47 మంది ఉద్యోగులకు లగ్జరీ కార్లు.. పని చేస్తే ఫలితం ఇలా.. ఆ రాష్ట్రంలో సంచలనం
ఇటీవలి కాలంలో కంపెనీలు తమ ఉద్యోగుల కృషిని గుర్తిస్తూ ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఒక కొత్త ట్రెండ్‌గా మారుతోంది. ముఖ్యంగా గుజరాత్‌లో ఈ తరహా కార్యక్రమాలు ఎక్కువగా కనిపించేవి. అయితే ఇప్పుడు ఈ సాంప్రదాయం క్రమంగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తోంది. తాజాగా కేరళలో చోటుచేసుకున్న ఒక సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేరళకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థ హై లైట్ (HiLITE Group) తమ 30వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించింది. రియల్ ఎస్టేట్, నిర్మాణం, రిటైల్, ఆతిథ్య రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ సంస్థ కేరళలో ఆధునిక పట్టణ సంస్కృతికి ఒక ప్రతీకగా నిలిచింది.
రాష్ట్రంలోని మొదటి వ్యవస్థీకృత రిటైల్ మాల్‌గా గుర్తింపు పొందిన ఫోకస్‌తో ప్రారంభమైన వారి ప్రయాణం, తరువాత హైలైట్ మాల్ కోజికోడ్, హైలెట్ మాల్ త్రిసూర్ వంటి ప్రముఖ వాణిజ్య కేంద్రాల వరకు విస్తరించింది. ఈ 30 ఏళ్ల విజయగాథను గుర్తుగా చేసుకుంటూ సంస్థ తమ కీలక ఉద్యోగులకు అల్ట్రా-లగ్జరీ వాహనాలను బహుమతిగా అందించింది. మొత్తం రూ.20 కోట్లకు పైగా విలువైన వాహనాలు అందజేయడం విశేషం.

బహుమతుల జాబితాలో ప్రపంచప్రసిద్ధ లగ్జరీ SUVలు అయిన Land Rover Defender, Range Rover, Audi వాహనాలు ఉండటం మరింత సంచలనంగా మారింది. సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులకు ఇలాంటి విలాసవంతమైన బహుమతులు అందించడం ద్వారా, కంపెనీ తన కృతజ్ఞతను ప్రత్యేకంగా వ్యక్తం చేసింది. ఈ ఘటనతో కేరళలో కూడా ఉద్యోగుల పట్ల గౌరవాన్ని చాటే కొత్త ధోరణి ప్రారంభమైందని చెప్పవచ్చు.
మొత్తం మీద, ఇది కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా, ఉద్యోగుల కృషికి విలువనిచ్చే సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. హైలెట్ గ్రూప్ అభివృద్ధికి విశేషంగా తోడ్పడిన 47 మంది ఉద్యోగులను సంస్థ అరుదైన విధంగా సత్కరించింది. వారి కృషికి గుర్తింపుగా లగ్జరీ కార్లను బహుమతిగా అందజేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అల్ట్రా-లగ్జరీ వాహనాలతో పాటు టాటా హారియర్, కియా సెల్టోస్ హ్యూందాయ్ క్రెటా, స్కోడా కైలాక్ వంటి SUVలు కూడా ఉన్నాయి.

ఉద్యోగుల ప్రతిభకు ఇలాంటి గుర్తింపు ఇవ్వడం సాధారణ విషయం కాదు. గతంలో దీపావళి సందర్భంగా ఉత్తర భారతదేశంలోని కొన్ని సంస్థలు ఇలాంటి బహుమతులు ఇచ్చిన ఘటనలు కనిపించినా, కేరళలో ఈ స్థాయిలో లగ్జరీ కార్ల బహూకరణ ప్రత్యేకంగా నిలిచింది. ఒక ఉద్యోగి తన కృషికి సంస్థ నుంచి ఇలాంటి గుర్తింపు పొందడం అతనికి మాత్రమే కాకుండా మొత్తం సిబ్బందికి గర్వకారణం.
1996లో కార్యకలాపాలు ప్రారంభించిన హైలైట్ గ్రూప్, కేరళలో నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాల్లో బలమైన స్థానం సంపాదించింది. సంస్థ చైర్మన్ అపు జోసెఫ్ ప్యాలెస్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వాహనాల పంపిణీ వీడియోలను పంచుకోవడం ద్వారా ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చారు. హైలైట్ గ్రూప్ తమ ఉద్యోగులను కేవలం సిబ్బందిగా కాకుండా కుటుంబ సభ్యులుగా భావిస్తామని స్పష్టం చేసింది.

హై లైట్ నిర్వహించిన ఈ వేడుకల్లో సంస్థ భవిష్యత్ దిశను సూచించే ఒక కీలక ప్రకటన కూడా వెలువడింది. 2030 నాటికి కేరళ అంతటా దాదాపు 50 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో పెద్ద స్థాయి విస్తరణ ప్రణాళికగా భావించబడుతోంది. ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే, రాష్ట్రంలో భారీగా ఉపాధి అవకాశాలు సృష్టించబడే అవకాశముంది.


Click it and Unblock the Notifications








