దేశంలో ఇకపై పెట్రోల్, డీజిల్ వాహనాలుండవు.. వాటిపై జీఎస్టీ తగ్గింపు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
దేశంలో ఇకపై పెట్రోల్, డీజిల్ వాహనాలు ఉండబోవని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రభుత్వ ప్రణాళికల్లో భాగంగా దేశాన్ని హరిత ఆర్థిక వ్యవస్థ దిశగా పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలను గడ్కరీ వెల్లడించారు. పూర్తి సమాచారం ఈ కథనంలో..
దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రీన్ ఇండియా(Green Mobility) లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందుకోసం హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను(Hybrid, Electric Vehicles) ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. త్వరలో భారత్‌ను పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల నుంచి పూర్తిగా విముక్తి కల్పిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈవీ, హైబ్రిడ్ వాహనాలను ప్రోత్సహించేదిశగా.. హైబ్రిడ్ వాహనాలపై జీఎస్‌టీని తగ్గించాలనుకుంటున్నట్లు గడ్కరీ అన్నారు. దేశంలో ఇప్పటివరకూ 36 కోట్ల సాంప్రదాయక ఇంధన వాహనాలున్నాయని చెప్పారు. పెట్రోలు, డీజిల్ కార్లను పూర్తిగా వదిలించుకోవడం కష్టమైనా అసాధ్యం కాదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంధన దిగుమతులపై భారత్ రూ.16 లక్షల కోట్లు వెచ్చిస్తోందని గడ్కరీ పేర్కొన్నారు.
హైబ్రిడ్, ఈవీలను ప్రోత్సహించడం ద్వారా ఆ డబ్బుతో.. రైతుల జీవితాలను మెరుగుపరచడానికి, గ్రామాలు అభివృద్ధి చెందడానికి మరియు పేదలకు ఉపాధి పెంచడానికి ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో జీవ ఇంధనాలు మరియు ప్రత్యామ్నాయ ఇంధనాల(Green Inida) సమగ్ర అన్వేషణకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంపూర్ణ మద్దతు పలికారు.

హైబ్రిడ్ వాహనాలపై జీఎస్‌టీని ఐదు శాతానికి, ఫ్లెక్స్ ఇంజిన్‌లపై 12 శాతానికి తగ్గించే ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపినట్లు గడ్కరీ చెప్పారు. ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉందని ఆయన అన్నారు. జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశంలో ఇంధన దిగుమతులు పూర్తిగా తగ్గిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా.. 2004 నుంచి ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం ప్రయత్నిస్తున్నానని, రాబోయే సంవత్సరాల్లో పరిస్థితులు మారిపోయి దేశం పూర్తిగా పర్యావరణ హితంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ మార్పులు ఈ సంవత్సరంలోగా జరుగుతాయని గ్యారంటీగా చెప్పలేనని.. కానీ ఖచ్చితంగా జరుగుతుందని గడ్కరీ స్పష్టం చేశారు.

దేశంలో ఈవీలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా.. త్వరలో బయో ఫ్యూయెల్స్ అందుబాటులోకి వస్తాయని, ఈ కల నెరవేరుతుందని గట్టిగా నమ్ముతున్నట్లు గడ్కరీ చెప్పారు. కాగా ప్రముఖ ఆటో మేజర్లు బజాజ్, టీవీఎస్ మరియు హీరో కూడా ఫ్లెక్స్ ఇంజిన్‌లను ఉపయోగించి మోటార్‌సైకిళ్లను తయారు చేయాలని యోచిస్తున్నారని గడ్కరీ అన్నారు. ఇదే సాంకేతికతతో త్వరలో ఆటో రిక్షాలు కూడా వస్తాయన్నారు.
ఇప్పుడు తాను హెడ్రోజన్‌తో నడిచే కారులో తిరుగుతున్నానని.. త్వరలో ప్రతి ఇంట్లో ఎలక్ట్రిక్ కార్లు కనిపిస్తాయని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. టాటా మోటార్స్ మరియు అశోక్ లేలాండ్ హైడ్రోజన్‌తో నడిచే ట్రక్కులను ప్రవేశపెట్టగా.. LNG/CNGతో నడిచే ట్రక్కులు కూడా దేశంలో తిరుగుతున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 350 బయో-సీఎన్‌జీ ఫ్యాక్టరీలు ఉన్నాయని వెల్లడించారు.

పెట్రోల్, డీజిల్ వాహనాల అంతం కోసం ఓ విప్లవం జరుగుతోందని.. ఈ దేశం స్వావలంబన ఆత్మనిర్భర్ భారత్‌గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రీన్ మొబిలిటీని పెంచడానికి పర్యావరణ కార్యకర్తలు దృష్టి సారించడాన్ని గడ్కరీ స్వాగతించారు. అయితే ఇప్పటికీ ఎలక్ట్రిక్ కార్లను శక్తివంతం చేయడానికి శిలాజ ఇంధన ఆధారిత ఇంధన వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడుతున్నామని.. దీనిని మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications








