EMI భారం తగ్గిపోగా, సేవింగ్స్ పెరుగుతుంది! కార్స్, బైక్స్‌పై జీఎస్టీ తగ్గింపుతో మధ్యతరగతి ముఖాల్లో నవ్వులు
భారతదేశంలో మధ్యతరగతి వర్గం ఎప్పటినుంచో ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాగా నిలుస్తూ వస్తోంది. దేశ జనాభాలో పెద్ద భాగం ఈ వర్గానిదే. రోజువారీ అవసరాలు, లైఫ్‌స్టైల్, ఖర్చులు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. అందుకే వాహనాలను కొనుగోలు చేసే సమయంలో ధరల విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. కార్లు, బైకులు, స్కూటర్లు వంటి వాహనాలు మధ్యతరగతి కుటుంబానికి కేవలం సౌకర్యమే కాకుండా, ఒక కలల సాధనంగా మారతాయి. కానీ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల తమ కలలను వాయిదా వేసుకునే పరిస్థితి చాలా మందికి ఎదురయ్యేది. ఇలాంటి సమయంలో వస్తువులు, సేవల పన్ను (GST) తగ్గింపు రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మధ్యతరగతి ప్రజలకు నిజమైన ఊరటను కలిగించింది.
ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన తీసుకున్న తీర్మానం దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని ఒక కొత్త దిశలోకి నడిపేలా మారింది. ఇప్పటి వరకు వాహనాలపై 28 శాతం జీఎస్టీ విధిస్తుండగా, దాన్ని నేరుగా 18 శాతానికి తగ్గించారు. ఈ మార్పు వల్ల వాహనాల ధరలు గణనీయంగా తగ్గి, సాధారణ వినియోగదారులకి కొత్త వాహనం కొనుగోలు చేయడం మరింత సులభం అవుతుంది.

కార్ల విషయంలో, 1500 సీసీలోపు డీజిల్, డీజిల్ హైబ్రిడ్ మోడళ్లు, అలాగే 1200 సీసీలోపు పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్, సిఎన్‌జి, ఎల్పీజీ వాహనాలకు కొత్త పన్ను శ్లాబ్ ప్రకారం ఇకపై 18 శాతం మాత్రమే పన్ను చెల్లించాలి. అంతకు ముందు ఉండే సెస్సు కూడా తొలగించబడింది. దీనివల్ల చిన్న, మధ్యతరహా కార్లు మరింత సరసమైన ధరల్లో లభ్యమవుతాయి. ఇది సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తుంది.
టూ-వీలర్స్ విషయానికి వస్తే, 350 సీసీ కంటే తక్కువ కెపాసిటీ ఉన్న మోడళ్లకు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. అంటే బైకులు, స్కూటర్లు కొనాలనుకునే వారికి ఇది బంపర్ ఆఫర్ లాంటిదే. అయితే 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న బైకులు లగ్జరీ సెగ్మెంట్‌లోకి వస్తాయి కాబట్టి వాటిపై 40 శాతం జీఎస్టీ పన్ను కొనసాగనుంది. ఈ మార్పులు వాహనాల ధరలను గణనీయంగా తగ్గిస్తాయి.

ముఖ్యంగా దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలు టూవీలర్ లేదంటే అందుబాటు ధరలో కార్లను ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు కాబట్టి, ఇలాంటి వారు ఇకపై వాహనాలను కొనుగోలు చేసే సమయంలో EMIలు కూడా తగ్గుతాయి. దేశంలో ఒక మధ్య తరగతి వ్యక్తి బడ్జెట్ స్కూటర్ అంటే, రూ.ఒక లక్ష లోపు ఉన్నదాన్ని కొనాలంటే, ఇకపై దాదాపుగా 6 నుంచి 7 వేల రూపాయల వరకు తగ్గింపు పొందవచ్చు.
అదే సమయంలో కారును కొనుగోలు చేయాలని ఆలోచన చేసినప్పుడు కంపెనీ, వేరియంట్, మోడల్‌ను బట్టి దాదాపు రూ.ఒక లక్ష నుంచి రూ. రెండు లక్షల లోపు ఆదా చేసుకోవచ్చు. సాధారణంగానే కార్లపై EMI లు అనేవి ఎక్కువగానే ఉంటాయి. దీంతో వీటిపై కూడా తగ్గింపు లభిస్తుంది. కార్ల ఎక్స్‌షోరూమ్ ధరలు తగ్గడంతో ఆన్‌రోడ్ వచ్చేసిరికి ముందు ధరతో పోలిస్తే కొత్త ధరలో అయితే భారీగానే డబ్బులు ఆదా అవుతాయి.

మిగిలిన డబ్బులను మధ్యతరగతి ప్రజలు మిగతా ఖర్చులకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఒకప్పుడు ఎక్కువ ఖరీదైన కారు అని కొనుగోలు చేయడానికి కూడా వెనకడుగు వేసిన వారు ఇప్పుడు హాయిగా కొనుగోలు చేయవచ్చు. టూవీలర్ను కూడా తమకు నచ్చిన దాన్ని తక్కువలో సొంతం చేసుకోవచ్చు. కుటుంబ అవసరాల కోసం లేదా డైలీ కమ్యూట్ కోసం వాహనం కొనాలనుకునే వారు ఇకపై ఎక్కువ ఆర్థిక భారం లేకుండా తమ కలను నెరవేర్చుకోగలుగుతారు.
మొత్తం మీద, ఆటోమొబైల్ రంగంలో GST తగ్గింపు మధ్యతరగతి ప్రజలకు ఒక గొప్ప బహుమతిగా మారింది. ఇది కేవలం వాహనాల అమ్మకాలను పెంచడం మాత్రమే కాదు, తయారీ రంగానికి, ఉద్యోగ అవకాశాలకు, మొత్తం ఆర్థిక వృద్ధికి కూడా ప్రోత్సాహం ఇస్తుంది. ఆర్థికంగా లాభం పొందడమే కాకుండా, తమ కలల వాహనాన్ని తక్కువ ధరలో ఇంటికి తీసుకురావడానికి మధ్యతరగతి ఇప్పుడు మరింత దగ్గరలో నిలిచింది.


Click it and Unblock the Notifications








