేస్తుంది.

2019 డిసెంబర్‌కి ముందు టోల్‌గేట్ల వద్ద నేరుగా నగదు వసూలు చేసేవారు. ఆ తర్వాత టోల్ ప్లాజాల వద్ద రద్దీని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం భారత్‌లో 99 శాతం వాహనాలకు ఫాస్టాగ్ చిప్స్ అమర్చారు. దీంతో వాహన యజమాని బ్యాంకు ఖాతా నుంచి నేరుగా డబ్బులు కట్ అవుతాయి. అంతే కాకుండా రీఛార్జ్, బ్యాలెన్స్ ఇతర సర్వీసులన్నీ ఫాస్టాగ్ ద్వారా ప్రజలు వినియోగించుకుంటున్నారు.
ఈ ఫాస్టాగ్‌ల ద్వారా టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో టోల్ ప్లాజాల వద్ద పొడవైన వాహనాల క్యూలు కనిపిస్తున్నాయి. దీనికి పరిష్కారంగా టోల్ ప్లాజాలను పూర్తిగా తొలగించి హైవేలపై వాహనాలు ప్రయాణించే దూరానికి మాత్రమే టోల్ వసూలు చేసే కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే పలుమార్లు పలుమార్లు స్పందించారు. ఈ టెక్నాలజీని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనే కొత్త టెక్నాలజీని భారత్‌లో అమలు చేయగల పలు కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానిస్తుంది. అంతే కాకుండా అతి త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి ఖర్చు నిర్వాహణ వ్యయంపై కేంద్రం నిర్ణయం తీసుకోనుంది.
ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం భారతదేశం అంతటా టోల్ ప్లాజాల వద్ద గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GPS) ద్వారా టోల్ చెల్లించే వాహనాలకు ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా టోల్ ప్లాజా వద్ద టోల్ చెల్లించే సమయాన్ని తగ్గించడంతో పాటు అందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. అతి త్వరలోనే జీపీఎస్ టోల్ లైన్స్‌ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు.
అదే సమయంలో ప్రస్తుతమున్న ఫాస్టాగ్ విధానంలో ఫీజు వసూలు వ్యవస్థను కూడా కొనసాగించనున్నారు. ఈ విధంగా ఫాస్టాగ్ కార్డులను ఉపయోగించి చెల్లించాలనుకునే వారు ఛార్జీలు చెల్లించి ప్రయాణం కొనసాగించవచ్చు. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా చెల్లించాలనుకునే వారికి ప్రత్యేక రాయితీలు ఇవ్వనున్నారు. జీపీఎస్ టోల్‌గేట్ పేమెంట్స్‌ని పెంచేందుకు ఈ డిస్కౌంట్స్‌ని అందించనున్నట్లు తెలుస్తోంది.
ఇందుకు తగిన సాంకేతిక టెక్నాలజీ, ఇతర అర్హతలు కలిగిన కంపెనీల నుంచి టెండర్లు స్వీకరించిన తర్వాతే పూర్తి బడ్జెట్‌ని కేటాయించనున్నారు. భారతదేశంలో ఈ వ్యవస్థను తీసుకురావడానికి వివిధ సమర్థ కంపెనీలు ముందుకు వస్తే, టెండర్ ప్రక్రియ ద్వారా అమలు చేస్తారు. భారతదేశంలో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా టోల్ వసూలు వ్యవస్థను ఎలా అమలు చేయనున్నారు? పూర్తి అంశాలపై కేంద్ర ప్రభుత్వం వివరాలు తెలుసుకోనుంది.


Click it and Unblock the Notifications








