గుంటూరు వ్యక్తి సంచలనం..దేశ చరిత్రలోనే కనివినీ ఎరుగని రికార్డు..ఒక్క నెంబర్ ప్లేట్ ధర రూ.2.08 కోట్లు
భారతదేశంలో వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు ఉండటం ఒక స్టేటస్ సింబల్. తమకు ఇష్టమైన నంబర్ కోసం లక్షలు ఖర్చు చేయడం మనం చూస్తుంటాం. కానీ, ఇప్పుడు ఒక వ్యక్తి కేవలం ఒక నంబర్ ప్లేట్ కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన కిరణ్ కొల్పకుల అనే వ్యక్తి, DDC 001 అనే వింటేజ్ నంబర్ ప్లేట్‌ను ఏకంగా రూ.2.08 కోట్లకు వేలంలో దక్కించుకున్నారు. ఇది భారతదేశంలో ఇప్పటివరకు ఒక వాహన రిజిస్ట్రేషన్ నంబర్ కోసం జరిగిన అత్యంత ఖరీదైన డీల్‌గా చరిత్ర సృష్టించింది.
వేలం పాటలో చరిత్ర సృష్టించిన బిగ్ బాయ్ టాయ్స్ ప్రముఖ లగ్జరీ కార్ల డీలర్‌షిప్ సంస్థ బిగ్ బాయ్ టాయ్స్ ఇటీవలే తన కొత్త విభాగం ఆక్షన్ హౌస్‌ను ప్రారంభించింది. ఈ వేదిక ద్వారా అత్యంత అరుదైన, విలాసవంతమైన వస్తువులను వేలం వేస్తున్నారు. ఈ క్రమంలోనే సంస్థ యజమాని జతిన్ అహూజాకు చెందిన పాతకాలపు నంబర్ ప్లేట్ DDC 001 వేలానికి వచ్చింది.

ఈ నంబర్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సంపన్నులు పోటీ పడ్డారు. కానీ చివరకు గుంటూరుకు చెందిన కిరణ్ భారీ ధరను ఆఫర్ చేసి ఈ ప్రతిష్టాత్మక నంబర్‌ను తన సొంతం చేసుకున్నారు.
సాధారణంగా ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందులోనూ 001 వంటి నంబర్లు రాజరికానికి, అధికారాన్ని ప్రతిబింబించేవిగా భావిస్తారు. DDC 001 అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు, అదొక వింటేజ్ కలెక్టబుల్. ఇలాంటి అరుదైన వస్తువులను సేకరించేవారు ఎంత ధరకైనా వెనకాడరని ఈ డీల్ నిరూపించింది.
గతంలో హర్యానాలో ఒక నంబర్ కోటి రూపాయలకు పైగా ధర పలికినప్పటికీ, ఆ బిడ్డర్ నగదు చెల్లించకపోవడంతో ఆ డీల్ రద్దయింది. కానీ ఈ తాజా డీల్ పారదర్శకంగా జరిగిందని, ఇది ఒక కొత్త రికార్డు అని బిగ్ బాయ్ టాయ్స్ ప్రకటించింది.
బిగ్ బాయ్ టాయ్స్ ఆక్షన్ హౌస్ కేవలం నంబర్ ప్లేట్లు మాత్రమే కాకుండా, ప్రముఖ సెలబ్రిటీలు వాడిన లగ్జరీ కార్లను కూడా వేలంలో ఉంచింది. ఇందులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి చెందిన మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600, ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి వాడిన మెర్సిడెస్ బెంజ్ CLA 200d, క్రికెటర్ దినేష్ కార్తీక్ కు చెందిన రేంజ్ రోవర్ స్పోర్ట్ SVR వంటి కార్లు ఉన్నాయి.
వీటితో పాటు హుబ్లాట్, రోలెక్స్ వంటి అత్యంత ఖరీదైన గడియారాలు, 999999999X వంటి అరుదైన మొబైల్ నంబర్లు కూడా ఈ వేలంలో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. లగ్జరీ మార్కెట్లో ఏపీ వాసుల జోరు ఈ వేలం పాట ద్వారా దేశంలోని టైర్-2 పట్టణాల్లో కూడా లగ్జరీ వస్తువులకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతోంది.
గుంటూరు వంటి పట్టణం నుంచి వచ్చి ఇంత పెద్ద మొత్తంలో నంబర్ ప్లేట్ కోసం ఖర్చు చేయడం పట్ల ఆటోమొబైల్ నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాయ్ టాయ్స్ వ్యవస్థాపకుడు జతిన్ అహూజా స్పందిస్తూ.. "భారతీయ కలెక్టర్లు నాణ్యమైన, అరుదైన వస్తువుల కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ వేలం నిరూపించింది" అని వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications








