అదృష్టం అంటే వీళ్లదే.. బాస్ మనసు గెలిచి.. దీపావళికి లక్షల విలవైన కార్లనే సొంతం చేసుకున్నారు
అంకిత భావంతో పని చేస్తూ కంపెనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులకు ఖరీదైన కార్లు, బైకులను గిఫ్ట్‌లుగా ఇవ్వడం ఇటీవల కాలంలో ఎక్కడో ఒక చోట వినపడుతుంది. ఇప్పటికే కొద్ది రోజుల క్రితం చైన్నైలో ఒక కంపెనీ తన ఉద్యోగులకు ఇదే విధంగా గిఫ్ట్‌లను అందించి అందర్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేయగా, ఇప్పుడు దీపావళికి ఒక వారం ముందు హర్యానాకు చెందిన ఒక కంపెనీ అంకితభావంతో పనిచేసే తన ఉద్యోగులకు 15 కార్లను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచింది. వీటిని అందుకున్న ఉద్యోగుల ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. ఉద్యోగులకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వని కంపెనీలు ఉన్న కాలంలో ఏకంగా లక్షలు విలువ చేసే ఖరీదైన కార్లను గిఫ్ట్‌లుగా ఇవ్వడంతో ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
హర్యానాలోని పంచకుల ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఫార్మాస్యూటికల్ తయారీ కంపెనీ మిట్స్ హెల్త్‌కేర్ (mits healthcare), అధినేత ఎంకే భాటియా తన ఉద్యోగులకు కార్లను అందించి ఈ వార్తకు తెరలేపారు. ఆయనే స్వయంగా మొత్తం 15 మంది ఉద్యోగులకు కొత్త కార్ల తాళాలు అందించారు. గిఫ్ట్‌లుగా ఇచ్చిన వాటిలో 13 టాటా పంచ్, 2 మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా కార్లు ఉన్నాయి.

కార్లను అందుకున్న సిబ్బంది తమ బాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా మిట్‌స్కైండ్ హెల్త్‌కేర్‌లో సీనియర్ హెచ్‌ఆర్ ఉద్యోగి వీనస్ మాట్లాడుతూ, బాస్ తమ కష్టాన్ని గుర్తించి దీపావళి పండుగ వేళ కార్లను బహుమతులుగా ఇవ్వడం ఎప్పటికి మర్చిపోలేము. మూడేళ్ళ క్రితం, నేను కంపెనీలో చేరినప్పుడు భాటియా సర్ ఉద్యోగులందరికీ కారు అందించాలనే తన కల గురించి మాకు చెప్పారు. ఈ రోజు ఆ కల నెరవేరిందని అన్నారు.
మిట్‌స్కైండ్ హెల్త్‌కేర్ అధినేత ఎంకే భాటియా ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఉద్యోగులు మాకు సెలబ్రిటీలు, మా రాక్‌స్టార్స్ అని అన్నారు. కంపెనీ విజయానికి వారు చేసిన సహకారానికి గుర్తింపుగా ఇలాంటి బహుమతులు ఇవ్వాలని ఇంతకుముందే నిర్ణయించాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి దీపావళికి ముందు అవకాశం లభించింది. మొదటగా ఎక్కువగా ఫ్రెషర్‌లను నియమించుకుని వారికి శిక్షణ ఇస్తామని భాటియా చెప్పారు.

పనిలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారిని పై స్థాయికి ప్రమోట్ చేస్తాం. పనితీరు ఆధారంగా వారు ప్రెసిడెంట్, డైరెక్టర్లుగా మారతారు. ఉద్యోగులందరూ 28 ఏళ్ల లోపు వారేనని, ఈ ఏడాది కార్లు పొందిన మొత్తం 15 మంది ఉద్యోగులు నాలుగు నెలల క్రితమే డైరెక్టర్లుగా పదోన్నతి పొందారు. వచ్చే ఏడాది 50 కార్లను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాం అని భాటియా పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చిన టాటా పంచ్(Tata punch) కారు ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఈ ఎస్‌యూవీ ధర రూ.6.13 నుండి రూ.10.15 లక్షల ఎక్స్-షోరూమ్ మధ్య ఉంటుంది. టాటా పంచ్ SUV 1.2-లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్ ఆప్షన్లలో వస్తుంది. ఈ కారులో 5 మంది సులభంగా ప్రయాణించవచ్చు. ఇది 19 నుంచి 26.99 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది. దీనిలో సరికొత్త ఫీచర్లు ఉన్నాయి.

మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా(Maruti suzuki grand vitara), SUVలలో మంచి డిమాండ్ ఉన్న కారు. దీనిలో 5 మంది సులభంగా ప్రయాణించవచ్చు. మైలేజ్ కూడా 19.38 నుండి 27.97 కి.మీ వరకు వస్తుంది. ఇది హైబ్రిడ్, CNG ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది. ధర రూ.10.99 నుండి రూ.20.09 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.
గ్రాండ్ విటారాలో పనోరమిక్ సన్‌రూఫ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా, ఇది 6-ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ డిసెంట్ కంట్రోల్, చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీ కెమెరాను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








