12 అడుగుల ఎత్తుపై నుంచి నీళ్లలోకి పడిపోయిన కారు.. హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ అవ్వడమే కారణమా.?
వర్షాకాలంలో వాటర్ ఫాల్స్, డ్యామ్‌లను చూడటానికి పర్యాటక ప్రియులు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. భారత్‌లో సుందరమైన జలపాతాలు, కొండల మధ్య పారుతున్న సెలయేర్లకు కొదవే లేదు. అందుకే ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదతీరడానికి వారాంతాల్లో ఉవ్లిళ్లూరుతుంటారు. కానీ కొండ ప్రాంతాలకు వెళ్లినప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. లేదంటే అనుకోని ఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని లోధియా కుంట సుందరమైన జలపాతంగా పేరు గాంచింది. అయితే ఇటీవల ప్రమాదవశాత్తు అక్కడ చెరువులో హోండా బ్రియో(Honda Brio) కారు పడిపోయిన ఘటన చోటుచేసుకుంది. దాదాపు 12 అడుగుల ఎత్తుపై నుంచి ఆ కారు పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియోను పరిశీలిస్తే.. హోండా బ్రియో కారు దాదాపు 12 అడుగుల ఎత్తులో ప్రమాదకరంగా పార్క్ చేశారు. అంతేకాకుండా డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేయడంలో విఫలమైనట్లుగా తెలుస్తుంది. దీంతో కారు ముందుకు సాగడంతో అంత ఎత్తు నుంచి నీళ్లలో పడిపోయింది. ఆ సమయంలో కారులో తండ్రీకూతుళ్లు ఉన్నట్లు సమాచారం. అనుకోకుండా అంత ఎత్తు నుంచి చెరువులో పడిపోవడంతో వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
అయితే అక్కడ ఉన్న ఇతర పర్యాటకులు అక్కడి సుందర దృశ్యాలను వీడియో తీస్తుండగా అనుకోకుండా ఈ సంఘటన అందులో రికార్డ్ అయినట్లుగా తెలుస్తోంది. కారు నీళ్లలో పడిపోగానే మళ్లీ పైకి తేలడంతో వెంటనే కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు బయటకు వచ్చారు. సహాయం కోసం కేకలు వేయడంతో, అక్కడే ఉన్న ఇతర పర్యాటకులు వారిని రక్షించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిసింది.

ఇక కారుకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే.. నీటిలో మునిగిపోయిన తర్వాత గణనీయంగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. వెలుపలి భాగం ఎక్కువగా డ్యామేజ్ కాలేదు. కానీ కారు చెరువులోకి ఎలా పడిందో ఖచ్చితమైన కారణం ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. హ్యాండ్ బ్రేక్ లేకపోవడం లేదా హ్యాండ్ బ్రేక్ హోల్డింగ్ కెపాసిటీలో లోపం ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఘటనలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగకపోవడం అదృష్టమనే భావించవచ్చు. లేదంటే అంత ఎత్తులో నుంచి కిందపడినప్పుడు కారు డోర్లు మూసివేసి మునిగిపోయి ఉంటే వారిని కాపాడటం సాధ్యం కాకపోయి ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో డ్రైవర్ చాలా జాగ్రత్తగా ఉంటేనే ప్రమాదాలను నివారించవచ్చు.

మీ కారు కిందకు దూసుకెళ్లకుండా హ్యాండ్‌బ్రేక్ ఉన్నా, కొన్నిసార్లు అది విఫలమవుతుందనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. కాబట్టి కారు చక్రం ముందు రాయిని ఉంచడం వల్ల వాహనం కొండ అంచు వాలుపై ఉన్నా స్థిరంగా ఉంటుంది. ఈ టెక్నిక్‌ను సాధారణంగా ప్రతి ఒక్కరూ పాటిస్తారు. అయితే ఇటీవల హ్యాండ్ బ్రేక్ ఉందన్న నమ్మకంతో కొందరు ఈ ట్రిక్కులు పాటించడం లేదు.
అయితే, అటువంటి ప్రమాదాలను నివారించడానికి, అదనపు జాగ్రత్తలను ఉపయోగించడం చాలా ముఖ్యం. మీ వాహనాన్ని గేర్‌లో పార్క్ చేయడం మరొక ముందు జాగ్రత్త. వాహనాన్ని గేర్‌లో ఉంచడం వలన ఆపివేసినట్లయితే అది స్థిరంగా ఉంటుంది. సాధారణంగా పాత వాహనాలు బలహీనమైన హ్యాండ్‌బ్రేక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
గేర్‌లో పార్క్ చేసినప్పుడు ఇది ట్రాన్స్‌మిషన్‌పై మరింత ఒత్తిడిని కలిగించినప్పటికీ, మీ వాహనాన్ని వంపుల్లో జారి కిందికి వెళ్లకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. గేర్‌లో పార్కింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు ట్రాన్స్‌మిషన్‌కు హాని కలిగే అవకాశం ఉంది. కానీ కొండ వాలుపై జారి ప్రమాదానికి దారి తీయడం కంటే ఇది మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








