CAT III B టెక్నాలజీ గురించి తెలుసా.. దట్టమైన పొగమంచు ఉన్న సమయాల్లో విమానాల ల్యాండింగ్‌కు ఎలా ఉపయోగపడుతుంది?
దేశంలో దట్టమైన పొగమంచు కారణంగా అనేక ప్రాంతాల్లో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఈ పొగమంచు కారణంగా మంగళవారం సుమారు 120 విమానాలు ఆలస్యంగా ప్రయాణం చేశాయి. ఇందులో 55 దేశీయ విమానాలు, 17 అంతర్జాతీయ సర్వీసులు ఆలస్యంగా ప్రయాణం ప్రారంభించాయి. దీంతోపాటు 39 దేశీయ, 12 అంతర్జాతీయ విమానాలు తక్కువ విజిబిలిటీ కారణంగా ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరుకున్నాయి.
డిసెంబర్ 25న ఉదయం 5:30 గంటల నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు కురుస్తోందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. డిసెంబర్, జనవరి నెలల్లో దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ తక్కువగా ఉంటుందని తెలిపింది. ఈ కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడవడం సహా పూర్తిగా రద్దు కావడం జరుగుతుందని పేర్కొంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు ప్రత్యేక నావిగేషన్ వ్యవస్థ CAT III B ద్వారా నిర్వహించబడతాయి. దీని ద్వారా కనీసం 50 మీటర్ల విజిబిలిటీతో విమానాల ల్యాండింగ్‌కు అనుమతిస్తుంది. ఈ నావిగేషన్ వ్యవస్థ లేని విమానాలు ఈ పరిస్థితుల కారణంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిడెట్ తెలిపింది.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం యాంటీ ఫాగ్ ల్యాండింగ్ సిస్టమ్ (CAT III B)- ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థ రేడియో సిగ్నల్ మరియు అధిక తీవ్రత కలిగి లైటింగ్ ద్వారా తక్కువ విజిబిలిటీ ఉన్న సమయాల్లో ల్యాండింగ్ చేసేందుకు సాయం చేస్తుంది.

CAT III B నావిగేషన్ వ్యవస్థ దట్టమైన పొగమంచు, మరియు విజిబిలిటీ తక్కువగా ఉన్న సమయాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కనీసం 50 మీటర్ల విజిబిలిటితో విమానాల ల్యాండింగ్‌కు అనుమతి ఇస్తుంది. విమానాశ్రయాల్లో ఈ నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటుచేసేందుకు రూ.10 కోట్ల వరకు వ్యయం అవుతుంది. మరియి నిర్వహణ వ్యయం రూ.50 లక్షల వరకు అవుతుందని తెలుస్తోంది. కోలకతా ఎయిర్‌పోర్టులో ఈ ప్రత్యేక నావిగేషన్ వ్యవస్థను రూ.130 కోట్లతో ఏర్పాటుచేశారు.
దట్టమైన పొగమంచు, ఇతర ప్రతికూల పరిస్థితుల కారణంగా పైలెట్‌కు రన్‌వే కనిపించనప్పుడు భూమి నుంచి 100 మీటర్ల వరకు ఈ CAT III B నావిగేషన్ వ్యవస్థ ద్వారా పైలెట్‌కు మార్గనిర్దేశం చేస్తారు. ఈ వ్యవస్థ ద్వారా భూమి నుంచి 50 అడుగుల ఎత్తువరకు విమానం చేరుకున్నప్పుడు.. టచ్‌డౌన్ జోన్ లైటింగ్ సిస్టమ్ ద్వారా ల్యాండింగ్ చేస్తాడు.

అయితే ఈ ప్రక్రియ అంతా ఆటోమేటిక్ మరియు వాయిస్ ప్రాంప్ట్ ద్వారా జరుగుతుంది. రన్‌వేకు విమానం ఎంత ఎత్తులో ఉంది, ప్లాప్, బ్రేక్‌లు ఎప్పుడు ఉపయోగించాలనే సమాచారం ఇస్తుంది. ఢిల్లీ విమానాశ్రయం ఇప్పటికే ఈ వ్యవస్థను కలిగి ఉంది. దీంతోపాటు అమృత్‌సర్, లక్నో, కోలక్‌తా ఎయిర్‌పోర్టుల్లో ఈ ప్రత్యేక నావిగేషన్ వ్యవస్థ ఉంటుంది.
ఎయిర్‌లైన్స్ ఈ నావిగేషన్ వ్యవస్థ సర్టిఫికేషన్‌ను పొందాల్సి ఉంటుంది. దీంతో ఎయిర్‌లైన్స్ సంస్థలు కూడా తమ పైలెట్లకు ఈ CAT IIB నావిగేషన్ వ్యవస్థపైన శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సాంకేతికత లేని విమానాలు పొగమంచు, తక్కువ విజిబిలిటీ ఉన్న ప్రాంతాల్లో ల్యాండింగ్ చేయలేవు. ఇండిగో, విస్తారా ఎయిర్‌లైన్ ఈ వ్యవస్థను కలిగి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








