అవిభక్త కవలల గురించి విన్నారు.. కానీ అవిభక్త మారుతి 800 కారు గురించి ఎప్పుడైనా విన్నారా..?
అవిభక్త కవలల (Conjoined Twins) గురించి మనం అప్పుడప్పుడూ వార్తలలో వింటూ ఉంటాం. ఈ మధ్య సూర్య కూడా బ్రదర్స్ అనే చిత్రంలో ఇదే కాన్సెప్ట్ పై నటించాడు. అవిభక్త కవలల గురించి సింపుల్ గా చెప్పాలంటే, విడదీయడానికి వీలు లేకుండా (కొన్ని సందర్భాలలో ఆపరేషన్ ద్వారా వేరు చేయవచ్చు) గర్భంలోనే శరీరభాగాలు కలసిపోయి జన్మించిన ఏకరూప కవలలను కన్జాయిన్డ్ ట్విన్స్ లేదా సియామీస్ ట్విన్స్ అని పిలుస్తారు. తెలుగులో వీరిని అవిభక్త కవలలు అంటారు. అసలు ఆటోమొబైల్స్ కి అవిభక్త కవలలకి సంబంధం ఏంటా అనుకుంటున్నారా.. అదే ఆ పాయింట్ కే వస్తున్నా..!

ఈ ఫొటోలలో కనిపిస్తున్న కారును చూడండి, రెండు కార్లు ఒకదానిలో ఒకటి కలిసిపోయి ఒకే కారులా తయారైనట్లు లేదూ. నిజానికి ఇదేదో తయారీ లోపమో లేక మరేదైనా లోపమో కాదు. ఈ కారును కావాలనే ఇలా తయారు చేశారు. కార్ కస్టమైజేషన్ ప్రక్రియలో భాగంగా, ఇంజనీర్లు ఈ మోడల్ ను రూపొందించారు. మారుతి సుజుకి సంస్థ తయారు చేసిన ప్రసిద్ధ 800 కార్లను రెండింటిని పక్కనే జోడించి, మధ్య భాగంలో డోర్లను మరియు చక్రాలను తొలగించి ఇలా రూపొందించారు.
వాహన ప్రియులలో చాలా మంది తమ వాహనం ఇతర వాహనాల కన్నా భిన్నంగా మరియు విశిష్టంగా కనిపించేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి ఆలోచనల నుంచి పుట్టొకొచ్చిందే ఈ అవిభక్త మారుతి 800. ఈ కస్టమైజ్డ్ కారు పేరు సుజుకి మెహ్రాన్ (Suzuki Mehran). ఈ పేరు వినగానే ఇదేదొ కొత్త మోడల్ అనుకునేరు, ఇది మనదేశంలో లభించే మారుతి 800 (Maruti 800) మోడల్ లాంటిదే. జపనీస్ కార్ బ్రాండ్ సుజుకి ఈ కారును సుజుకి మెహ్రాన్ పేరుతో మన పొరుగు దేశమైన పాకిస్థాన్ మార్కెట్లో విక్రయిస్తోంది.

