సొంత ఖర్చులతో విద్యార్థులను విమానం ఎక్కించిన హెడ్ మాస్టర్.. శభాష్ అంటూ నెటిజన్ల కామెంట్స్.!!
ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తన సొంత ఖర్చులతో విద్యార్థులను విమానం ఎక్కించాడు. తన విద్యార్థుల కలను నెరవేరుస్తూ వారి ముఖాల్లో చిరునవ్వును, పట్టలేని సంతోషాన్ని నింపాడు. ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
ప్రతి ఒక్కరికీ జీవితంలో ఒక్క సారైనా విమానం ఎక్కాలనే కల ఉంటుంది. అందుకే చిన్నప్పుడు ఆకాశంలో విమానం ఎగురుతూ ఉంటే.. ఎన్ని పనులు ఉన్నా మానుకుని ఎగురుతున్న విమానాన్ని చూస్తూ సరదా పడతాం. అయితే ధనవంతులకు విమాన ప్రయాణం సులభమే.. కానీ పేద ప్రజలకు ఇది కలగానే ఉంటుంది.

ఇటీవల ఓటీటీలో విడుదలైన విమానం సినిమా.. ఓ పేద చిన్నారి కలకు సంబంధించింది. కటిక పేదరికంలో పుట్టిన ఓ తండ్రి.. తన కొడుకు విమానంలో ఎక్కాలనే కలను నెరవేర్చేందుకు ఉన్న ఇంటిని అమ్ముకుంటాడు. తీరా కొడుకుతో కలిసి విమానం ఎక్కిన తర్వాత చనిపోతాడు. భావోద్వేగాలతో నిండిన ఈ సినిమా ప్రతి ఒక్కరి మనసునీ కదిలిస్తుంది.

అంతే కాకుండా ఇటీవల విడుదలైన సూర్య సినిమా ఆకాశమే హద్దుగా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో కథానాయకుడు తన పట్టణంలోని పేద ప్రజలను విమానంలో తీసుకెళ్లాలనే ఆలోచనతో విమానయాన సంస్థను ప్రారంభిస్తాడు. కేవలం ఒక్క రూపాయితో పేదలకు విమాన ప్రయాణ సౌకర్యం కల్పిస్తాడు. దాదాపు ఇలాంటి సంఘటనే కేరళలో చోటుచేసుకుంది.
తెరపై అలా ఓ తండ్రి తన కుమారుడి జీవిత స్వప్నాన్ని నెరవేర్చగా, తన పట్టణంలో నివసించే పేద ప్రజలకు ఉచిత విమానయానం కల్పించగా.. నిజ జీవితంలో తన పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కలను నెరవేర్చాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. ఈ సంఘటనతో ఆ హెడ్‌మాస్టర్ అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

కేరళలోని నారన్మోజీ ప్రాంతంలోని బారువా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న హెడ్ మాస్టర్ అనిల్ బోస్, అతని భార్య అనిల్ మోరాడ్ కలిసి విమానంలో ప్రయాణించే తమ విద్యార్థుల కలను నెరవేర్చారు. ఇందుకోసం తామే సొంతంగా ఖర్చులు భరించారు. మొత్తంగా 32 మంది విద్యార్థులు, 8 మంది ఉపాధ్యాయులు, నలుగురు పాఠశాల సిబ్బంది కలిసి ఇండిగో విమానంలో కొచ్చిన్ విమానాశ్రయం నుంచి తిరువంతపురానికి తీసుకెళ్లారు.

కొచ్చిన్, తిరువంతపురంలో పలు పర్యాటక ప్రాంతాలకు విద్యార్థులు, ఉపాధ్యాయులను తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హెడ్ మాస్టర్ అనిల్ బోస్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. బెస్ట్ టీచర్ అంటూ అభినందిస్తున్నారు. విద్యార్థుల కలను నెరవేర్చిన హెడ్ మాస్టర్ బోస్ కృషి అభినందనీయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రిన్సిపల్ అనిల్ బోస్ తన పాఠశాలలోని విద్యార్థులను విమానం ఎక్కించేందుకు రూ. 2,11,800 వెచ్చించారు. ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. తాము చదువుకునేటప్పుడు ఇలాంటి టీచర్ లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువుకునేటప్పుడు తమకు కూడా ఇలా విమానంలో ప్రయాణించాలనే కోరిక ఉండేదని కామెంట్ చేస్తున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








