ఊహించని విధంగా రైతులకు పెద్ద గిఫ్ట్ ఇచ్చిన జీఎస్టీ కౌన్సిల్.. ఇక వ్యవసాయ రంగానికి పండగే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అధ్యక్షతన జరిగిన జీఎస్టీ (GST) కౌన్సిల్ 56వ సమావేశంలో వస్తు-సేవల పన్ను వ్యవస్థలో ఒక పెద్ద మలుపు తిరిగింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న నాలుగు శ్లాబులను తగ్గించి, ఇకపై కేవలం రెండు శ్లాబులకే పరిమితం చేయాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అంటే, ప్రస్తుతం ఉన్న 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం శ్లాబుల బదులు, ఇకపై కేవలం 5 శాతం, 18 శాతం మాత్రమే అమలులో ఉంటాయి. ఈ నిర్ణయంతో 12 శాతం, 28 శాతం శ్రేణులు పూర్తిగా రద్దు కాబోతున్నాయి. దీని ప్రభావం అత్యధికంగా ఆటోమొబైల్ రంగంపై పడనుంది. ఇప్పటివరకు 28 శాతం పన్ను విధిస్తున్న కొన్ని రకాల కార్లు, ద్విచక్ర వాహనాలపై జీఎస్టీని నేరుగా 18 శాతానికి తగ్గించారు.
అంటే చిన్న కార్లు, హైబ్రిడ్ కార్లు, అలాగే అన్ని రకాల బైకులు, స్కూటర్లు ఇకపై తక్కువ జీఎస్టీ కిందకు వస్తాయి. పన్ను తగ్గడంతో వీటి ధరలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ధరలు తగ్గితే సహజంగానే మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటికే వాహన రంగం పుంజుకుంటున్న దిశగా కదులుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం, రాబోయే నెలల్లో అమ్మకాలకు మరింత ఊతమివ్వనుంది.

కార్లు, ద్విచక్ర వాహనాలతో పాటు ట్రాక్టర్ల విషయంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ట్రాక్టర్లు వ్యవసాయానికి సంబంధించిన కీలక పరికరాలు కావడంతో ఇంతకు ముందే వాటిపై తక్కువ జీఎస్టీ విధిస్తూ వచ్చారు. ఇప్పుడు పన్ను శ్రేణుల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ట్రాక్టర్లపై కూడా గణనీయమైన తగ్గింపు జరిగింది. దీనివల్ల రైతులకు మరింత ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఈ కొత్త నిర్ణయాలతో సాధారణ వినియోగదారులు, రైతులు, అలాగే ఆటోమొబైల్ పరిశ్రమ మొత్తం లాభపడనుంది.
ఇప్పటివరకు ఇతర వాహనాలపై 28% జీఎస్టీ వసూలు చేస్తూ వస్తే, ట్రాక్టర్లపై మాత్రం కేవలం 12% పన్ను మాత్రమే విధించేవారు. రైతుల భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఈసారి ట్రాక్టర్లపై కూడా మరోసారి భారీ రాయితీ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న 12% జీఎస్టీని కేవలం 5%కి తగ్గించారు. అంటే 7% తగ్గింపుతో సాధారణ ట్రాక్టర్ల ధరలు మరింతగా తగ్గనున్నాయి. అయితే, ఈ తగ్గింపు అన్ని రకాల ట్రాక్టర్లకు వర్తించదు.

వెనుక భాగంలో లోడ్లు మోసేందుకు ఉపయోగించే సెమీ-ట్రైలర్‌కు అనుసంధానించే ట్రాక్టర్లు, అలాగే 1800సీసీ కంటే ఎక్కువ శక్తివంతమైన ఇంజిన్ కలిగిన ట్రాక్టర్లు మాత్రం ఈ కిందికి రావు. వీటిపై ఇంతకు ముందు 28% జీఎస్టీ విధించేవారు. ఇప్పుడు దానిని 18%కి తగ్గించారు. అంటే ఈ వర్గానికి చెందిన ట్రాక్టర్లపై కూడా కొంత ఊరట లభించనుంది. కేవలం ట్రాక్టర్లకే కాదు, వాటి విడిభాగాలపై కూడా పన్ను తగ్గింపులు చోటు చేసుకున్నాయి.
దీని వలన రైతులు ట్రాక్టర్ల కొనుగోలు ఖర్చులోనే కాకుండా, భవిష్యత్తులో మెయింటెనెన్స్ ఖర్చులో కూడా ఆదా చేసుకోగలరు. ఇప్పటివరకు ట్రాక్టర్ టైర్లు, ఇతర విడిభాగాలపై 18% పన్ను విధించగా, ఇప్పుడు వాటిని గణనీయంగా తగ్గించారు. ట్రాక్టర్లపై మాత్రమే కాకుండా, విస్తృతంగా ఉపయోగించే ఇతర వ్యవసాయ యంత్రాలపై కూడా ఈ పన్ను కోతలు అమలులోకి వచ్చాయి.

దీని ప్రకారం, రైతులు వినియోగించే నేల తయారీ పరికరాలు, కోత యంత్రాలు, నూర్పిడి & బేలర్లు, గడ్డి రవాణా యంత్రాలు, కంపోస్టింగ్ పరికరాలు వంటి వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీని 12% నుండి కేవలం 5%కి తగ్గించారు. అంటే, రైతులు తమ వ్యవసాయ పనుల కోసం కొనుగోలు చేసే యంత్రాలను ఇకపై తక్కువ ధరకే పొందే అవకాశం ఉంది.
ఈ తగ్గింపులు కేవలం తక్షణ ఉపశమనం ఇవ్వడమే కాకుండా, రాబోయే కాలంలో వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులను కూడా తగ్గిస్తాయి. ఉత్పత్తి ఖర్చు తగ్గితే, రైతులకు లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, తక్కువ ధరల్లో యంత్రాలు అందుబాటులోకి రావడం వల్ల మరింతమంది రైతులు ఆధునిక పరికరాల వినియోగం వైపు అడుగులు వేయగలరు.


Click it and Unblock the Notifications