కాగా, పాకిస్థాన్ లోని ఓ ఔత్సాహిక కార్ మోడిఫైయర్ రెండు సుజుకి మెహ్రాన్ కార్లను ఒక్కటిగా అతికించి, ఇలా తయారు చేశారు. ప్రస్తుతం, ఈ కస్టమైజ్డ్ సుజుకి మెహ్రాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి చెందిన హమ్దాన్ బిన్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ యాజమాన్యంలో ఉంది. ఇప్పుడు ఇది అక్కడి వారితో పాటుగా యావత్ నెటిజెన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. నహ్యాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు. ఈ కారు పక్కనే పార్క్ చేయబడి ఉన్న ఓ క్లాసిక్ కారును చూస్తే, అతను కారు ప్రియుడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
నహ్యాన్ కార్ గ్యారేజ్ వివిధ రకాల క్లాసిక్ కార్లతో పాటుగా పలు కస్టమైజ్డ్ కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. సాధారణంగా కస్టమైజ్డ్ కార్లను పొడవుగా తయారు చేసి, అధిక సీట్లతో లేదా ఎక్కువ క్యాబిన్ రూమ్ తో ఉండే వాటిని లీమోజైన్ (Limousine) అంటారు. కానీ, సుజుకి మెహ్రాన్ విషయంలో కార్ కస్టమైజర్లు విభిన్నంగా ఆలోచించి, రెండు కార్లను పక్కపక్కనే ఉంచి వెడల్పుగా ఉండే లీమోజైన్ లా తయారు చేశారు.
నిజానికి, ఇలా రెండు కార్లను పక్కపక్కనే ఉంచి ఒక్క కారులో తయారు చేయడం చాలా సులభమైన పనిలా అనిపించవచ్చు. వారు కేవలం ఈ రెండింటినీ 'వెల్డింగ్' చేసి ఉంటారని మీరు అనుకోవచ్చు. కానీ వాస్తవం ఏంటో ఈ ఫొటోలను క్షుణ్ణంగా గమనిస్తే అర్థమవుతుంది. ఈ ఫోటోలను చూస్తుంటే రెండు కార్లు అటాచ్ చేయబడిన ప్రాంతంలో ఒక కారుకి కుడి వైపు డోర్లు మరొక కారుకి ఎడమ వైపు డోర్లు తొలగించారు.

అలాగే, ఇరు వైపులా మధ్యకు వచ్చే చక్రాలను కూడా తొలగించారు. డ్యాష్‌బోర్డులో ఒకే స్టీరింగ్ వీల్ మరియు ఒకే కారులో ఇంజన్ ఉండేలా డిజైన్ చేశారు. కారు వెడల్పు పెరిగిన కారణంగా రెండు కార్లను అనుసంధానించే చక్రాల మధ్యలో ప్రత్యేకమైన యాక్సిల్స్ ఉపయోగించారు. ఎడమ వైపు కనిపించే కారులో స్టీరింగ్, ఇంజన్ ఉండదు కేవలం వెడల్పాటి సీట్లు మాత్రమే ఉంచాయి.
అంతేకాకుండా, ఈ కారు యొక్క ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లను కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయేలా కస్టమైజ్ చేశారు. ఇప్పుడు సుజుకి లోగో రెండు కార్ల మధ్యలో కనిపిస్తుంది. ఈ మోడిఫికేషన్ ప్రక్రియ మొత్తం చాలా నీట్ గా మరియు క్లీన్ గా చేసినట్లు కనిపిస్తుంది. ఎక్కడా అతుకులు కనిపించకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఈ మోడిఫైడ్ కారులో 4 చక్రాలు మాత్రమే ఉంటాయి. ఈ యాక్సిల్, సస్పెన్షన్ మరియు బ్రేక్ సెటప్ లలో ఎక్కువగా మార్పులు చేయబడ్డాయి.

ఈ మోడిఫైడ్ కారు అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ, ఇది చట్టబద్ధంగా అనుమతించబడుతుందా అంటే, దీని సమాధానం మాత్రం ఖచ్చితంగా కాదనే చెప్పాలి. సాధారణంగా, ఇలా రెండు కార్లను కలిపి కనెక్ట్ చేయడం ద్వారా దాని వెడల్పును రెట్టింపు అవుతుంది. ఫలితంగా, రోడ్లపై ఇది ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి, ఇతర వాహనాలకు అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా ఇరుకైన రోడ్లపై ఇలాంటి వెడల్పాటి కారులో ప్రయాణించడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి, ఈ స్ఫెషల్ కారు కేవలం రోడ్ షోలు మరియు స్పెషల్ ఈవెంట్లలో ప్రదర్శించడానికి మాత్రమే ఓ షో పీస్ లా పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications








